5, ఆగస్టు 2025, మంగళవారం

18-59-గీతా మకరందము

 18-59-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఒకవేళ అహంకారముచే నా వాక్యములను వినక "నేను యుద్ధముచేయ’ నని నీవు చెప్పినను ప్రకృతియే నీచే యుద్ధము చేయించునని భగవానుడు అర్జునునితో పలుకుచున్నారు -


యద్యహఙ్కారమాశ్రిత్య * 

న యోత్స్య ఇతి మన్యసే | 

మిథ్యైష వ్యవసాయ స్తే 

ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి || 


తా:- ఒకవేళ అహంకారము నవలంబించి "నేను యుద్ధముచేయను" అని నీవు తలంచెదవేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనదియే యగును. (ఏలయనిన) నీ (క్షత్రియ) స్వభావమే నిన్ను (యుద్ధమున) నియోగింపగలదు.


వ్యాఖ్య: - కర్తృత్వమునువీడి, క్షత్రియోచితమగు ధర్మయుద్ధమును గావింపుమని అర్జునునకు భగవాను డిదివఱలో తెలిపియుండిరి. ఇపుడు 

"ఓ అర్జునా! అహంకారము వలన నా ఈ వాక్యములను ఉల్లంఘించినచో అది నీయొక్క వ్యర్థప్రయత్నమే కాగలదు. ఏలయనిన, నీ క్షత్రియసంబంధ ప్రకృతియే, స్వభావమే బలాత్కారముగ నిన్ను యుద్ధమున దింపగలదు". అని భవిష్యజ్జ్ఞానముగల పరమాత్మ వచించిరి.

---------

* యదహంకారమాశ్రిత్య = పాఠాన్తరము.

కామెంట్‌లు లేవు: