1, జూన్ 2025, ఆదివారం

నిజమైన శివాభిషేకం.

 శివాభిషేకం 

----------------


ఓ రాజుపై ఓ రోజు శత్రురాజు దండెత్తాడు. ఈ రాజు ఓడిపోయాడు.


నిండుగర్భవతి అయిన తన రాణితో గుఱ్ఱమెక్కి పారిపోయాడు.


మంత్రి కూడా పారిపోయి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.


శత్రుసైన్యం రాజు వెంట పడ్డారు....


అడవిలో ఓ బోయవాని గుడిసెలో రాణిని దిగబెట్టి...


"నేను ఎలాగూ శత్రుసైన్యం చేతిలో మరణిస్తాను. నీకు పుట్టబోయే బిడ్డను పెంచి పెద్ద చెయ్." అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు....


శత్రు సేనలు వెంటాడి రాజును పట్టుకోవడంతో రాజు కథ ముగిసింది.


గుఱ్ఱంపై రాజుకు ముందు భాగంలో రాణి కూర్చోవడం వల్ల, ఆ సేనకి రాణి ఉన్నట్టు తెలియలేదు.


అందువల్ల వారు వెను తిరిగి వెళ్లిపోయారు.


ఆ బోయవాళ్లు ఆ రాణిని చేరదీసి కన్న కూతురిలా చూసుకున్నారు.


కానీ వారికి ఆమె రాణి అనే విషయం తెలియదు.


త్వరలోనే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.

ప్రసవం కాగానే తల్లి కన్ను మూసింది.


12 ఏళ్ళు గడిచాయి....


ఆ రాచబిడ్డ బోయపిల్లలతో పెరిగి, బోయవాడిలాగే ఉన్నాడు...


రాజ్యప్రజలు మాత్రం శత్రురాజుతో ఎన్నో ఇబ్బందులు పడుతూ... మన మంచి రాజును కాపాడుకోలేకపోయామనే విచారంలో ఉన్నారు...


రాజుతో సహా రాణి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారని మంత్రికి తెలుసు....


ప్రస్తుతం వారి జాడను కనుక్కోవడానికి అంతటా గాలిస్తున్నాడు...


ఎట్టకేలకు బోయపల్లెలో రాజకుమారుడు మాత్రమే ఉన్నాడని కనుగొన్నాడు...


మంత్రి ఆ బోయవాళ్లకు జరిగిన విషయం అంతా చెప్పి, ఆ రాచబిడ్డను తనకు అప్పచెప్పమని కోరుతాడు....


వారు రాజ్య పరిస్థితిని అర్థం చేసుకుని బిడ్డను మంత్రికి అప్పగిస్తారు.


రాచబిడ్డ మాత్రం రానని మొండికేస్తాడు...


మంత్రి ఆ బిడ్డను తన వొళ్ళో కూర్చోబెట్టుకుని జరిగిన విషయమంతా వివరించి చెబుతాడు. 


నీ జీవితం ఈ అడవిలో గడపవలసింది కాదు... నీవు రాజ్యాన్ని పరిపాలించాల్సినవాడివి... మేము నీ నాయకత్వంలో శత్రువులతో పోరాడి గెలిచి, తిరిగి మన రాజ్యాన్ని పొందాలనుకుంటున్నాము.... అని నచ్చచెప్పి తనతో పాటు తీసుకెళ్లి విలువిద్యను, యుద్ధతాంత్రాలను నేర్పిస్తాడు. 


ఆ రాకుమారుడు మంత్రి సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. రాజవంశ వారసుడు వచ్చాడని విధేయులైన ప్రజలు అతని చుట్టూ పోగయ్యారు...


శత్రురాజు పై యుద్ధానికి వెళ్లారు. అవలీలగా యుద్ధంలో గెలిచారు కూడా.


* * *


తత్త్వమసి.... 

నీవే బ్రహ్మవు...  

అంటోంది ఛాందోగ్యం.... 


అదే నిజమైతే మరి సాధన ఎందుకు?


మనం బ్రహ్మమయ్యే ఉన్నప్పటికీ, మనం బ్రహ్మమే అనే స్పృహలో లేము.


మన గురించి మనం ఎరుగం.


మన గురించి మనకు నిజంగా తెలిసినట్లయితే....


ఈ దుఃఖాలను, ఈ కోరికలను, ఈ భయాలను అనుభవించం.


మనం అలలు అలలుగా విడిపోకుండా.... ఆనందసముద్రంలో ఏకం కాలేమా?


ఆ స్థితి ఒకటి ఉందనే స్పృహ లేకుండా తత్త్వమసి "అది నీవే అయి ఉన్నావు" అనే ఋషివాక్కును ఎలా అంగీకరించగలం?


* * *


ఆ బాలుడు...

రాజకుమారుడుగా మారాడా?

మార్చబడ్డాడా?


బోయ బాలుణ్ణి అనుకునేటప్పుడు కూడా అతడు రాజకుమారుడే.


అవునా? కాదా?


ఆరంభంలో అతడికి కూడా ఆ సంగతి తెలియదు.

అందువల్ల అతడు వేటగాడులా జీవించాడు.


అతను ఎప్పుడైతే తనను గురించి మంత్రి (గురువు ) ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాడో...


ఎప్పుడూ రాజకుమారుడే అయిన తాను స్వానుభవంతో తాను రాజకుమారుడే అనే వాస్తవాన్ని తెలుసుకున్నాడు.


ఇక్కడ బోయవాడు, రాజకుమారుడు అని ఇద్దరు లేరు. ఒకడు వేరొకడుగా మారలేదు. మొదట తానెవరో తెలియక జీవించినవాడే అతడు.


తెలియని అతడు వేటగాడిలా తక్కువస్థాయిలో జీవించాడు.


తెలుసుకున్న అతను రాజుగా ఉచ్ఛ స్థితికి ఎదిగాడు.


తరువాత శత్రురాజును (అహంభావాన్ని) గద్దె దింపడానికి పోరాడాడు (ఆత్మ విచారణ చేసాడు)


"తత్వమసి" అది నీవే అని గుర్తుకు తెచ్చేవాడే గురువు.


దానిని సదా మననం చేసుకుంటూ దానిని స్థిరపరచుకోవడమే సిద్ధి.


రమణునికి మధురైలో గుర్తుకు వచ్చింది.

అరుణాచలంలో పాతాళ లింగం వద్ద ఆ జ్ఞాపకాన్ని స్థిర పరచుకున్నాడు.


గురువు ద్వారా శ్రవణం.

నీకు నీవే మననం.

ఇదే గురుశిష్య సంబంధ ప్రయోజనం


మందులు ఎప్పటి వరకు వాడాలి అని అడిగితే, జబ్బు తగ్గేవరకు వాడాలి అంటాడు వైద్యుడు.


మననం ఎప్పటివరకు అంటే, తెలుసుకున్నది స్థిరమయ్యేవరకు అంటాడు గురువు.


గురువుతో గడపడం

సద్గ్రంథ పఠనం

జ్ఞానాంబ దర్శనం

అరుణాచల ప్రదక్షిణం


ఇవన్నీ "మననం"(గుర్తుకు తెచ్చుకోవడం) లో భాగమే.


* * *


బోయవాడి ముసుగులో ఉన్న రాకుమారుడిలా మనమంతా ప్రాపంచిక జీవితాన్ని గడుపుతూ జీవాత్మ ముసుగులో ఉన్నాం. 


నిజానికి మనమంతా కూడా బ్రహ్మమే. 

మన వేషం ఏదైనా, సత్యం మనలోనే ఉంది. 


మంత్రి వచ్చి నీవు రాజ కుమారుడివి అని గుర్తు చేసినట్టు, నీవు బ్రహ్మమే అని గురువొచ్చి గుర్తుచేస్తాడు. 


తాను రాకుమారుడే అని తెలిసినప్పటికీ రాజు కావడానికి యుద్ధ తంత్ర కళను నేర్చుకుని శత్రువులను నిర్మూలించి రాజయ్యాడు.


అదే విధంగా ఆత్మానుభవం పొందటానికి కర్మ భక్తి జ్ఞానమనే సాధనా మార్గాలతో చిజ్జడగ్రంథిని ఛేదించాలి. అనగా పరమ శత్రువైన అహాన్ని అంతం చేసి ఆత్మసామ్రాజ్యనేత కావాలి.


అందుకే ఉపనిషత్తులు జ్ఞానిని "సామ్రాట్" అన్నాయి.


* * *


హఠయోగం - కర్మమార్గం.

శరణాగతి - భక్తిమార్గం.

విచారణ - జ్ఞానమార్గం.


వారి వారి స్వభావాన్ని అనుసరించి, ఆయా మార్గాన్ని ఎన్నుకుని తరిస్తుంటారు. 


* * * 


రాతిని శిల్పంగా మలుచుకున్నట్లు, 

హఠయోగి తనను తాను బ్రహ్మంగా మలచుకుంటాడు.


మంచుగడ్డ నీరుగా మారుకున్నట్టు

భక్తియోగి భావసంపద వల్ల జీవాత్మ కరిగి, బ్రహ్మంగా మారుకుంటాడు.


అద్దంలో తనను తాను చూసుకుని తన జుట్టును, బొట్టును సవరించుకున్నట్టు, గురుబోధ అనే అద్దం సహాయంతో తనలో తాను విచారణ చేసి తనను తాను తెలుసుకుని బ్రహ్మంగా మారుకుంటాడు.


* * *


గురువుతో సహవాసమే(సత్సంగమే) జ్ఞానమార్గం.


మొక్కని అంటుకట్టినట్టు... 

గురువును అంటిపెట్టుకుని ఉంటే, కొంతకాలానికి తన హృదయంలో జ్ఞానపుష్పం వికసిస్తుంది.


గురుసన్నిధిలో, దైవసన్నిధిలో మంచుగడ్డ(వ్యక్తిత్వభావన) దానికదే కరుగుతుంది...


అలా గురుసన్నిధిలో గడిపి బాబు అనే బాలుడు కరిగి జ్ఞానశిశువు అయ్యాడు.


అలా దైవసన్నిధిలో గడిపి గదాధర్ అనే బాలుడు కరిగి పరమహంస అయ్యాడు.


కరగడానికి ముందు తాను సిద్ధపడాలి.

దేవుని వద్దకు అడగడానికి వెళతాడేగానీ, కరగడానికి వెళ్ళడు.


కరగడానికి ఇష్టపడడు.


తాయుమానవర్ అనే సిద్ధుడు అంటారు-

"రాయి కూడా ఒకప్పుడు కరుగుతుంది. కానీ నా మనసు కరగడం లేదు." అని. 


కర్మలోనో, భక్తిలోనో, జ్ఞానంలోనో 

మన మనసు కరిగి నీరైపోవాలి. ఆ నీటితో శివునికి అభిషేకం చేయాలి. 

అదే నిజమైన శివాభిషేకం.


* * *


జ్ఞానశిశువు

9533667918

కామెంట్‌లు లేవు: