19, నవంబర్ 2025, బుధవారం

పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ

 🙏పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ🙏


ఈ వ్యాసం సులభం కాదు. ఏకాగ్రతతో జాగ్రత్తగా చదవాలి. అప్పుడే అర్ధమవుతుంది.

ముందుగా వాగ్దేవతల ప్రార్ధనతో ప్రారంభిద్దాం

ఆ వాగ్దేవతల అనుగ్రహముతో ఈ వ్యాసం చదువుదాము.

దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః వశవోవదంతి! 

సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు. 

అమ్మవారు దేవతలకందరికి కామధేనువు వంటి విశ్వరూపమైన (అనంతమైన ) పదజాలం సృష్టించి ఇచ్చారు. ఆ పదజాలం మమ్ములను ఆశ్రయించి ఉండి రక్షించుగాక.


చత్వారి వాక్పరిమితా పదాని తానీ

విడుర్బ్రాహ్మాణా యే మనీషిణిః

గుహాత్రీణి నిహితా నేజ్గయంతి

తురీయం వాచో మనుష్యా వదంతి ||

భావం 

వాక్కుకు నాలుగు స్థితులు వుంటాయని విజ్ఞాలకు తెలుస్తుంది.అవియే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ వీటిలో మొదటి మూడు స్థితులలోని వాక్కు గుహలోనే వుంటుంది. బయటకు రాదు. నాల్గవ స్థితిలోని వాక్కునే మనుష్యులు పలుకుతున్నారు. అని పై మంత్రానికి అర్థం

-

మనలో మాట పలకాలన్న భావం స్ఫురింపచేసేదే “పరా”. మాట పలికే ముందు ‘పర’ ప్రేరితమై భావాత్మకంగా గోచరించేదే ‘పశ్యంతీ’. ఆ భావం మాటలుగా కూర్చుకున్న స్థితి ‘మధ్యమా’ ఆ తరువాత శబ్దరూపంలో పైకి వినబడేదే ‘’వైఖరీ! యోగశాస్త్ర పరంగా వీటి యొక్క ప్రయాణం గురించి చెప్పాలంటే, మూలాధారం నుండి నాభి, హృదయం , కంఠ, నాలుకలు. వీటన్నింటికీ మూలమైన నాదం కూడ సరస్వతీరూపమే. ఇక, భావప్రకటన కోసం చెట్లు ‘పరా’ వాక్కుని, పక్షులు ‘పశ్యంతీ’ వాక్కును, జంతువులూ ‘మధ్యమా’ వాక్కును, మనుషులు ‘వైఖరీ’ వాక్కును ఉపయోగిస్తారు


పరాస్థితిని - సంకల్పము గాను, పశ్యంతి స్థితిని భావము గాను, మధ్యమా స్థితిని సంకేతము గామ, వైఖరి స్థితిని - ఉచ్చారణ గాను - సమన్వయ పరచుకోవచ్చును

మరొక సందర్భంలో ఈ విధంగా చెప్పబడింది


‘పరా వృక్షేషు సంజాతా, పశ్యంతీ భుజగీషుచ, మధ్యమావై పశుశ్చైవ, వైఖరీ వర్ణ రూపిణీ’’.


 చెట్టు నుంచి సృష్టింపబడుతున్న చిగుళ్లు, ఆకులు, కొమ్మలు, పూలు, ఫలాలు వస్తాయి కదా . కాని తన వల్లనే వస్తున్నాయని చెట్టు గుర్తించదు. పాముకు చూడటానికి కళ్లేగాని, వినడానికి ప్రత్యేకం ఒక శ్రవణేంద్రియం అనేది లేదు. పశువు ‘‘అంబా’’ అంటుంది. కాని, అంబను (అమ్మవారిని ) తెలుసుకొనలేదు. 

పరబ్రహ్మతత్త్వ విచారణ సందర్భంలో వాక్కు నాలుగు విధాలుగా చెప్పారు. 1. పరా, 2. పశ్యంతి, 3, మధ్యమ, 4. వైఖరి. మనిషి అక్షర సముదాయాన్ని ఏర్పరచుకొని, వాటి సహాయంతో అంతులేని సాహిత్యాన్ని సృష్టించుకొన్నాడు. కాని, దృగ్గోచరమైన సృష్టికి మూలాన్ని అన్వేషించడానికి సతమతం అవుతున్నాడు. తెలుసుకొనలేక పోతున్నాడు.


 పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ శబ్దాలకు నిర్వచనం చెప్పే సందర్భంలో ఇచ్చిన ఈ నాలుగు ఉపమానాలు వరుసగా ఈ పదాలకు వర్తిస్తాయి. మరొక విధంగా కూడా ఈ పదాలకు అర్థం చెప్పారు.

 ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు తలపునకు పూర్వస్థితి ‘‘పరా వాక్కు’’. తలపు ‘‘పశ్యంతీ వాక్కు’’. ఆలోచన కార్యరూపం ధరించే ముందున్న ఊహస్థితి ‘‘మధ్యమ వాక్కు’’. తలపు కార్య రూపం ధరించడం ‘‘వైఖరీ వాక్కు’’. ‘‘పరా’’ విత్తు మొలకెత్తడానికి ముందు స్థితి.

అంటే, విత్తు భూమిలోపడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నస్థితి. మొలక విత్తులోనుంచి పైకి రావడం, అంటే ఆలోచన మొలకెత్తడం ‘‘పశ్యంతి’’. అవుతుంది.మొక్క ఎదిగి, వృక్షంగా మారడం ‘‘మధ్యమ’’ స్థితి. పూత పూయడం, పూలు ఫలాలు కావడం, పరిపూర్ణం చెందడం ‘‘వైఖరి’’

ఇక మానవుల విషయానికి వస్తే...

మానవుడు పుట్టినప్పుడు మూడు నెలల లోవు పసివాడు పరా రూపంగా ఉంటాడు. కనీసం కళ్ళుకూడా పూర్తిగా తెరవని స్థితి.

తరువాత కొన్ని నెలలు పశ్యంతి రూపంలో ఉంటాడు కేవలం చూస్తాడు. ప్రతిక్రియ చేయడు. 6 మాసాల తరువాత క్రమముగా ప్రతిక్రియ చేస్తాడు అరవడం, నవ్వడం, కొట్టడం, కరవడం మొదలగునవి. ఇలా ప్రతిక్రియ చేయడం మధ్యమా లక్షణాలు. తరువాత క్రమముగా అనంత పదజాలన్నీ ఉచ్చరిస్తాడు ఇది వైఖరీ లక్షణం.

ఇంక వాక్కు విషయానికోస్తే...

పరా వాక్కు : పరావాక్కు స్థానం మూలాధార చక్రం మరియు సహస్రార మధ్యస్త "ఓంకారము" ఆది ప్రణవము. దానికి "సిద్ధి" అని పేరు. ఈ ప్రణవము క్రమంగా మూలాధారమందు అవ్యక్త వాక్కుగా నిలచినది. ఈ వాక్కు పరా శక్తికి అభిన్నము. ఏ వికారము లేనిది , నిత్యమైనది,

పరావాక్కు నిత్యతత్త్వం కలది అందుకే ""శబ్దబ్రహ్మ""అయింది. దీనినే 'నాదం' అనికూడా అన్నారు.మూలాధార చక్రంలోని కుండలిని దాని స్థానం. 

 ఆత్మానుభూతినిచ్చేది. దీనిలో లయమైన ఋషులు దివ్య జ్ఞానాన్ని పొందారు., ఇందులో లయమైన ఎవరైననూ అపార జ్ఞానాన్ని పొందుతారు. పరా వాక్కు యొక్క విభిన్న రూపాలే పశ్యంతి, మధ్యమా, వైఖరులు.

ఈ వాగ్రూపము అంతర విషయవాసనలను గ్రహిస్తుంది. యోగులకు, జ్ఞానులకు విద్యుత్ రూపంలో దర్శనమిస్తుంది. త్రికాల జ్ఞానాన్ని కలిగిస్తుంది. 


పశ్యంతి వాక్కు :

వాక్కు లో రెండవ దశ –,పరా వాక్కు కంటే మరింత సాంద్రీభవించి ఉన్న వాగ్రూపాన్ని 'పశ్యంతి" అంటారు . "మధ్యమా" కంటే మరింత సూక్ష్మంగా ఉండి, వినడానికి వీలు లేనిదానినే "పశ్యన్తి వాక్కు" అంటారు ."పశ్యంతి" అంటే సంస్కృతం లో చూడగలిగినది లేక ఊహించ గలిగినది అని అర్ధం .పురాతన గ్రంథాలలో శబ్దం అనుభవైక వేద్యం... అంటే తెలియ దగినది అని అర్ధం .శబ్దాన్ని ఎలా చూడగలం ?మనం ఎప్పుడైనా కలలో శబ్దం విన్నామా ? ఈ ప్రత్యేక పరిమాణం కల శబ్దాన్నే, కలలో వినబడే శబ్దాన్నే పశ్యంతి అన్నారు .నిజంగా ఇది మానసిక శబ్దం .ఇది చేతన ,పాక్షిక అచేతన స్థితులలో వినిపించనిది .అది ఉపచేతన శబ్దం .అది మన మానసిక నాణ్యత కు చెందినదే కానీ... పంచేంద్రియ నాణ్యతలకు అంటే నాలుక ,గొంతు ,నోరు ల నాణ్యతలకు అందనిది .

మనము మాట్లాడవలసిన మాటకు అక్షరాలు సమకుర్చడం, పదాలు తయారుజేయడం పశ్యంతీలో జరుగుతుంది.


మనం "రామా, కృష్ణా శివా, అమ్మా . అంటూ ఉంటే... అది వైఖరి నాదం .మనం మన కళ్ళు ,నోరు మూసుకొని ఆ నామాన్ని మానసికంగా ఉచ్చరిస్తే అది మానసికంగా రంగు ,రూపాలను అంతరిక లోచనం తో దర్శించటమే "పశ్యంతి వాక్కు" .బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా వినగలిగిన శబ్దమే పశ్యంతి .


మధ్యమా వాక్కు :

వైఖరి వాక్కు కంటే మరింత సూక్ష్మమైనది, మధ్యమ వాక్కు .వైఖరి శబ్దం యొక్క మిక్కిలి సూక్ష్మ అభివ్యక్త ధ్వని. కానీ మధ్యమా, వైఖరుల కంటే మరింత సూక్ష్మమైన నాదం .గుసగుస శబ్దంగా వినిపించేది మధ్యమ శబ్దం .అది వినికిడిపై ప్రభావం చూపలేదు .మధ్యమ శబ్దం లో అతి తక్కువ కంపనాలు కలిగి గుస గుస శబ్దమే వినిపిస్తుంది .రెండు వస్తువుల ఘర్షణ వలన శబ్దోత్పత్తి జరుగుతుంది .కాని "మధ్యమా నాదం" లో ఏ రెండు వస్తువుల తీవ్ర రాపిడి వలనకూడా వినబడేటంత శబ్దం జనించదు. "ఠక్ ఠక్" అనేట్లు శబ్దం పుట్టించితే, దాన్ని స్థూల శబ్దం అంటారు . మధ్యమ అంటే మధ్యగా ఉన్నశబ్దం . .రెండిటికి మధ్యగా ఉన్నదే."మధ్యమా" .మధ్యమా శబ్దమే గుసగుసలుగా వినిపిస్తుంది . ఇది ఆకాశంలో సంచారం చేస్తూ ఉంటుంది. నిరంతర జప శీలుర పరిణతుల స్థాయిని బట్టి ఇది దహరాకాశంలో వ్యాప్తి చెందుతుంది. సాధకుల/యోగుల స్థాయిని బట్టి, సూక్ష్మ దేహాన్ని దాటి వ్యాప్తి చెందుతుంది.

పశ్యంతి లోని పదాలకు ఇక్కడ రసము నిర్దేశం జరుగుతుంది. అంటే మాట్లాడు మాట కోపంగానా? హాస్యంగానా? శాంతంగానా? అలాగే నిష్ఠురాది భావములా? అని మరియు భాష కూడా నిర్ణయించేది మధ్యమాలోనే 

వైఖరి వాక్కు :


నాలుగవ వాగ్దశనే "వైఖరి" అంటారు . "వైఖరి" లో శబ్దం వినిపిస్తుంది ,ఉత్పత్తి అవుతుంది కూడా .మనం మాట్లాడే భాష అంతా వైఖరియే.వైఖరీ వాక్కు కఠినంగా ఉంటుంది. కఠోరంగా కూడా ఉంటుంది. రెండు వస్తువుల ఘర్షణ వలన వైఖరి "శబ్దోత్పత్తి" జరుగుతుంది . .


మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే –పరా అంటే ఆత్మ నాదం .మధ్యమ అంటే స్వర అవయవాల సూక్ష్మమైన నాణ్యత .వైఖరి కూడా భౌతిక అవయవాల వలన ఏర్పడిన సూక్ష్మ శబ్దమే . 

    నిత్యమైన శబ్దబ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి, చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 


పరా పశ్యంతీ దశలలోని శబ్దాన్ని ఉన్నత స్థాయి యోగులు తప్ప మన సాధారణ ఇంద్రియజ్ఞానంతో మనం గ్రహించలేకపోచ్చును. జపాదులవల్ల మధ్యమాదశలోని వాక్కును గుర్తించవచ్చును. ఇక వైఖరీవాక్కు ఒక్కటే మనకందరికీ తెలిసింది.


పరావాక్కు నిత్యతత్త్వం కలది.

     శబ్దబ్రహ్మము మూలాధార చక్రంలోని కుండలినియే దాని స్థానం. దీనినే 'నాదం' అనికూడా అన్నారు. పశ్యంతీ వాక్కు జననేంద్రియము వెనుకభాగమున స్వాధిస్థాన ములోను, బొడ్డుదగ్గర ఉండే మణి పూరక చక్రంలో ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న వాక్కుపశ్యంతియే.ఈ పరా,పశ్యంతీ వాక్కులు రెండూ సూక్ష్మస్ఫోటములు అంటారు..అంటే మూలధార స్వాధిష్టాన మణిపూరక స్థానములలో ఉండేవి. హృదయ ప్రదేశంలోని అనాహత చక్రంలో ప్రవేశించిన తరువాత మధ్యమా వాక్కుఅంటారు అనాహత చక్రం మధ్యమా వాక్కుకు నెలవు. కంఠ ప్రాంతంలోని విశుద్ధ చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరీవాక్కు బాహ్యము.


ఏదైనా సంకల్పం కలగగానే దాన్ని ఒక 'భావం లోకి మార్చుకోడం జరుగుతుంది. భావంలోకి మార్చబడిన వాక్కును పశ్యంతి వాక్కు' అంటారు..


భావంలోకి మార్చబడిన దాన్ని వ్యక్తం చెయ్యడానికి సంకేతాలతో ఒక 'భాష" లోకి మార్చుకోడం జరుగుతుంది. మనస్సులోనే జరిగే ఈ సంకేతాల భాషారూపంలో వున్న వాక్కును మధ్యమా వాక్కు అంటారు.


మనస్సులో ఒక భాషలో వున్న వాక్కును భౌతికంగా నోటితో ఉచ్చరిస్తే - అప్పుడు వ్యక్తమయిన వాక్కును ' వైఖరీ వాక్కు అంటారు. ఈ స్థితిలో వున్న వాక్కునే ఎదుటివారు వినగలరు. ఇంతకు పూర్వం మూడు స్థితులలోని వాక్కును వినలేరు. ఈ నాలుగు స్థితులను వరుసగా - పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ వాక్కు స్థితులంటారు.


   పరాస్థితిని - సంకల్పము గాను, పశ్యంతి స్థితిని - భావము గాను, మధ్యమా స్థితిని సంకేతము గాను, వైఖరి స్థితిని - ఉచ్చారణ గాను - సమన్వయ పరచుకోవచ్చును.


     లలితా సహస్ర నామావళిలో, అమ్మవారి ఒక నామం "వైఖరీ రూపా" అని ఉంటుంది.

.

   శబ్దములు కంపనములు కనుక అవి స్పష్టమైన రూపాలను జనింపజేస్తాయి. జగత్తులో ప్రతి శబ్దం ఒక రూపాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక నిర్దిష్టమైన మంత్రాన్ని సరైన రీతిలో, ఉచ్ఛారణ చేసినపుడు, జపించినపుడు... ఏర్పడే శబ్ద తరంగాల ప్రకంపనాలు అత్యున్నత దశలో ప్రత్యేకమైన దేవతా రూపాలను సృజిస్తాయి.

వాక్కు దేవతా రూపం. కాబట్టి వాక్కును జాగ్రత్తగా ఉపయోగించాలి.


    శబ్ద బ్రహ్మము నుండి పుట్టిన పరా వాక్కు, మరల పశ్యంతిగా ఆవిర్భవించింది. మరల మధ్యమగా మారి వైఖరిగా విస్తరించింది.


   పరా-పశ్యంతి-మధ్యమా-వైఖరికి సంబంధించి మరొక కోణం చూద్దాం.

మొదట మనకు సంభాషణ చేయాలి అన్న తలంపు పుడుతుంది. అంటే స్పందన ప్రారంభం అవుతుంది. ఈ శక్తి సహస్రారంలో ఉన్న చంద్ర మండలంలో గల శక్తి. మాటలాడాలన్న ఇచ్ఛా శక్తికి, జ్ఞాన శక్తి మరియు క్రియా శక్తి...తోడవ్వాలి కదా! యోగ పరంగా ఈ స్పందనా శక్తి "ప్రాణ శక్తి". ఈ శక్తిని లలితాదేవి గానూ, శబ్ద బ్రహ్మం గానూ భావిస్తారు. సహస్రారంలో పుట్టిన ఈ శక్తి మూలాధారాన్ని చేరుతుంది. మూలాధారం నుండి మరల, ఒకానొక కుండలినీ శక్తి రూపంలో పైకి బయలుదేరుతుంది. ఇది వాక్కు యొక్క మూల రూపం. ఈ స్థితిలో ఉన్న శక్తి పేరు "పరా". ఇదే మొదటి వాగ్రూపము. ఈ శక్తి స్వాధిష్ఠానానికి వస్తే, ఆ రూపం "పశ్యంతి". ఈ స్థితిలో శబ్ద శక్తి మనస్సు ఆధీనంలో ఉంటుంది. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. ఈ ప్రభంజనంతో ఆ వాగ్రూప శక్తి విశుద్ధ చక్రం వైపుకు పరుగు తీస్తుంది. ఈ విశుద్ధ చక్రం చేరేలోగా...ఈ శక్తిని బుద్ధి అడ్డుకుంటుంది. ఈ స్థాయిలో వాక్కును "మధ్యమా" అంటారు. ఇక్కడ మనస్సు చెప్పే మాటకు బుద్ధి ఒక రూపం కల్పిస్తుంది. భాషా స్వరూపం కూడా ఇక్కడే తయారవుతుంది. మధ్యమా రూప స్పందనా శక్తి...పూర్తి వాక్య రూపం ధరిస్తుంది. ఇక్కడే అకారాది...క్షకారాంత రూపం తయారవుతుంది. ఇలా పూర్తి అయిన మధ్యమా రూపం విశుద్ధ చక్రం వైపుకు పయనిస్తుంది. 


   ఈ విశుద్ధ చక్రంలోనే... శబ్ద బ్రహ్మ రూపమైన శక్తి...వైఖరీ వాక్కుగా మారుతుంది. ఇంతవరకు పూర్తి అర్థవంతంగా తయారైన శబ్దం...వరుస క్రమంలో బయటికి వస్తూ...ఒక్కో కండరాన్ని కదిలిస్తూ...మనం వినే శబ్ద రూపంగా బయటకు వస్తుంది. ఏ వైఖరితో రావాలో నిర్ణయిస్తుంది కనుక, ఇక్కడ దీని రూపం "వైఖరీ వాక్కు".


      మన ఋషులకు వాక్కు యొక్క నాలుగు రకాలు, నాలుగు దేవతా రూపాలుగా దర్శనమిచ్చాయి. ఐం బీజాక్షరం వాగ్భకూటం ఐం లో అ + ఈ +అ +o అనేవి వరుసగా - పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ అని చెప్పబడింది.అయితే ఈ వాక్కు అనేది మనుజులకే కాదు. సృష్టిలో స్థావర జంగమాలన్నిటికీ ఉన్నది. రాయి,రప్పలలో "పరా" రూపంలోనూ, చెట్టు, చేమ, వృక్షాలలో "పశ్యంతి" గానూ, జంతువులలో "మధ్యమా" గానూ కూడా ఉంటుంది 

వైఖరి మానవులకే సాధ్యం అయింది


ఇక శ్రీచక్ర విషయానికి వస్తే

పరా వాక్కు బిందు స్థానం. త్రికోణంలో పశ్యంతీ వాక్కు., వసుకోణం మధ్యమా, మిగిలిన చక్రాలు అంటే దశార యుగ్మము నుండి చతురస్రం వరకు వైఖరి వాక్కు.జాగ్రత్తగా అర్ధం చేసుకొండి.


 ప్రాణంలో పరా వాక్కు, మనస్సులో పశ్యంతి వాక్కు , ఇంద్రియములందు, మధ్యమ వాక్కు వాక్ప్రటన యందు వైఖరీ వాక్కు ఉంటాయని శాస్రం చెబుతోంది . బయటకు కనబడే చెట్టుకు కనబడని వేరు ఉన్నట్లుగా , వైఖరీ వాక్కుకు లోపల పరా, పశ్యంతి, మధ్యమా ఉన్నాయి. కంఠం నుంచి పెదవి వరకు వరకు ఉన్న ఎనిమిది స్థానాలలో ఈ వశిన్యాది దేవతలు ఉన్నారు. ఈ శరీరమే ఒక శ్రీ చక్రం. వశిన్యాది ఎనిమిది దేవతలు మన శరీరంలోనే ఉండి మనకు వాక్కు కలిగిస్తున్నారు. ఈ భావనతో అమ్మని ఆరాధిస్తే దివ్యమైన అనుభూతి కలుగుతుంది.


పరమేశ్వరుని మాయాశక్తి సంకల్ప రూపమైనది. మొదటిది పరా. .(పరస్య శక్తి )పరమాత్మతో ఏకమై ఉన్నప్పుడు అది నిశ్చలం. పరమాత్మ నాశ్రయించి ఉంటే అది కేవలం పర. తన్ను తాను పరామర్శించుకొంటే పశ్యంతి. క్రిందికి దిగి సృష్టికి అభిముఖమైతే మధ్యమ. సృష్టిగా మారిపోతే వైఖరి. పరాదశలో ఉన్న ఆ వాక్కు లేదా శబ్దం పరమమైన అర్థాన్నే చెబుతుంది. వాక్కు పరమం. అది చెప్పే అర్ధమూ పరమమే. ఇవే ప్రకాశ విమర్శలని పేర్కొంటారు . అర్ధాన్ని ఎంతెంత విమర్శిస్తూ పోతే అంతంత దాని ప్రకాశం బయట పడుతుంది. పూర్తిగా విమర్శిస్తే పూర్తిగా అనుభవానికి వస్తుంది. అదే బ్రహ్మానుభవం. ఇది శబ్దార్థ సహాయంతోనే మానవుడు సాధించాలి .


వశిన్యాది అష్ట దేవతలు శ్రీచక్రంలోని సప్తమావరణము లో ఉన్న వాగ్దేవతలు. పరా, పశ్యంతి మధ్యమా, వైఖరి అని నాలుగు విధములైన వాక్కులు – ఎనిమిది విధములైన వశిన్యాది వాగ్దేవతారూపం ధరించాయి (వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలా, అరుణ, - జయినీ, కౌళినీ, సర్వేశ్వరీ వాగ్దేవతలు) . చక్రేశ్వరి త్రిపురాసిద్ధా దేవి .. ఈ వాగ్దేవతలు అక్షారల్లోని ఎనిమిది వర్గలకు అధికారిణులు

ఎనిమిది వర్గలు :: అ - క - చ - ట - త - ప - య - శ మొత్తం ఎనిమిది 

మరొక విషయం చూద్దాము 

. వజ్రేశ్వరీ నామం లో ‘అతి రహస్య శక్తి దాగి ఉన్నది ’ 

శ్రీ చక్రంలో భూపురం నుండి లెక్కించినపుడు - శ్రీచక్రంలో కేంద్రం వద్దగల బిందువు, నవమావరణం అవుతుంది. 

దీనికి ముందుండే ఎనిమిదవ ఆవరణమైన త్రికోణం యొక్క మూడు శీర్షాల వద్ద ముగ్గురు 'అతి రహస్యశక్తు' లుంటారు. 

వారే - కామేశ్వరి, వజ్రేశ్వరీ , భగమాలిని. 


ఈ ముగ్గురిలో రెండవ శక్తి పేరు వజ్రేశ్వరీ. వజ్రశరీర రూపంలో ఉండునది - అని అర్థం. 


మనలో విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరీదేవి 


విశుద్ధ చక్రం ద్వారానే సర్వ వాజ్మయం వ్యక్తం కావాలి. కాబట్టి, ఈ ' వజ్రేశ్వరీ' వాక్కుకు సంబంధించి ఉంటుంది. అందుకే 'వాగ్యై వజ్రః ' అంటారు. వాక్కుకు సంబంధించి 'వజ్రేశ్వరీ' ధ్యానం చేస్తే వాక్ శక్తి స్ఫుటంగా ఉంటుంది. దీనికి సంబంధించిన మంత్ర బీజాక్షరాలు కూడా ఉన్నాయి. వజ్రేశ్వరీ కి సంబంధించిన బీజాక్షరం 'జ్రీం'. ఈ జ్రీం కి ముందు ప్రణవ బీజం, తర్వాత కామరాజబీజం కలిపితే 'ఓం క్లీం, జ్రీం ' అవుతుంది. దీన్ని 'వజ్ర మంత్రం' అంటారు. స్ఫూటంగా వాక్కు వ్యక్తమవ్వాలంటే ఈ వజ్రేశ్వరీ మంత్రాన్ని 'ఓం క్లీం జ్రీం వజ్రేశ్వర్యై నమః అని జపిస్తారు. ఇంద్రుడు జపించి వజ్రాయుధం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ మంత్రాన్ని గురూపదేశం లేకుండా చేయరాదు. 


లలితా సహస్రం లోని శ్లోకాన్ని స్పృశించి వ్యాసం ముగిస్తాను 


""పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా 

మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ""


శ్రీచక్రంలో బిందు స్థానమే 'పరా'. పరాను ప్రత్యక్ (స్వస్వ రూపంలో అంటే బ్రహ్మ )గానే సాధన చేస్తే ' చితి ' గా అర్ధం అవుతుంది. అంటే చైతన్య రూపంగా తెలుస్తుంది. పశ్యంతి రూపాన్ని పరదేవతగా అభివర్ణించారు. శ్రీచక్రంలో త్రికోణ రూపమే పశ్యంతీ. ఆ పైన ఉండే అష్ట త్రికోణ చక్రమే ‘ మధ్యమా '. ఆపైన అన్ని ఆవరణలూ కలుపుకుని ' వైఖరీ '' అని తెలుసుకుంటున్నాము. ఈ నాలుగు రూపాలూ కలిసి ' భక్తుడి మనసు అనే ఆడ హంస ' - అని లలితా సహస్ర నామంలో వశిన్యాది వాగ్దేవతలు వర్ణించారు. మళ్ళీ ' హంస ' అన్న మాట పరమాత్మ స్వరూపాన్నే సూచిస్తుంది. అంటే - పరా దేవతని ప్రత్యక్చితీ రూపంలోనూ, భావ రూపంలో పశ్యంతీ గానూ, జప రూపంలో మంత్రాలను మనస్సులో అనుకోవడం మధ్యమాగా తెలుసుకుని, , ఆ ప్రాణశక్తి అయిన అమ్మవారిని వైఖరి గాను భావించడం జరుగుతుంది.

                         స్వస్తి 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ 

-

కామెంట్‌లు లేవు: