🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🌞ఆదివారం 22 జూన్ 2025🌞*
``
*రామాయణం*
ఒకసారి చదివినంత
మాత్రాన మన సమస్త
పాపాలని తీసేస్తుంది. ``
*వాల్మీకి రామాయణం*
*76వ భాగం*
```
హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి… “నాయనా! నాకు తెలుసు నువ్వు ఎవరివో. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుత్మంతుడికి ఉంది, నీ తండ్రి వాయుదేవుడికి ఉంది, నీకు ఉంది. నువ్వు ఇంత సమర్ధుడవు కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరికి పంపరు. నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డురావచ్చు, అప్పుడు నీకు, వాళ్ళకి యుద్ధం జరగచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావా లేక నన్ను కాపాడుకుంటావా. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళీ రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను
నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. ‘అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను, నిన్ను క్షేమంగా రాముడి దగ్గరికి తీసుకువెళతాను’ అని అంటావేమో, నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి” అన్నది.
అప్పుడు హనుమంతుడు… “ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా
'నేను రాను' అనడం నీకే చెల్లింది తల్లీ. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా, పోని రాముడి దగ్గరికి నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యడానికి ఏదన్నా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లీ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది… “ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లోఆడుకొని, తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు.
(రాముడికి రావణుడికి అప్పటి వరకూ ఎటువంటి శత్రుత్వం లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలలో అరణ్యవాసం పూర్తయ్యి రాముడు అయోధ్యకి వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసం రావణుడు సీతమ్మని ఎలాగూ అపహరిస్తాడు, కాని సీతమ్మకి ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు) ఆ సమయంలో నేను కొన్ని మాంసపు ఒరుగులు(వడియాలు) అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు.
అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒరుగులని తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో గాడి చేసి నా మాంసం పీకింది. ఆ బాధతో నేను గిలగిలలాడడం వలన నా వడ్డాణం జారింది, నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి 'సీతా! కాకి మీదకి బంగారు వడ్డాణం విసురుతావా' అన్నాడు. తరువాత నేను ఆ బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తల పెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను, అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఆ కాకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళీ గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తినింది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుకారి రాముడి నుదిటి మీద పడింది. అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది 'ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు?' అని గద్దించాడు. (సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు) అప్పుడాయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది.
అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని(గడ్డిని) తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి (మంత్రపూరితమైన అస్త్రాలని ప్రయోగించేటప్పుడు బాణాలే అవసరంలేదు, దేనిమీదన్నా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించచ్చు) విడిచిపెట్టాడు. అప్పుడా బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది, ఆ కాకి మూడు లోకములు తిరిగి అందరి దగ్గరికి వెళ్ళింది, కాని అందరూ 'రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో' అన్నారు.
ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటకి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది (మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్నవాడిని ఆ అస్త్రం కొట్టదు, ఎదురుతిరిగి యుద్ధం చేసినవాడినే అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురుతిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు).
రాముడు ఆ కాకిని చూసి 'నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టే. అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కాని ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చెయ్యాలి, మరి నువ్వు ఏమిస్తావు' అని ఆ కాకాసురుడిని రాముడు అడిగాడు.
అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి, వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవ్వాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు” అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది.
తరువాత సీతమ్మ అంది…
“శత్రువులను సంహరించగలిగిన సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్య దేవి లోకమునంతటిని రక్షించే కొడుకుని కనింది, ఆ రాముడి పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటే లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణం. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు, ఆ లక్ష్మణుడిని కుశలమడిగానని చెప్పు. సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమా!
నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో నాయందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దీపింప చేసి నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి” అన్నది.
అప్పుడు హనుమంతుడు “అమ్మా! కాకాసుర వృత్తాంతం చెప్పావు, దీనితోపాటుగా ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తావా, తీసుకువెళతాను" అన్నాడు.```
*రేపు…77వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🚩మంగళవారం 24 జూన్ 2025🚩*
``
*రామాయణం*
ఒకసారి చదివినంత
మాత్రాన మన సమస్త
పాపాలని తీసేస్తుంది.
``
*వాల్మీకి రామాయణం*
*78వ భాగం*
```
హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకొని ఉత్తర దిక్కుకి వచ్చి “లంకా పట్టణానికి రావడమూ అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడమూ అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెబుదాము, ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో. కాని దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగు ఇవ్వడు, అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదా వనాన్ని(అశోక వనం) నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు” అని అనుకొని, భీమరూపుడై ఆ అశోక వనం మీద ఎగిరాడు. అప్పుడాయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. అలాగే హనుమ చేసిన మహా నాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కిందపడిపోయాయి. ఆయన అక్కడున్న సరోవరారలోని నీళ్ళని బయటకి తోసేశాడు. అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు. అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి… “ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చుని ఉండడం చూశాము. ఆ కోతి నీ దగ్గరికి వచ్చి కిచకిచ లాడినట్టు మాకు అనుమానం, ఆ కోతి ఎవరు?” అని అడిగారు.
అప్పుడు సీతమ్మ అన్నది… “పాము కాళ్ళు పాముకి తెలియాలి. ఆయన రాక్షసుడో, వేరొకడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉంది. ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు” అంది.
అప్పుడా రాక్షస స్త్రీలు పరుగు పరుగున రావణుడి దగ్గరికి వెళ్ళి… “ఎక్కడనుంచి వచ్చిందో కాని మహా వానరము ఒకటి వచ్చింది. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలీదు. అది అశోక వనం అంతటినీ నాశనం చేసింది, కాని సీత కూర్చున్న శింశుపా వృక్షాన్ని మాత్రం అది వదిలిపెట్టేసింది. అలసట చేత వదిలిపెట్టిందో, కావాలని వదిలిపెట్టిందో తెలీదు. అలసట అని అనుకోడానికి వీలులేదు, ఎందుకంటే ఇంత అశోక వనాన్ని నాశనం చేసిన వానరానికి శింశుపా వృక్షాన్ని నాశనం చెయ్యడం పెద్ద లెక్కా, అది కావాలనే వదిలిపెట్టింది. నువ్వు ఏ కాంత మీదైతే నీ మనస్సుని, కామాన్ని ఉంచావో, ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది” అని చెప్పారు.
అప్పుడు రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చి 80,000 రాక్షస కింకరులని పిలిచి… “మీరందరూ వెళ్ళి ఆ మహా వానరాన్ని పట్టి బంధించండి, లేకపోతే సంహరించండి” అని చెప్పి పంపించాడు.```
*జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః।*
*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః॥*
*దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః।*
*హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః॥*
*న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్।*
*శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః॥*
*అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్।*
*సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్॥*```
(ఈ శ్లోకాలని జయ మంత్రము అంటారు)
```
*రేపు…79వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి