26, అక్టోబర్ 2025, ఆదివారం

జ్ఞానము

 *జ్ఞానము అనంతము 5*


సభ్యులకు నమస్కారములు.


11) *పంచాగ్ని విద్య* :- ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అనేవి పంచాగ్నులు. వీటి యందు శ్రద్ధ, సోమ, వృష్టి, అన్నము, రేతస్సు అను పంచ ద్రవ్యములను లేక పంచ ఆహుతులను హోమము చేయగా ఉదకములు (వృష్టి) పురుష రూపము చెందుతున్నవి. జీవుడు శరీర బీజములైన సూక్ష్మ బీజములలో చేరి క్రమముగా ఆకాశము మీద శ్రద్ధా రూపంలో చేరి, వర్ష రూపంలో భూమిపై పడి అన్నం రూపంలో పురుషునిలో చేరి, రేతస్సు రూపంలో స్త్రీ గర్భం యందు ప్రవేశించి, అక్కడ పురుషుడుగా వ్యక్తమగుచున్నాడు. శ్రద్ధ అనగా జీవుడు జీవ రూపంలో ఉండుట ధర్మము.

12) *దహార విద్య* :- బ్రహ్మ రంధ్రము నుండి చిన్న కమలము. ఆ కమలము మధ్యన సూక్ష్మమైన శూన్య స్థానము. ఆ శూన్యమే *దహరాకాశ* మనబడును. దీనిని తెలుసుకున్న వాడు బ్రహ్మను తెలుసుకొనగలుతాడు. 

ఈ విద్యనే *దహర* 

విద్య లేక *ప్రాణ* 

విద్య అందురు. జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు,హృదయంలో పుండరీకాక్షుని  రూపంలో స్వామిని ఉపాసన చేస్తారు. ఇది *దహర* విద్య కారణంగానే సాధ్యము.

13) *సంవర్గ - వాయు సంవర్గ విద్య* :- వాయువు ఆనగా హిరణ్యగర్భుడు. ఇతడితోనే ప్రపంచ మంతా పుట్టి, స్థితిని, కల్గి లయించుచున్నది. . సంవర్గమనగా ప్రవిలయము. అనగా అతడి (సృష్టి, స్థితి, లయకారుడు) లో చేరి ఉండుట. సకల దేవతలు, జీవులు, జడ ప్రకృతి అంతా ప్రళయ కాలములో చేరి ఈ వాయువుగా వ్యక్తమగుచున్నవి. ఇట్టి వాయు సంవర్గమును ఉపాసన చేయుచు, తాను గూడా లేనివాడుగా అవ్యక్తమగుటను వాయు సంవర్గ విద్య అందురు. 

14) *మధు విద్య*;-

 సర్వ దేవతలలో ఉండే దైవత్వమును మధువు అందురు. త్రిగుణాత్మకమైన నామ, రూప, క్రియా నటనలను వదిలి, అందలి సారమైనటువంటి ఆత్మ చైతన్యమును గ్రహింపజేయునది మధు విద్య. ఆ సారమే దైవత్వము లేక మధువు లేక అమృతము.  మధు విద్యోపాసకులకు  బ్రహ్మానందము సిద్ధించును.

15) *అపర విద్య* :- 

గడ్డి పరక మొదలు సృష్టి కర్తవరకు గల ప్రకృతి  గుణములను వివేకంతో సరిగ్గా గ్రహించి కార్యసిద్ధిబడయుట.  ధర్మాధర్మములను తెలుసుకొనుట. ఈ రెండింటికి సంబంధించిన విద్యనే అపర విద్య.


శ్లో! *అభ్యసేన క్రియా: సర్వా: !అభ్యాసాత్ సకలా: కళా! అభ్యాసాత్ ధ్యాన మౌనాది: కిమభాసస్య దుష్కరమ్* 


భావం:- అభ్యాసంతో అన్ని పనులు సాధ్యమవుతాయి. అభ్యాసంతో సకల కళలు సాధించవచ్చు. అభ్యాసంతోనే  ధ్యానం, ఆలాగే మౌనం సాధ్యం. అసలు అభ్యాసంతో సాధ్యం కానిదేమిటి. అభ్యాసం మానవుడిని పరిపూర్ణుడిని చేస్తుంది.


ధన్యవాదములు.

*(స్వస్తి)*

కామెంట్‌లు లేవు: