5, ఆగస్టు 2025, మంగళవారం

కలం యోధుడిలా

 *కలం యోధుడిలా మట్టిలో కలుస్తాను..!!*


నాలో గుండె చప్పుళ్ళు 

కవిత రూపమై స్పందిస్తూ 

కనుల ముందు ప్రత్యక్షమై 

సమాజంలో దర్శనమిస్తాను..


ఎన్నో హృదయాలకు దగ్గరగా

నలుగురి ముందుకు నడుస్తూ 

అక్షర స్వప్నాన్ని ఆవిష్కరిస్తూ 

నన్ను నేను పరిచయం చేసుకుంటా...


మాటలను పాటలుగా మలుచుకుంటూ 

జీవన గీతాన్ని పాడుకుంటూ 

కష్ట సుఖాల కడలిలో ఈదుకుంటూ

ప్రతి అడుగులో నా ఉనికిని చాటుతాను..


పున్నమి వెలుగుల్లో విహరిస్తూ 

అమావాస్య వరకు ఆనందిస్తూ 

చీకటి వెలుగులను ఆస్వాదిస్తూ 

బ్రతుకు పంటను పండిస్తాను....


అమ్మ గోరుముద్దల జ్ఞాపకాలను 

జీవితాంతం గుర్తుచేసుకుంటూ 

వాటిని మధురంగా మలుచుకుంటూ 

జీవన యాత్రలో తోడుగా ఉంచుకుంటాను..


మనసు తొందరలో ఎన్నో చేస్తుంది 

మరలి వెళ్ళిన ఆలోచన నెమరు వేస్తూ 

భవిష్యత్తును ఇంద్రధనస్సుల అలంకరించాలని 

వర్తమానంలో ఎన్నో గీతాలను ఆలపిస్తాను.


సత్కారాలకు అవమానాలకు కొదవలేదు 

రాసే పుటల్లో నా నామం సుస్థిరంగా 

నాలుగు కాలాలు నిలబడితే చాలు 

కలం యోధుడిలా మట్టిలో కలుస్తాను..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

కామెంట్‌లు లేవు: