26, ఆగస్టు 2025, మంగళవారం

రమణ చెప్పిన బాపు కథ!

 💥రమణ చెప్పిన బాపు కథ!


బాపుగురించి చెప్పాలంటే రమణ గురించి, రమణ గురించి చెప్పాలంటే బాపూ గురించి చెప్పక తప్పదు. వారి స్నేహబంధం అంత దృఢమైనది.


ఇద్దరి జీవితాలూ గోదారి ఒడ్డునే మొదలైనా మద్రాసులో వారి బంధం గట్టిపడింది.


సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులూ, పస్తులతో పడుకున్న రోజులూ, మిత్రులతో సరదా సంభాషణలూ, మధ్య మధ్యలో కొంటె బొమ్మలూ, హిట్లు, ఫెయిల్యూర్లు... ఇలా ఒకటేమిటి వారి జీవితాలను తరచి చూస్తే ఎన్నో సంగతులు.


తమ మధ్య చోటుచేసుకున్న ఎన్నెన్నో సంగతులనూ, అప్పటి సందర్భాలనూ రమణగారు తన "కోతి కొమ్మచ్చి"లో గుదిగుచ్చారు.


ముఖ్యంగా తన ప్రియ నేస్తం బాపు గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు... ముళ్ళపూడివారి మాటల్లోనే..


💥ఇడ్లీ కన్నా పచ్చడే బాగుంది!


ఓసారి చిన్న కథ రాసి ప్రభ ఆఫీసుకు వెళ్ళాను. ఎడిటర్ విశ్వంగారికి ఇచ్చి కూర్చున్నాను.


"ఇక మీరు వెళ్లవచ్చు. బాగుంటే దినపత్రికలో ప్రకటన వస్తుంది" అన్నారు విశ్వంగారు.


"చిన్న కథేనండి... కొంచెం చదివి ఇప్పుడే చెప్పేస్తే... అన్నాను నేను.


ఆయన చురుక్కున చూశారు.

చేతిలోని పుస్తకంలో దాచిన బాపు బొమ్మతీసి బల్లమీద పెట్టాను. ‘‘మా ఫ్రెండ్ బాపు – బొమ్మ కూడా వేశాడు. ఫ్రీ’’ అన్నాను.


"అక్కర్లేదు, మాకు ఆర్టిస్టులున్నారు. బయటవాళ్లవి తీసుకోం’’ అంటూనే ఆయన బాపు వేసిన బొమ్మని ఓ క్షణం సేపు చూశారు.


ఏమనుకున్నారో గానీ, పక్కనే ఉన్న నా కథను చూసి చదవసాగారు. రెండు నిమిషాల్లో కథ చదివేశారు. 


బాపు బొమ్మను మళ్లీ ఓసారి చూశారు.

"ఇడ్లీకన్నా పచ్చడే బాగుంది" వేస్తాను లెండి’’ అన్నారు.


ముప్పావలా పెట్టి ఫుల్‌ మీల్స్ తిన్నంత బలం వచ్చేసింది.

ఈ ఇడ్లీ కన్నా పచ్చడి బాగుండటం జోక్‌లా అనిపించినా – తర్వాత అది చిరసత్యమై, స్థిరసత్యమై నిలబడింది.


తర్వాత నేను గోప్ఫ రైటర్నయిపోయి ఎన్ని గొప్ప కథలు రాసినా – బాపు గొప్పన్నర బొమ్మలు వేసేవాడు.

అప్పుడు నేననుకునేవాడిని – ఇడ్లీ కన్నా పచ్చడే బాగుందని.


(సేకరణ)👆

కామెంట్‌లు లేవు: