*రేనాటి పౌరుషం కుందూ నది…*
*(కుందూ నది గీతం)*
రాయలసీమ పౌరుషపు గడపల్లో
ఎర్రమల కనుమల సానుల్లో
ఉప్పలపాడలో జన్మించే చిన్న నీటి బుగ్గ
తన దారిని మళ్లించి పెనమ్మతో కలిసే..
సీమలో సిరుల తల్లి కుందూ మాత
సరసరా నీటి సవ్వడితో కదులుతూ
కృష్ణమ్మ చెంత ఉన్నా అటు చూడక
పెన్నమ్మతో మైత్రి బంధానికి కదిలే…
పురాతన నామం కుముద్వతి
ప్రస్తుతం కుందూ నదిగా రూపాంతరం
రేనాటి సీమకు పౌరుషం పోసి
శత్రువులను జయించే బలాన్ని సమకూర్చే..
ఆదిమానవుడి ఆనవాళ్లకు సాక్ష్యంగా
రాతి వనాలలో నీటి పంటగా
ఎర్రమల కొండల్లో కోనేటి రూపంగా
గిరులల్లో వంపులో ప్రాకింది సొంపుగా..
కొండ ప్రాంతాల్లో నది రాతివనంగా
సున్నపురాళ్ల శిలలను అడుగున కలిగి
నేలలో నీళ్ళు ఇంకక నేలపై పొర్లుతూ
తాన ప్రత్యేకతను చాటుకొని ప్రవహించే..
అపారమైన ధైర్యాన్ని నీళ్లతో అందించి
లేత మీసాలకు కూడా రోషాన్ని రప్పించి
రేనాటి గడ్డలో గుండె ధైర్యాన్ని నూరిపోసి
సీమ పౌరుషంలో చిరస్థాయిగా నిలిచింది..
ఈ నీటిలో కత్తులే కడిగిన పదును పెరిగే
గుక్కెడు నీళ్లు తాగితే గుండె ధైర్యం వచ్చే
పగోడు చిక్కితే పరలోకానికి పంపే
రోషం గౌరవం కుందూ నీటిలోని గొప్పతనం..
నది తీరాన మొలిచిన గడ్డి కూడా అస్త్రమే
ఇక్కడి ప్రజల మాటల్లో మాధుర్యమే
కవనమల్లిన కవి పుంగవులు ఎందరో
కలం గళం విప్పిన ముద్దు బిడ్డలందరు..
పుష్కర నది కాకపోయినా
కుందూ నది స్నానం పుణ్యప్రదానం
పవిత్రమైన గంగతో సమానం
తీరం వెంబడి ప్రజలకు విలవేల్పు కుందూ..
రేనాటి భూముల్లో నీటి కుండల కనిపించే
పెరిగిన పంటల్లో పసిడిగా నవ్వుల నివసించే
రైతన్నల కళ్ళల్లో ముత్యంలా మురిసే
నాగేటి సాలులో గలగల దొర్లి పోయే..
కుందూ అన్నది కుందేరుగా మారుతూ
పెద్దెరుగా నంద్యాల్లో పరవళ్ళు తొక్కుతూ
నంది మండలంలో నవధాన్యాలు పండించే
సీమలో సిరుల పంటలకు ప్రాణము పోసే..
చినుకు చినుకు ఒడిసి పట్టుకొని
వాగును వంకను ప్రేమతో కలుపుకొని
చిరుధార మహోగ్రరూపమై కదిలి
సీమ ముఖాల్లో చిరునవ్వులే చిందించే…
అడుగుపెట్టిన గ్రామాల్లో ఆనందమే
ప్రకృతి ఒడిలో పరవళ్ళు తొక్కుతూ
సూర్యోదయ సూర్యాస్తమయాల్లో వెలుగుల్లో
సుందర కన్యలా వయ్యారంగా సాగిపోయే..
సీమ నేలలో ఒంపులెన్నో తిరుగుతూ
నీటి బిందువులతో నడకలెన్నో సాగిస్తూ
కొండల్లో కోనల్లో ముచ్చట్లెన్నో చెప్పుతూ
సీమ అంచుకు పచ్చని హారాన్ని సమకూర్చే..
బహుశా ఏ కవి కంట పడలేదేమో
ఈ అపురూప సౌందర్య నది ప్రవాహం
గలగల పారుతున్న శబ్ద సౌందర్యం
బిరబిర ఉరికే మహోగ్ర స్వరూపం…
దారిలో దాయాదులను కలుపుకుంటూ
గాలేరు పాలేరు నిప్పుల వాగు సంకలగుతో
తోడబుట్టినోళ్లను సంకలో ఎత్తుకుంటూ
నల్లమల నీటిని అంగిట్లో నిలుపుకుంటూ..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి పౌరుషం
బుడ్డా వెంగల్ రెడ్డికి దాన గుణం
రేనాటి పాలెగాళ్లకు వీరత్వాన్ని అందించే
కుందూ ప్రవాహము లోనే కలిసే రోషం ..
అప్పుడప్పుడు ఉగ్రరూపం దాల్చుతూ
అపర గంగై శివతాండవం చేస్తూ
ఆవేశము తగ్గి మరలా ఆశీర్వదించే
పతిత పావనిలా సీమ సిగలో మిగిలే..
*🖊️కొప్పుల ప్రసాద్*
నంద్యాల
9885066235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి