అద్భుతమైన పద్యం
పోతన వ్రాసిన భాగవతంలోని ప్రతి పద్యము
ఆణిముత్యమే అనటంలో సందేహం లేదు. అది కందము కానీయండి, మత్తేభం కానీయండి,
సేసం కానీయండి. ప్రతి పద్యం చదవటానికి అనువుగా, వినసొంపుగా అర్ధవంతంగా
ఉంటాయి అనటంలో సందేహం లేదు. చిన్న చిన్న పద్యాలలోకూడా ఎంతో భావాన్ని
అర్ధవంతంగా పొందుపరచటంలో పోతనకు సాటి వేరొకరు రారు అనటంలో అతిశయోక్తి లేదు.
ఇక్కడ చూడండి ఒక చిన్న కంద పద్యంలో అన్నే లోకాలను చుట్టుముట్టి వచ్చాడు.
కం||
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
లోకాలు అంటే మనకు తెలుసు చతుర్దశ భువనాలు అంటే 7 ఊర్ధ్వ లోకాలు 7 అదో లోకాలు వెరసి 14 లోకాలు ఉన్నట్లు మనకు శాస్త్రోవాచ అటువంటి అన్ని లోకాలకు పరిపాలించే రాజులు అంతేకాదు ఆ లోకాలలో నివసించేవారు అన్నీకూడా సృష్టి అంతంలో నశించినప్పుడు అంటే ప్రళయం సంభవించినప్పుడు లోకాలు వుండవు, రాజులు వుండరు, లోకాలలో వుండే జనాలు వుండరు అంతా నశించిపోయి కారు చీకట్లు కమ్మి ఉంటాయి అని సృష్టి వినాశనాన్ని గురించి చెపుతారు. అప్పుడు ప్రకాశించే సూర్యుడు, చంద్రుడు కూడా నశించిన తరువాత పూర్తిగా అంధకార బంధురంగా ఉంటుంది. అటువంటి చీకట్లలో చీకటికి అవతల ఉన్నటువంటి వెలుగే పరమేశ్వరుడు అని శాస్త్ర ఉవాచ అంటే కేవలం ఈశ్వరుడు తప్ప ఇంకా ఏమి ఉండదు. ఆ పరమేశ్వరుడు మరల సృష్టి కార్యం చేపట్టి క్రొత్తగా సృష్టిని అంటే మరల లోకాలను, లోకేసులను, లోకస్తులను సృష్టిస్తాడన్నమాట. అటువంటి దివ్యమైన శక్తివంతమైన పరమేశ్వరుడిని నేను సేవిస్తాను అని ఇక్కడ కవి అంటున్నాడు. అది ఎంతటి అద్భుతమైన భావనో చుడండి.
మరిన్ని ఇటువంటి విషయాలకోసం వేచిచూడండి
ఓం తత్సత్
శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి