7, జులై 2025, సోమవారం

హిందూ వివాహప్రక్రియలో

 🙏హిందూ వివాహప్రక్రియలో ముఖ్య ఘట్టాలు 🙏

                  మూడవ భాగం 

సఖా సప్తపదా భవ. సఖాయౌ సప్తపదా బభూవ. సఖ్యంతే గమేయం. సఖ్యాంతే మా యోషం. సఖ్యాన్మే మా యోష్టాః సమయావ. సంకల్పావహై. సంప్రియౌ రోచిష్నూ సుమనస్యమానౌ ఇష మూర్జ మభి సంవసానౌ సం నౌ మనాంసి సంవ్రతా సముచిత్తాన్యకరమ్.

భావం:- నాతో ఏడడుగులు నడిచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరం కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులమౌతాం. అప్పుడు నేను నీ స్నేహాన్ని ప్రేమను పొందుతాను. నీ స్నేహన్నుంచి ఎన్నటికి వియోగం పొందను. నా స్నేహంనుంచి నీవెన్నడూ వియోగం పొందకు. పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలిసి వుందాం. కలిసి ఆలోచించుకుందాం. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాం. అలాగే అన్ని నియమాల్లోను కలిసి ఉంటూ నడుచుకుందాం.

అరుంధతీ నక్షత్రం:- వివాహం జరిగిన తర్వాత వధూవరులకు ధ్రువనక్షత్రమును, తర్వాత అరుంధతీ నక్షత్రమును పురోహితుడు చూపించి నమస్కారం చేయమని చెప్తాడు. ఎందుకంటే వారు ధ్రువనక్షత్రంలాగా నిశ్చలమైన మనస్థత్వాలతో స్థిరంగా వుండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత కావాలనే ఉద్దేశ్యం ఇందులో వుంది.

వధూవరులబాసలు:- మొత్తం వివాహ ఘట్టంలో వధూవరులమద్య హైందవ జీవనానికి ప్రయోజనం కలిగించే బాసలు ఎన్నో వుంటాయి. అందులో కొన్ని..

వరుడు ఇలా కోరుకుంటాడు - 

లోకోపకార స్వభావంగల అగ్నిదేవుడు ఈ వధువుకు వివాహం అయిన తర్వాత పుట్టింట మీద మమకారం తగ్గించి అత్తింటి మీద అభిమానం కలదానిగా చేయాలి. బ్రహ్మదేవుడు మా ఇద్దరికీ సకలసంపదలను ఇచ్చి దీర్ఘాయుష్యాన్ని అనుగ్రహించాలి. సుమంగళిగా, సౌభాగ్యవతిగా, దీర్ఘాయుష్యంతో ఉండే ఈ వధువును ఇంకా ఇంకా సుమంగళి, సౌభాగ్యవతి, దీర్ఘాష్మంతురాలు కావాలని పెద్దలైన మీరందరూ ఆశ్వీరదించి మీ మీ ఇండ్లకు వెళ్ళండి అని కోరుతాడు.

వధువు ఇలా కోరుకుంటుంది - 

నిన్ను నా అభిప్రాయంలను ఎరిగినవాణ్నిగాను, మంచి సంస్కారంతో పుట్టినవాడిగాను, మంచినియమాలతో నిజాయితితో పెంచుకున్న తేజస్సుగలవానిగా నేను గ్రహించాను. సంతానాభిలాషగల నీవు నాతో సంతానాన్ని కని, ధర్మంగా సిరిసంపదలను సంపాదించి సుఖంగా జీవితాన్ని గడపాలి అని కోరుకుంటుంది.

అటుపై వధూవరులిద్దరు ఇలా కోరుకుంటారు - 

సమంజంతు విశ్వే దేవా స్సమాపో హృదయాని నౌ / సం మాతరిశ్వా సం ధాతా సముదేష్ట్రీ దిదేష్టు నౌ //

భావం:- విశ్వదేవులు, పవిత్రజలాలు, వాయువు, బ్రహ్మ మన మనస్సులను ఎన్నటికీ స్నేహంతో కలిసిపోయేటట్లు చేయాలి. వాగాధిదేవత సరస్వతి మనమెప్పుడు ప్రేమతో అభిమానంతో అనుకూలంగా మాట్లాడుకొనేటట్లు అనుగ్రహించాలి అని కోరుకోగా ...

పెద్దలు ఇలా ఆశ్వీరదిస్తారు -

అభివర్ధతాం పయసాభిరాష్ట్రేణ వర్ధతామ్ / రయ్యా సహస్రపోషసే మౌస్తా మనపేక్షితౌ //

భావం:- ఈ వధువు పాడిపంటలతోను, ఇండ్లతోను, భూములతోను, సంపదతోనూ, సకలసౌఖ్యలతో తులతూగుతూ మాకందరికీ అభివృద్ధిని కలిగించాలి. ఈ దంపతులు సకల సంపదలతో, సర్వ సమృద్ధి లతో దేనికీ ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి.

పుత్రిణేమా కుమారిణా విశ్వమాయుర్వ్యశ్నుతమ్ / ఉభా హిరణ్యపేశసా వీతిహోత్రా కృతద్వసూ //

భావం:- పదహారువన్నెల బంగారంలాగా పచ్చగా ప్రకాశిస్తున్న ఈ కొత్తదంపతులు కొడుకులు, కూతుళ్ళతో ఈ సమాజంలో మంచిపనులు చేస్తూ, సిరిసంపదలనుభవిస్తూ దీర్ఘాయుష్యాన్ని పొందాలి.

వధూవరులకు కొన్ని సూచనలు -

పెళ్లన్నది నూరేళ్ళ పంట అని, ఏడేడు జన్మలబందమని పెద్దలంటారు. ఇటువంటి బందాన్ని ఆనందంగా అన్యోన్యతగా ఉండాలనుకుంటే దంపతులమద్య చక్కటి అవగాహన, పరస్పర నమ్మకం, సానుకూలదృక్పదం తప్పనిసరిగా ఉండాలి. 

అనుకోనిసందర్భాలయందు ఏ పరిస్థితులకారణంగానైనా ఇద్దరిమద్య కోపతాపాలు, పట్టింపులు చోటుచేసుకున్నప్పుడు మనది జీవితకాల శాశ్వతబందమన్న సత్యాన్ని మరువక కాస్త సర్దుకుపోవడం ఇద్దరికీ తప్పనిసరి.

జీవితరధానికి ఇద్దరు రెండుచక్రాలు. కనుక దంపతులు వారివారి సమస్యలను, మాటపట్టింపులను అనురాగంతో అవగాహనతో వారే పరిష్కరించుకోవడం ఉత్తమం.

భిన్నకుటుంబంలో పుట్టి విభిన్న వాతావరణంలో పెరిగిన వధువు, వరుడు వివాహం ద్వారా దగ్గరౌతారు. తమని ఒకటిచేసిన వివాహబంద విలువను గ్రహించి వారివారి భావనలను అలవాట్లును అర్ధవంతంగా ఆరోగ్యవంతంగా ఒకటిగా చేసుకొని నడుచుకోవాలి.

భర్తకు సంబందించిన అన్ని బాధ్యతలందు భార్య పాలుపంచుకోవాలి. భర్తను అనుసరిస్తూ, అతనిని అర్ధంచేసుకుంటూ మనస్సులో మనసై, తనువులో తనువై ఆనందంగా ప్రవర్తించాలి. మృదుమధురంగా మనుగడ సాగిస్తూ మగని మన్నన పొందగలగాలి. కుటుంబగౌరవప్రతిష్టలు ఇల్లాలిపైనే ఆధారపడివుంటుంది కాబట్టి భర్త కుటుంబంను భార్యగా, కోడలుగా, వదినగా, తల్లిగా చక్కగా నేర్పుగా ఇంటిలో పెద్దల సలహాలతో నిర్వహించగలగాలి. అత్తవారింట్లో అత్తమామయ్యలను, ఆడబిడ్డలను, తోడికోడళ్ళను, బావామరుదులను, ప్రేమగా చక్కగా చూసుకుంటూ ఇంటికి దీపంలా వెలుగొందాలి.

కుటుంబఅభివృద్ధిని, అందరిహితంను కోరే భర్త ఎప్పుడూ తన భార్యను తనతో సమానంగానే భావించాలి. అందరినీ వదిలి తనచేయి పట్టుకొని ఎంతో నమ్మకంతో సహధర్మచారిణిగా తన ఇంటికి వచ్చిందన్న భావనతో భార్యను ప్రేమగా అర్ధంచేసుకుంటూ ఆమెను చక్కగా చూసుకోవాల్సిన భాద్యత భర్తదే. 

                        స్వస్తి 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: