26, అక్టోబర్ 2025, ఆదివారం

సంపూర్ణ శ్రీ కాశీ ఖండము

 ...:

*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*



*శ్రీవేదవ్యాస ప్రణీత శ్రీ స్కాంద మహాపురాణాంతర్గత*


*సంపూర్ణ శ్రీ కాశీ ఖండము*


*అధ్యాయం - 4*


*పతివ్రతాఖ్యాన వర్ణనము :*


సూతుడు చెప్పాడు-


మహామునీ! అగస్త్య మునీంద్రుడు అడుగగా దేవతలేమి చెప్పారు. సమస్తలోకాల మేలుకోసం దాన్నిచెప్పండి. దేవతలందరు అగస్త్యునిమాటవిని గౌరవపూర్వకంగా బృహస్పతివైపు చూశారు. 


మహానుభావా! అగస్త్య మునీంద్రా! దేవతల రాకకి కారణాన్ని విను. నీవు ధన్యుడవు. కృతకృత్యుడవు. మహాత్ములకు కూడ నీవు మాన్యుడవు. 


మునిశ్రేష్ఠుడా! ప్రతి ఆశ్రమం ప్రతి పర్వతం, ప్రతి అరణ్యంలోను తపోధనులున్నారు. కాని నీమర్యాద భిన్నమైనది. నీలో తపోలక్ష్మి, బ్రహ్మతేజస్సు రెండూ స్థిరంగా ఉన్నాయి. 


పుణ్యలక్ష్మికూడ ఉత్కృష్ట రూపంలో నీలో ప్రకాశిస్తున్నది. ఔదార్యం, మనస్విత కూడ నీలో ఉన్నాయి. తనకథని లోకంలో పుణ్యాన్ని కలిగించేది, నీ సహ ధర్మచారిణి, కల్యాణి అయిన మహాపతివ్రత లోపాముద్రాదేవి నీ శరీరానికి నీడలా నీతోపాటుగా 'ఉంటున్నది. 


అరుంధతి, సావిత్రి, అనసూయ, శాండిల్య, సతి, లక్ష్మి, శతరూప, మేనక, సునీతి, సంజ్ఞ, స్వాహ మొదలైన పతివ్రతల్లో ఈ లోపాముద్రని శ్రేష్ఠురాలిగా చెపుతున్నారు. 


మరి ఇతరులెవ్వరులేరు. ఇది నిశ్చయం, మునీంద్రా! నీవు భుజించిన తరువాత భుజిస్తుంది. నీవు కూర్చున్న తరువాత కూర్చుంటుంది. 


తనను తాను అలంకరించు కోకుండా ఎన్నడు నిన్ను చూడదు. పనిమీద పొరుగూరికి వెళ్ళినప్పుడు అన్నివిధాల ఆభరణాల్ని విడిచిపెతుంది. 

నీ ఆయువు వృద్ధికావడానికి ఎన్నడు నీ పేరును పలుకదు. ఎన్నడు పరపురుషుని పేరునుకూడ తలవదు. కోపంతో పట్టుకున్న ప్పటికి బాధపడదు. కొట్టినప్పటికి ప్రసన్నంగానే ఉంటుంది. 


ఈ విధంగా చెయ్యమనగానే స్వామీ! చేసినట్లుగా తెలుసుకొనండని చెపుతుంది. పిలిచినప్పుడు ఇంటి పనుల్ని విడిచిపెట్టి వెంటనే వస్తుంది. 


నాథా! ఎందుకు పిలిచారో అనుగ్రహంతో చెప్పండి అని అడుగుతుంది. ద్వారంలో చాలసేపు నిలుచుండదు, కూర్చుండదు. నీవు ఇవ్వనిదాన్ని ఎన్నడు ఎవ్వరికి ఇవ్వదు. 


నీవు చెప్పకుండానే పూజాసామగ్రిని స్వయంగా సమకూరుస్తుంది. మడినీళ్ళు, దర్భలు, పత్రాలు, పుష్పాలు, అక్షతలు మొదలైనవాటిని అవసరానికి అనుకూలంగా కంగారుపడకుండగా చాలసంతోషంతో సర్వాన్ని సమకూరుస్తుంది. 


భర్త తినగా మిగిలిన అన్నం, పండ్లు మొదలైన వాటిని తాను తింటుంది. భర్త ఇచ్చినదాన్ని మహాప్రసాదమని స్వీకరిస్తుంది. దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, సేవకులకు, గోవులకు, యాచకులకు పెట్టకుండగా ఎన్నడు భుజించదు. 


ఇంటి ఇల్లాలికి అవసరమైన వస్తువుల్ని, అలంకారాల్ని చక్కగా దాచి ఉంచడంలో సమర్థతకలిగి అనసవరమైన ఖర్చుని చెయ్యకుండా ఇంటి సంపదని పెంచుతుంది. 


నీఅనుమతి లేకుండా వ్రతాల్నికాని ఉపవాసాల్నికాని చెయ్యదు. ఆమె సమాజాన్ని, ఉత్సవాల్ని చూడటాన్ని దూరంనుంచే విడిచిపెడుతుంది. 


తీర్థయాత్రలకు, వివాహం మొదలైన వాటిని చూడటానికి వెళ్ళడు. భర్త సుఖంగా నిద్రిస్తున్నప్పుడు కాని, సుఖంగా కూర్చున్నప్పుడు మూడురాత్రులు తన ముఖాన్నే చూపించదు. 


స్నానం చేసి పరిశుద్దురాలైనంత వరకు తన మాటని వినపడనీయదు. చక్కగా స్నానం చేసి భర్తముఖాన్నే చూస్తుంది కాని ఇతరుల ముఖాన్ని చూడదు. లే


కపోతే మనసులో భర్తని ధ్యానించి సూర్యుని చూస్తుంది. పసుపు, కుంకుమ, సిందూరం, కాటుక, రవిక, తాంబూలం, మంగళ ప్రదములైన ఆభరణాలు, కేశసంస్కారం, జుట్టుముడి, అనేవాటిని భర్త ఆయుష్షుని కోరే పతివ్రత విడిచిపెట్టదు. 


పతివ్రత చాకలిస్త్రీతోకాని, సత్కర్మలకి విరుద్ధంగా మాట్లాడే స్త్రీతోగాని, బౌద్ధభిక్షుకురాలితోగాని, దురదృష్టవంతు రాలైన స్త్రీతోకాని ఎన్నడు స్నేహం చెయ్యదు. 


పతివ్రత భర్తని ద్వేషించే స్త్రీతో ఎన్నడు మాట్లాడదు. ఒంటరిగా ఎన్నడు ఉండదు ఎన్నడు నగ్నంగా స్నానంచెయ్యదు. 


రోటి పై కాని, రోకలి పైకాని, చీపురుమీదకాని, రాతిమీదకాని, గోధూమాదుల్ని చూర్ణంచేసే రాతిమీదకాని, గడపమీదకాని ఎన్నడు కూర్చుండదు. 


సంభోగ సమయంలో తప్ప మరెప్పుడు ప్రౌఢంగా సంచరించదు. ఎల్లప్పుడు భర్తకిష్టమైన విషయాల్లోనే ప్రేమని కలిగి ఉంటుంది. భర్తమాటని అతిక్రమించకుండా ఉండటమే స్త్రీలకు ఒకటే వ్రతం అదే పరమ ధర్మం అదే దేవపూజనం అవుతాయి. 


వీర్యహీనుడైనా, కష్టదశలో ఉన్నా, రోగగ్రస్తుడైనా, ముసలివాడైనా, మంచిస్థితిలో ఉన్నా, చెడ్డస్థితిలో ఉన్నా భర్తనొక్కనిని స్త్రీ అతిక్రమించ కూడదు. 


భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను సంతోషంగాను, భర్త నీ బాధతో ఉన్నప్పుడు తాను బాధతోను, సంపదలోను, ఆపదలోను పుణ్యవతి అయిన స్త్రీ ఒక్క రూపంగానే ఉంటుంది. 


నెయ్యి, ఉప్పు, నూనె మొదలైనవి లేకపోయినప్పటికి పతివ్రత అయిన స్త్రీ లేవని భర్తతోచెప్పకూడదు. భర్తకి కష్టాన్ని కలిగించకూడదు. 


తీర్ధ స్నానం చెయ్యాలనే కోరిక కలిగిన స్త్రీ భర్తపాదజలాన్ని త్రాగాలి. ఈశ్వరునికంటే, విష్ణువుకంటే స్త్రీలకు భర్త ఒక్కడే అధికుడు. 


భర్తని వ్యతిరేకించి వ్రతాల్ని, ఉపవాసాల్ని ఆచరించిన స్త్రీ తన భర్తఆయుష్షుని హరిస్తుంది. తరువాత తాను మరణించి నరకానికి వెళుతుంది.

కామెంట్‌లు లేవు: