26, జులై 2025, శనివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము*


*448 వ రోజు*


*కృష్ణుడు అశ్వత్థామను శపించుట*


ఉత్తర గర్భమును రక్షించాండు కాని కృష్ణుడికి అశ్వత్థామ మీద కోపం చల్లారలేదు " అశ్వత్థామా ! బాల ఘాతకా ! బాలురూ యువకులూ అని లేకుండా అర్ధరాత్రి సమయంలో ఘాఢనిద్రలో ఉన్న వారిని దారుణంగా హత్య చేసినందుకు నీకు ఇదే నా శాపం అనుభవించు నేటి నుండి నీకు అన్నం దొరకదు నీకు ఎవరూ సహాయం చేయరు. నీ ఒంటి నిండా చీమూ నెత్తురు కారుతుంటుంది. ఈ ప్రకారం 3000 సంవత్సరాలు దేశ దిమ్మరివై తిరుగుదువు గాక ! కాని నా చేత రక్షింపబడిన ఉత్తరా గర్భ సంజాతుడు కృపాచార్యుడి వద్ద ధనుద్విద్య నేర్చుకుని అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. అతడి కుమారుడు జనమేజయుడు నీ కళ్ళ ముందే జనరంజకంగా రాజ్య పాలన చేస్తాడు. ఇది సత్యం " అని పలికాడు. ఆ మాటలు విన్న వ్యాసుడు " గురుకుమారా ! నీవు బ్రాహ్మణవంశంలో జన్మించినా క్షాత్రం అవలంబించావు. దారుణమారణ కాండకు పాల్పడ్డావు. ధర్మాధర్మ విచక్షణ మరచి బ్రహ్మశిరోనామాస్త్రమును ప్రయోగించావు. నా మాట కూడా లక్ష్య పెట్ట లేదు. కనుక కృష్ణుడి మాటలు అక్షరాల జరిగి తీరుతాయి " అని పలికాడు. అందుకు అశ్వత్థామ కోపించి " వ్యాస మునీంద్రా ! నీవు కూడా మా లాంటి మనుష్యుల మధ్యనే జీవించు. ఇది నా ప్రతి శాపం " అని చెప్పి తన శిరోరత్నమును పాండవులకు ఇచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు. పాండవులు కృష్ణుడు వ్యాసుడికి నమస్కరించి ద్రౌపది ఉన్న చోటుకు వచ్చారు. భీముడు అశ్వత్థామ శిరోరత్నమును ద్రౌపదికి ఇచ్చి " ద్రౌపదీ ! శత్రుకార్యం పూర్తి అయింది. గురుపుత్రుడు అయినందున అర్జునుడు [అశ్వత్థామ ను చంపనిచ్చగించ లేదు. అందుకని అతడి శిరోరత్నమును తీసుకొని అతడి కీర్తిశరీరమును పడగొట్టాము. ఇక అతడు బ్రతికీ చచ్చినట్లే. ఇక నీ దుఃఖమును మాని ధర్మరాజు దుఃఖమును పోగొట్టుము " అన్నాడు. ద్రౌపది మహిమాన్వితమైన ఆ రత్నమును చేత పట్టుకుని ధర్మరాజుతో " ఈ రత్నమును పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనిని పొందుటకు మీరు అర్హులు అని ఆ రత్నమును ధర్మరాజు కు ఇచ్చింది. ధర్మరాజు కూడా తనకు అశ్వత్థామ మీద ఉన్న గౌరవప్రపత్తులకు నిదర్శనంగా ఆ రత్నమును శిరస్సున ధరించాడు. అప్పుడు ధర్మరాజు అందరూ వినేలా తాము అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిన తరువాత జరిగినది అంతా ద్రౌపది కి, సహదేవుడికి మిగిలిన వారికి వివరించాడు. బ్రహ్మశిరోనామాస్త్ర ప్రభావం చేత అప్పటి వరకు నిలిచిన పాండవకుమారుల పత్నుల గర్భములు విచ్ఛిన్నమయ్యాయి. కాని ఉత్తరగర్భము యధాతధంగా ఉన్నది. ఈ విషయం ఉత్తరకు తెలియదు.*


ధర్మరాజు సందేహం*


అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో " కృష్ణా ! బలంలో శౌర్యంలో ద్రౌపదీ పుత్రులు అత్యంత బలవంతులు కదా ! అశ్వత్థామ ఒక్కడే వారినందరిని ఎలా చంపగలిగాడు. అతడికి అంతటి శక్తి సామర్ధ్యాలు ఎలా వచ్చాయి. అజేయబలవందతుడు శక్తిసంపన్నుడైన దృష్టద్యుమ్నుడు అశ్వథ్థామ చేతిలో దారుణంగా చని పోవడానికి కారణమేమిటి ? నాకు వివరించవా ! " అని అడిగాడు. కృష్ణుడు ధర్మనందనా ! ప్రాణికోటి జన్మించుటకు, జీవించుటకు, లయించుటకు కారణ భూతుడైన పరమశివుని తత్వం నాకు బాగాతెలుసు అతడు సంకల్ప మాత్రమున ఈ జీవకోటిని జన్మింప చేయగలడు లయింప చేయగలడు. కాని అతడు భక్త సులభుడు. భక్తితో తప్ప ఇతర మార్గమున అతడిని ప్రసన్నుడుని చేసుకొనుట అసాధ్యము. కనుక అతడి శక్తి ఇంత అని చెప్పుట అసాధ్యము.


*బ్రహ్మ ప్రాణికోటిని సృష్టించుట*


తొలుత బ్రహ్మదేవుడు ఈ ప్రాణి కోటిని సృష్టించ వలెనన్న తలంపుతో మహాశివుని వద్దకు వెళ్ళి తన కోరికను చెప్పాడు. అప్పుడు మహాశివుడు " బ్రహ్మదేవా ! ఏకార్యం సిద్ధించుటకైనా తపస్సు ముఖ్యం. తపస్సుతో సాధించ లేని కార్యం ఈ జగతిన ఏదీ లేదు. అందుకని ముందు నేను తపస్సు చేస్తాను " అన్నాడు. తరువాత శివుడు నీటిలో మునిగి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచి పోయినా పరమ శివుడు ఎంతకీ బయటకు రాలేదు. బ్రహ్మదేవుడికి విసుగు పుట్టి తుదకు శివుడి సహాయం లేకుండా తన తపః ప్రభావంతో దక్షప్రజాపతిని సృష్టించాడు. బ్రహ్మ " దక్షప్రజాపతీ ! నీవు నా ఆజ్ఞ మీద ప్రజోత్పత్తిని సాగించు " అన్నాడు. దక్షుడు " నా కంటే అధికులు లేకున్న నీవు చెప్పినట్లే సృష్టి కార్యం నిర్వహిస్తాను " అన్నాడు. " దక్షప్రజాపతీ ! శివుడు జలమున మునిగి అనేక వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాడు. కనుక నీవే ఈ సృష్టిని సాగించు అన్నాడు. తరువాత దక్షుడు దేవతలను, అసురులను, తిర్యగ్జాతులను మొదలగు భూతములను సృష్టించాడు. కాని వాటికి ఆహారం సృష్టించ లేదు. అప్పుడు ప్రాణులు ఆకలితో దక్షుని భక్షించుటకు ప్రయత్నించాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: