27, ఆగస్టు 2025, బుధవారం

పద్యములు

 . *పద్యములు*


ఉ౹౹ తుండము నేక దంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్

       మెండుగ మ్రోయుగజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ 

       కొండొక గుజ్జురూపమున గోరిన విద్యలకెల్ల నొజ్జయై 

       యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్


ఉ౹౹ తొలుత నవిఘ్నమస్తనుచు, ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్

ఫలితము సేయుమయ్య, నిను ప్రార్థనచేసెద నేకదంత మా

వలపలి చేత గంటమున వాక్కుననెప్పుడుఁ బాయకుండు మీ

          తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా.


కం౹౹ తలచితి నే గణనాథుని తలచితి నే విఘ్నపతినిఁ దలచిన పనిగా

        తలచితి నే హేరంబుని తలచితి నా విఘ్నములు తొలగుట కొఱకున్.


కం౹౹ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుఁబ్రాలు చెరకురసంబున్

       నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్.


కం౹౹ గారెలుబూరెలు పూర్ణపు

బూరెలు నుండ్రాళ్ళు లడ్డు పులిహోరయుమే... 

       పూరీలు పాయసము లిం

పారగ నర్పించి కొల్తు నంచితభక్తిన్.


卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐


. *వినాయక పంచరత్నములు*


సామజానన నీ మహాత్మ్యము - సన్నుతింపగ విందురా

వేమరుం గొనియాడు వారల - వింతగా మది నెంతురా

ప్రేమమీరగ సాధుదేవర -వేల్పు నీవని గందురా

కామితార్థ ఫలప్రదాయక - కంచుతేరు వినాయకా.


నీ మహాత్మ్యము లెల్ల ధరలో-నిత్యమై వెలుగొందురా

ఓ మహాత్మక భావపోషక - ఒప్పు మూషిక వాహన

వామయంచక పుత్రతామర - వాసవాది సురార్చిత

కామితార్థ ఫలప్రదాయక - కంచుతేరు వినాయకా.


తూర్యభేరులు మ్రోగ భక్తిని తొల్త నిత్తును పువ్వులన్

ఆర్యులందరు దెత్తు‌రప్పుడు - అంబుజానన వారలన్

కోటిసూర్యులకాంతివెల్గుచు-కోరు కోర్కెల దీర్చుదేవర

కార్యసిద్ధి పలప్రదాయక - కంచుతేరు వినాయకా.


ఝాముఝామున నాను బియ్యము - చాల కొబ్బరికాయలన్

కోమలాంగులు దెత్తురప్పుడు - కోటిమోదక పూర్ణముల్ 

నా మనోహరమైన చక్కెర - నీకు నేనెటులిత్తురా

కామితార్థ పలప్రదాయక - కంచుతేరు వినాయకా.


రాజపూజిత రాజశేఖర - రాజరాజ మనోహరా

భూమిపాలక భోగిభూషణ - భూరికీర్తిదనాయకా 

నా మనోహర కామ్యదాయక నాథనాథ వినాయకా

కామితార్థ పలప్రదాయక - కంచుతేరు వినాయకా.


卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

*శ్రీ మహా గణేశ పంచ రత్నం* 


ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం ।

కళాధరావతంసకం విలాసిలోక రక్షకం ।

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం ।

నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం ॥ 1 ॥


నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం ।

నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరం ।

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం ।

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం ॥ 2 ॥


సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం ।

దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరం ।

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ।

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం ॥ 3 ॥


అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం ।

పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం ।

ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం ।

కపోల దానవారణం భజే పురాణ వారణం ॥ 4 ॥


నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజం ।

అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనం ।

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం ।

తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ॥ 5 ॥


మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహం ।

ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం ।

అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం ।

సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ॥

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐



. *విఘ్నేశ్వరుని మంగళహారతులు*


శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతావంద్యునకును

ఆసరస విద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును

౹౹జయమంగళం నిత్యశుభమంగళం౹౹


నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు ౹

వేఱువేఱుగ దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తు ౹

శశిచూడరాకున్న జేకొంటి నొక వ్రతము ౹ పర్వమున దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు

తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధి నిచ్చు గణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు ౹

కమ్మని నెయ్యియు కడుముద్ద పప్పును బొజ్జ విరుగగ తినుచు పొరలుకొనుచు ౹౹జయమంగళం౹౹


వెండి పళ్ళెరములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలియబోసి ౹

మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ౹౹జయమంగళం౹౹


పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ౹

ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు. ౹౹జయమంగళం౹౹                  


ఏకదంతంబును ఎల్ల గజవదనంబు జాగయిన తొండంబు వలపుకడుపు ౹

జోకయిన మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹ 


మంగళము మంగళము మార్తాండతేజునకు మంగళము సర్వఙ్ఞ వందితునకు

మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹ 


బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి ౹

మల్లెపువ్వులు దెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ౹౹జయమంగళం౹౹ 


పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి గట్టిగా కనకములు కరులు హరులు ౹

యిష్టసంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి

నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడ(వ)గు పూజ లాలింపజేతు ౹౹జయమంగళం౹౹


మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైన గంధసారములను ౹

ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ౹౹జయమంగళం౹౹ 


దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును ౹

దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను ౹

పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ౹౹జయమంగళం౹౹


మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు ౹

నేరెడు నెలవంక(ది) టెంకాయ తేనెయు బాగుగా(చాలగా) నిచ్చెదరు చనువుతోను ౹౹జయమంగళం౹౹


ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలు మీ కరుణతోను ౹

మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెలీడేర(కోర్కెదీర) ౹౹జయమంగళం౹౹



. *౹౹జయమంగళం నిత్య శుభమంగళం౹౹*


卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

కామెంట్‌లు లేవు: