1, జూన్ 2025, ఆదివారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌞ఆదివారం 1 జూన్ 2025🌞*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది...

``

      *వాల్మీకి రామాయణం*                

             *55వ భాగం*    

```

అప్పుడు సుగ్రీవుడు “రామా! నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటే ఏమిటో విన్నావు కదా. ఇది విన్న తరువాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉందా? వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడినవాడు కాదు, జీవితంలో ఓటమి అన్నది తెలీదు వాలికి. వాలి పేరు చెబితేనే పారిపోతారు. 15 సంవత్సరాలు రాత్రి-పగలు గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయన్ని సంహరించాడు. నేను ఇంకొక విషయం చూపిస్తాను, ఇక్కడ 7 సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా. మా వాలి రోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాల వృక్షాన్ని చేతులతో కుదుపుతాడు. ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామా?” అన్నాడు.


సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి…. “మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు కదా. వాలిని మా అన్నయ్య చంపగలడు, అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు?” అని అడిగాడు.


అప్పుడా సుగ్రీవుడు “మా వాలి ఈ ఏడు చెట్లని కుదిపెయ్యగలడు. రాముడు పోనీ అంత చెయ్యక్కరలేదు, బాణం పెట్టి ఒక సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందుభి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది. రాముడిని ఈ అస్థిపంజరాన్ని తన కాలితో తన్నమనండి, 200 ధనుస్సుల దూరం కాని రాముడు తంతే నేను నమ్ముతాను” అని లక్ష్మణుడితో అన్నాడు. 


అప్పడు రాముడు… “సరేనయ్యా అలాగే చేస్తాను. నీకు నమ్మకం కలిగించడం కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను” అన్నాడు.

```

*రాఘవో దుందుభేః కాయం పాద అంగుష్ఠేన లీలయా।*

*తోలయిత్వా మహాబాహుః చిక్షేప దశ యోజనం॥*

```

సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుభి కళేబరాన్ని తన బొటన వేలితో తంతే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్టు చూశాడు. 


కాని సుగ్రీవుడు “ఆనాడు వాలి 

ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో పచ్చిగా, చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందుభితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు, దానికితోడు తాగి ఉన్నాడు, తన భార్యలతో రమిస్తూ బయటకి వచ్చాడు, కావున అనేకరకములుగా బడలిపోయిన శరీరంతో ఉన్నాడు. కాని రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, మద్యాన్ని సేవించి లేదు, పరీక్షకి నిలబడుతున్నాను అనే పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం, అది ఒక యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం, దానిని 10 యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పేముంది. ఆ సాల వృక్షాన్ని కూడా కొట్టమను, అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం వాలిని సంహరించడానికి వెళదాము” అన్నాడు.


అప్పుడు రాముడు ఒక బంగారు బాణాన్ని చేతితో పట్టుకొని, వింటినారికి సంధించి, గురి చూసి ఆ 7 సాల వృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం 7 సాల వృక్షాలనీ పడగొట్టేసి, ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసి, భూమిలో పాతాళ లోకం వరకూ వెళ్ళి, మళ్ళి తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ములపొదిలో కూర్చుండిపోయింది.


రాముడి శక్తి ఏమిటో చూసిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. 


అప్పుడాయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. అప్పుడా సుగ్రీవుడు “రామా! నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను, ఇంక వాలి ఏమిటి. నువ్వు బాణ ప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు, వాలి దగ్గరికి వెళదాము పద” అన్నాడు.


“తప్పకుండా సుగ్రీవా, బయలుదేరదాము” అని అందరూ బయలుదేరారు. 


ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు, ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు.

```

*సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలినః పురీం।*

*వృక్షైః ఆత్మానం ఆవృత్య హి అతిష్ఠన్ గహనే వనే॥*

```

ముందు వెళుతున్న సుగ్రీవుడు కిష్కింద పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున, పైకి కనపడకుండా దాగి ఉన్నారు. 


లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటకి రమ్మన్నాడు. 


సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటకి వచ్చి “ఏరా బుద్ధిహీనుడా మళ్ళీ వచ్చావు, నా ప్రతాపం ఏమిటో చూద్దువు కాని, రా” అన్నాడు. 


అప్పుడా వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడి నవరంధ్రముల నుండి రక్తం ఏరులై పారింది. 


సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు, వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు. ఇద్దరూ అలా మోచేతులతో పొడుచుకుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. అలా కొంత సేపు కొట్టుకున్నాక, ఇంకా బాణం వెయ్యడం లేదు, రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటూ ఇటూ చూశాడు. కాని రాముడు కనపడలేదు. ఇంక వాలితో యుద్ధం చెయ్యలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు. అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు.


సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని, ఒంట్లోనుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ, ఆయాసపడుతూ, రోదిస్తూ ఉన్నాడు. 


ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు “ఏమయ్యా! నేను నిన్ను వాలిని చంపు, అని అడిగానా. నువ్వు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. ‘నేను వాలిని చంపను’ అని నువ్వు ఒకమాట చెబితే నేను వెళతానా? ఎందుకు కొట్టించావయ్యా నన్ను ఇలాగా?” అని రాముడిని ప్రశ్నించాడు.


అప్పుడు రాముడు… “సుగ్రీవా! నేను ఇంతకుముందెన్నడూ వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకొని వచ్చాను. తీరా వాలి బయటకి వచ్చాక నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు, వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్వినీ దేవతలు దెబ్బలాడుకున్నట్టు ఉంది. మీలో ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడో నాకు తెలీలేదు. పోని కంఠ స్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను, కాని ఇద్దరూ ఒకేలా అరిచారు. ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు, ఒకేలా అలంకారం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకున్నారు. నేను ఎలాగోలా నిర్ణయించుకొని, ఇతడే వాలి అయ్యుంటాడు అని బాణ ప్రయోగం చేశానే అనుకో, సుగ్రీవా! అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు. ఒకవేళ ఆ బాణము పొరపాటున నీకు తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండము.

```

        *రేపు...56వ భాగం*

 

*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

కామెంట్‌లు లేవు: