10, జూన్ 2025, మంగళవారం

తిరుమల సర్వస్వం -266*

 *తిరుమల సర్వస్వం -266*

 *శ్రీవారి సంవత్సర సేవలు - 3* 

 *రథసప్తమి* 


 తన పేరులోనే శ్రీమన్నారాయణుని పదిల పరచుకొన్న 'సూర్యనారాయణుడు' శ్రీమహావిష్ణువు యొక్క పరమ భక్తుడే కాకుండా ఆప్తమిత్రుడు, శ్రేయోభిలాషి కూడా! శ్రీమహాలక్ష్మికి కూడా సన్నిహితుడే! అటువంటి సూర్యుని జన్మదినమైన మాఘశుద్ధ సప్తమి నాడు హైందవులందరూ 'రథసప్తమి పర్వదినాన్ని వైభవోపేతంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపు కుంటారు. 


 తిరుమలలో జరిగే రథసప్తమి ఉత్సవంలో సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుని ఉత్సవమూర్తియైన మలయప్పస్వామి వారే ఉభయదేవేరుల సమేతంగా పాల్గొని ఉత్సవానికి వన్నె తెస్తారు. ఈ సందర్భంలో సూర్యుని గురించిన కొంత ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం.


 *సప్తాశ్వరథారూఢుడు* 


 సూర్యభగవానుడు సప్తాశ్వరథారూఢుడై, జగత్తంతా అవిశ్రాంతంగా వాయువేగ మనోవేగాలతో పర్యటిస్తూ తన దివ్యకాంతులతో సమస్త సృష్టిని చైతన్యవంతం చేస్తాడు. సూర్యుడు అధిరోహించిన రథం బృహతి, గాయత్రి, ఉష్టిక, జగతి, పంక్తి, త్రిష్టుప్, అనుష్టుప్ అనే ఏడు అశ్వాల ద్వారా లాగబడుతుంది. ఈ ఏడు గుర్రాల పేరిట, సంస్కృతభాషలో ఏడు 'ఛందస్సులు' ఉన్నాయి. సంస్కృతం లోని శ్లోకాలు, స్తోత్రాలు మొదలైనవన్నీ ఈ ఏడు ఛందస్సుల్లోనే వ్రాయబడ్డాయి. ఉదాహరణకు శ్రీవిష్ణుసహస్రనామం, శ్రీలలితాసహస్రనామం అనుష్టుప్ ఛందస్సులో రచించబడ్డాయి.

2ఈ రథం 'అనూరుడు' అనే రథికుని సారథ్యంలో నడుపబడుతుంది. అయితే, కొన్ని పురాణాలలో సూర్యుని రథం పేరు 'సప్త' అని, ఆ రథాన్ని కేవలం ఒకే ఒక్క అశ్వం లాగుతుందని, అందువల్ల ఆ అశ్వాన్ని 'సప్తాశ్వం' గా పిలుస్తారని, ఆ అశ్వమే ఏడు రూపాలలో గోచరిస్తుందని చెప్పబడింది.


 *రథసప్తమి ఉత్సవం* 


 తన ఆదేశం మేరకు విశ్వమంతా సంచరిస్తూ, కాలచక్రం గతులు తప్పకుండా తన వంతు కృషి సలుపుతున్న సూర్యనారాయణునికి, వారి జన్మదినోత్సవ సందర్భంగా అభినందనలు తెలుపడానికై మలయప్పస్వామి మాడవీధుల్లో ఊరేగడమే 'రథసప్తమి ఉత్సవం'. సూర్యుడు కాలచక్ర సంచాలనంలో వ్యస్తుడై ఉండటం వల్ల, తన భక్తుని అభినందించే నిమిత్తం శ్రీవారే ఆనందనిలయం నుంచి బయటకు వస్తారన్నమాట. భక్తుల దరి జేరటానికై భగవంతుడు సదా ఆరాట పడటం సహజమే కదా!


 *సప్తవాహనారోహణం* 


 రథసప్తమి నాడు, సప్తరథారూఢుని జన్మదినోత్సవంలో సప్తగిరీశుడు సప్తవాహనాలను అధిరోహిస్తాడు. శ్రీవారు ఉభయదేవేరుల సమేతంగా మొట్టమొదటగా సూర్యప్రభవాహనాన్ని అధిరోహిస్తారు. ఆ వాహనంలో ఊరేగుతున్న మలయప్పస్వామి వారి పాదపద్మాలను బాలభానుడు తన లేలేత కిరణాలతో స్పృశిస్తూ భక్తిపూర్వకంగా సేవించు కుంటాడు. తరువాత మలయప్పస్వామి వారు వరుసగా చిన్నశేషవాహనం, గరుడవాహనం, హనుమంతవాహనం, కల్పవృక్షవాహనం చివరగా చంద్రప్రభవాహనంపై ఊరేగుతారు. ఈ సందర్భంగా మలయప్పస్వామి వారు ఆదివరాహస్వామి ఆలయంలో పంచామృతాభిషేకాన్ని స్వీకరిస్తారు. తరువాత స్వామిపుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది.


 *ఒకరో'జు బ్రహ్మోత్సవం* 


 ఈ రథసప్తమి ఉత్సవం అత్యంత వైభవోపేతంగా, కన్నుల పండువగా జరగడం వల్ల; బ్రహ్మోత్సవాల తరువాత అతిపెద్ద సంఖ్యలో వాహనాలు పాల్గొనడం వల్ల దీనిని 'ఒకరోజు బ్రహ్మోత్సవం' గా కుడా పేర్కొంటారు. ఈ ఉత్సవాన్ని కాంచిన భక్తులపై శ్రీనివాసుని, సూర్యభగవానుని కరుణకిరణాలు ప్రసరించి ఐహికాముష్మికానందాలు సంప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.


*అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ మహోత్సవం* 


 *'అష్టబంధనము', 'బాలాలయము'* మరియు *'మహాసంప్రోక్షణము'* అనే మూడు మహత్తర వైదిక క్రతువుల సమాహారమే ఈ ఉత్సవం. ఈ ఉత్సవం దాదాపు అన్ని వైష్ణవాలయాలలో జరిగినప్పటికీ తిరుమలలో జరిగే ఉత్సవానికి ఎన్నో విశిష్ఠతలు, ఎంతో ప్రాముఖ్యం ఉన్నాయి. ఈ ఉత్సవం ఎందుకు, ఎలా జరుగుతుందనే వివరాల్ని ఈరోజు తెలుసుకుందాం.


 *విష్ణువు అంశ* 


 వైఖానస ఆగమం లోని *'మరీచి సంహిత'* ననుసరించి, స్వామివారి అర్చామూర్తిలో శ్రీమహావిష్ణువు అంశ నిరవధికంగా ఉండదు. కలియుగంలో దానికి పన్నెండు సంవత్సరాల కాలపరిమితి ఉంది. ఈ గడువు ముగిసే లోపు, విస్తారమైన వైదిక ప్రక్రియల ద్వారా మూలవిరాట్టులో విష్ణువు అంశను పునఃప్రతిష్ఠింప జేసి, స్వామివారి తేజస్సును ద్విగుణీకృతం చేసే మహోత్కృష్టమైన కార్యక్రమాన్నే *'అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ'* గా వ్యవహరిస్తారు. 


 అయితే, దీనికో మినహాయింపు ఉంది. ఈ సంప్రోక్షణా కార్యక్రమం దేవతలు, ఋషులు, చక్రవర్తుల వంటి వారి ద్వారా ప్రతిష్ఠించబడ్డ దేవతామూర్తులకే అవసరమని; సాక్షాత్తు దేవదేవుడే స్వయంగా వెలయడం వల్ల, స్వయంవ్యక్త క్షేత్రాలలో ఈ సంప్రోక్షణ జరుపనవసరం లేదని కూడా శాస్త్రాలలో చెప్పబడింది. కానీ, తిరుమల ఆలయం మాత్రం దీనికి భిన్నం. శ్రీవారి మూర్తి స్వయంవ్యక్తమే అయినప్పటికీ మిగిలిన అన్ని వైదిక క్రతువుల లాగా, మహాసంప్రోక్షణ కూడా ఎప్పటినుండో ఆనందనిలయంలో జరుపబడుతోంది.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: