#తెలుగుసూరీడు #చార్లెస్_ఫిలిప్_బ్రౌన్ (Charles Phillip Brown) (నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884).
ఆయన ఒక భారతీయుడు కాదు..ఒక తెలుగు వాడు కాదు ..అసలు #తెలుగు అనే ఒక భాష ఉందని కూడా ఆయనకు 19 ఏళ్ళు వచ్చేవరకు తెలియదు ..కానీ ఈయనని తెలుగులో మొట్టమొదటి ప్రచురణకర్తగా చెప్పుకోవచ్చు. 200 సంవత్సరాల క్రితమే #తెలుగుభాష ని ఉద్ధరించడం కోసం, తెలుగు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం కోసం తన జీవితం మొత్తం అంకితం చేసిన మహామనీషి..మహానుభావుడు 🙏 ఈరోజు మనం పురాణాలూ, భాగవతం, భారతం, రామాయణం ,వాఙ్మయం, మను చరిత్ర, వసుచరిత్ర ఇలాంటి పుస్తకాలు తెలుగు అచ్చులో చదువుకోగలుగుతున్నామంటే దీనికి పునాది 200 సంవత్సరాల కిందట భారత దేశానికి చెందని ఒక బ్రిటిష్ దేశస్థుడు చేసిన కృషి. ఆయనే #సీపీబ్రౌన్..చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్….బ్రిటిష్ వారి అంధకార సామ్రాజ్యంలో నుండి పుట్టిన ఒక కాంతి పుంజం. ఆయనకు తెలుగు భాష కోసం తెలుగు ప్రజల కోసం అనుపమానమైన కృషి చెయ్యాల్సిన అవసరం లేదు. మిగతా వారిలా భోగభాగ్యాలు అనుభవించవచ్చు లేదా కేవలం వారి ఉద్యోగ బాధ్యతలు మాత్రమే చూసుకుని ఉండవచ్చు. కానీ ఆయన ఉద్యోగానికి అస్సలు సంబంధం లేని పని..(ఆయన ఉద్యోగం న్యాయ వ్యవస్థకి సంబంధించినది). ఆ ఉద్యోగం చేసుకుంటూనే తెలుగుభాషకి అచ్చు ప్రాణం పోసారు. అదీ తన సొంత ఖర్చు పెట్టడమే కాకుండా ఆ రోజుల్లో 60000 రూపాయలు (200 ఏళ్ళ క్రితమే 60000 రూపాయలు అంటే ఈ రోజుల్లో వాటి విలువ ఎంతో పోల్చలేము ) అప్పు చేసి మరీ తెలుగు భాషకి జీవం పోసిన గొప్ప మహనీయుడు.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఒక ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించారు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశారు.
‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశానన్నాడు' బ్రౌన్. నిరాలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు.
ఆ రోజుల్లో అసలు తెలుగులో పుస్తకాలు ఏవి ముద్రణ ఉండేవి కావు. తాటాకుల మీద రాసి ఉండేవి. ఆ తాళ పత్ర గ్రంధాలు అసలు ఎక్కడ ఉన్నాయో వెతికి సేకరించి పరిష్కరించడం (వాటిని పండితులతో చదివించి వ్యాఖ్యనాలతో రాసి ముద్రించడం), ఈ సాహిత్యాన్ని పరిష్కరించడమే కాదు తెలుగు భాష అందరికి అందుబాటులో ఉండాలి అంటే ఒక వాచకం ఉండాలి, ఒక వ్యాకరణం ఉండాలి అని ఆలోచించి ఆయన తెలుగు #వ్యాకరణం, #వాచకం , తెలుగు #నిఘంటువులు రాసి ముద్రించడం వంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఆయన సేకరించిన పుస్తకాలన్నీ కలిపితే దాదాపు కొన్ని లక్షల పేజీలు అవుతాయట. కేవలం ఆ కాలంలో ఆయన జరిపిన ఉత్తర ప్రతుత్తరాలే 20 సంపుటాలు (ఒక్కో సంపుటి దాదాపు 400 పేజీలు ) ఉన్నాయట..వీటిల్లో కొన్ని అచ్చు అయినవి మద్రాస్ , లండన్ గ్రంధాలయంలో భద్రపరిచారు.
అసలు 1800 ప్రాంతాల్లో తెలుగు భాష కానీ తెలుగు సాహిత్యం మీద ఆదరణ కానీ విజయనగర రాజుల తర్వాత తగ్గిపోయింది.1806 ప్రాంతాల్లో తెలుగు పుస్తక ప్రచురణ ఆరంభం అయినప్పటికీ 1830 వరకు వేగం పుంజుకోలేదు.అదే తమిళ భాషని తీసుకుంటే 100 సంవత్సరాల క్రితమే ప్రచురణలు ప్రారంభం అయ్యాయి. అచ్చులో పుస్తకాలు లేని రోజులు, తాళపత్ర గ్రంధాల్లో అందునా గ్రాంధిక భాషలో దాగుని ఉన్న సాహిత్యం కేవలం పండితులకి మాత్రమే అర్ధం అయ్యేది. ఈ కారణాల వల్ల ప్రజల్లో నిరక్ష్యరాస్యత బాగా ఉన్న రోజులు అవి.
సీపీ బ్రౌన్ వాళ్ళ నాన్న పేరు రెవరెండ్ డేవిడ్ బ్రౌన్. ఆయన కలకత్తాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆయన రెండో భార్యకి పుట్టిన ఇద్దరి అబ్బాయిల్లో చిన్నవాడు సీపీ బ్రౌన్. 1798 నవంబర్ 10 న కలకత్తాలో జన్మించాడు. వాళ్ళ నాన్నగారు ఈ కుర్ర వాడికి ఆయనకు తెలిసిన అరబ్బీ , పార్సీ , హిందుస్తానీ , గ్రీక్ , లాటిన్, హీబ్రు భాషలు పరిచయం చేశాడు. చిన్నతనంలోనే సీపీ బ్రౌన్ హిందుస్తానీ భాషని ఉచ్ఛరించే విధానం అచ్చు భారతీయుల మాటల్లానే ఉండేదట.1812 లో ఆయన తండ్రి చనిపోయాక వాళ్ళ కుటుంబం అంతా లండన్ వెళ్ళిపోయింది . నిజానికి వాళ్ళ నాన్నగారు తన పిల్లలిద్దరినీ మత గురువులుగా క్రైస్తవ ప్రచారకులుగా చెయ్యాలని అనుకున్నారట. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పిల్లలిద్దరికి చేయూతని అందించడంతో వాళ్ళు లండన్ కళాశాల హైల్బెరీలో చదువు కొనసాగించారు. ఆ కళాశాలలో సంస్కృతం కూడా చెప్తూ ఉండేవాళ్ళు.
ఆయనకు 18 సంవత్సరాలప్పుడు ఉద్యోగరీత్యా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వాళ్ళ అన్నయ్యని కలకత్తాకి, సీపీ బ్రౌన్ ని మద్రాస్ కి పంపించారు. ఆయన మద్రాస్ కి రాకపోయి ఉంటే మరి తెలుగుభాష చరిత్ర ఎలా ఉండేదో !
అలా ఆయన 1817, ఆగష్టు 4న మద్రాస్ చేరుకున్నారు. కంపెనీ వాళ్ళు ఆయనని నువ్వు విధులు నిర్వహించాల్సినది తెలుగుదేశంలో కనుక ముందు తెలుగు నేర్చుకోమని చెప్పారు. అప్పటి వరకు ఆయనకు తెలుగు అనే ఒక భాష ఉంటుందని కూడా తెలియదు . వెలగపూడి కోదండరామ పంతులు గారి చేత ఆయనకు 19 వ యేట తెలుగులో అక్షరాభ్యాసం జరిగింది. అలా ఆయన 3-4 సంవత్సరాలు మద్రాస్ కళాశాలలో తెలుగు మొదటి భాషగా మరాఠీ రెండో భాషగా నేర్చుకుని ఉత్తీర్ణులు అయ్యారు. తమిళ రాష్ట్ర గవర్నర్ థామస్ మన్రో గారి చేతుల మీదగా ఆయన సర్టిఫికెట్ పుచ్చుకున్నారు. గవర్నర్ గారు ఆ సమావేశంలో తెలుగు భాష గొప్పతనం, ఆ ప్రజల అలవాట్లు, పద్ధతులు ఆచార్య సంప్రదాయాలు అన్నీ చక్కగా బ్రౌన్ కి వివరించారు.
1820 లో కడపలో కలెక్టర్ కి (హాన్బెరీ) సహాయకుడిగా బ్రౌన్ ని నియమించారు. ఆ కలెక్టర్ గారు కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడటంతో బ్రౌన్ కి తెలుగు అంటే ఇంకా మక్కువ అయ్యింది. ఆ రెండు సంవత్సరాలు తెలుగు ప్రజలని గమనించడానికి, తెలుగు భాష మీద పట్టు తెచ్చుకోవడానికి ఆయనికి చాలా ఉపయోగపడ్డాయి. 1824 నుండి ఆయన తెలుగుభాష సేవా ప్రస్థానం మొదలయ్యింది .
ఒకసారి ‘Hindu manners, customs and ceramonie s’ అనే పుస్తకం ఆయన కంటపడింది. ఆ పుస్తకంలో వేమన ఒక కవి అని, ఆయన పద్యాలు వేమన శతకంలో రాసారని, తెలుగు ప్రజలలో ఆ పద్యాలు మమేకం అయ్యాయని, కానీ ఆ పద్యాలు ఇప్పుడు ఎవరికి అందుబాటులో లేవు అని రాసి ఉంది. అది ఆయన జీవితంలో పెద్ద మలుపు. అప్పటి నుండి ఆయన వేమన పద్యాలన్నీ తాళపత్ర గ్రంధాల్లో ఉన్నాయని తెలుసుకుని వాటన్నిటిని అన్వేషించి సేకరించారు. ఆ సమయంలో ఆయన మచిలీపట్టణం కోర్టులో జడ్జికి రిజిస్ట్రారుగా పనిచేస్తూ ఉండేవారు. ఆ కోర్టులోనే పని చేసే భత్యం అద్వైత బ్రహ్మ శాస్త్రి, ఆయన స్నేహితుడు డిప్పబట్ల వెంకటశివశాస్త్రి గార్లతో కలసి తాళపత్ర గ్రంధాల్లో ఉన్న పద్యాల అర్ధాలు తెలుసుకుని వాటికి తాత్పర్యం వ్రాయించి పరిష్కరించడం మొదలు పెట్టారు. వాళ్ళు తెలుగులో వ్యాఖ్యానం రాస్తే ఈయన వాటికి ఇంగ్లీష్ లో అర్ధాలు రాసేవారు. అలా 6-7 నెలలు వివిధ కవులతో క్షుణ్ణంగా చర్చలు జరిపి ఆ పద్యాలకి అర్ధవంతమైన వ్యాఖ్యానంతో ఒక శుద్ధ ప్రతిని తయారు చేశారు. ఈ సందర్భంలోనే ఆయన తెలుగు వ్యాకరణం, ఛందస్సు, నిఘంటువులు మీద పరిశోధనలు జరిపారు. మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళ సహాయంతో ఈ పుస్తకాలన్నీ ప్రచురితమయ్యాయి.
1827 లో కడపలో ఒక పెద్ద బంగాళా కొని దాంట్లో ఒక వైపు తోట ఇంకో వైపు స్కూల్, గ్రంధాలయం, తెలుగు పండితులు, కవులు, రాసేవాళ్ళని, పరిష్కరించేవాళ్ళని అందరినీ ఒకే చోటకి తెచ్చి ఒక కుటీర పరిశ్రమలా తన సొంతఖర్చులతో స్థాపించారు. పైడిపాటి వెంకటనర్సయ్య గారిని వేమన పద్యాలు పరిష్కరించడానికి, కంభం నృసించార్య అనే ఆయన రాఘవ పాండవీయానికి వ్యాఖ్యానం రూపొందించడానికి ఇలా ఒక్కక్కరికి ఒక్కో పని అప్పచెప్పి వీళ్లందరినీ చూసుకోవడానికి అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన్ని నియమించారు. 1829 లో కొన్ని రోజులు తిర్చురాపల్లి కోర్టులో రిజిస్టరుగా పనిచేసినప్పుడు తమిళ్ భాషకి తెలుగుకి ఉన్న తేడా గమనించారు.
1832 లో గుంటూరుకి కలెక్టర్ గా పని చేసేటప్పుడు విపరీతమైన కరువు కాలంలో ప్రజలకి గంజి సరఫరా చేసే కేంద్రాలని స్థాపించి సహాయం చేశారు. మచిలీపట్టణంలో ప్రెస్ స్థాపించి సొంతంగా పుస్తకాల ముద్రణ చేయడం మొదలు పెట్టారు. 1834 లో ఉద్యోగరీత్యా రాజమండ్రి బదిలీ అయ్యినప్పుడు ఎవరో ఒకతని కుట్రకారణంగా ఉద్యోగం పోగొట్టుకోవలసి వచ్చింది . అలా ఆయన 1834 లో లండన్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న రెండు ఏళ్ళలో తెలుగు వ్యాకరణం రాశారు. తిరిగి 1837 లో మళ్ళీ భారతదేశంలో ఒక పర్షియన్ అధికారికి అనువాదకుడిగా చేరారు. కాలేజీ బోర్డు అనే సంస్థ సభ్యుడిగా ఉండి చాలా పుస్తకాలు ముద్రణ చేయించారు. 1839లో వేమన పద్యాల రెండవ ప్రతిని, 1841లో నలచక్రవర్తి అనే ద్విపద కావ్యం , 1842లో గౌరన హరి చంద్రోపాఖ్యానం , నలనాద చరిత్ర అనే ద్విపద కావ్యం అచ్చు వేయించారు. 1842 ఆగష్టు 4 న వర్తమాన తరంగిణి అనే పేపర్లో మహాభారతం, ఆదిపర్వం పుస్తకాలు 8 రూపాయలకు లభ్యం అనే ప్రకటనలు చూడవచ్చు. కేవలం పుస్తక ప్రచురణే కాకుండా మచిలీపట్టణంలో ఒక స్కూల్, కడపలో ఒక స్కూల్, మద్రాస్ లో ఒక ప్రీస్కూల్ తన సొంత ఖర్చులతో నడిపారు . ఈ సమయంలోనే ఈయన ఒక ఇంగ్లీష్ వ్యాపారి దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. ఎంత ఆర్ధిక బాధలు ఉన్నా నెలనెలా 150 మంది వికలాంగులకు, దాన ధర్మాలకి 500 రూపాయలు ఖర్చు చేస్తుండేవారు.
1845లో ఈయన సేకరించిన 2500 తాళ పత్ర ప్రతులని రాసిన పుస్తకాలని మద్రాస్ లిటరరీ సొసైటీ వారికి బహుకరించారు. మద్రాస్ లో పోస్టుమాస్టర్ జనరల్ గా స్థిరమైన ఉద్యోగం వచ్చాక సంస్కృతంలో ఉన్న భగవద్గీత, నల సావిత్రి హితోపదేశం, మాఘరాట్నం , కవితారత్నాకరం, అమరం పుస్తకాలని తెలుగులిపిలో ప్రచురించారు. 1855 లో ఉద్యోగ విరమణ చేసి లండన్ వెళ్ళి , లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా తన జీవిత చరమాంకం వరకు సేవలందించారు
1817 నుండి 1834 దాక 17 ఏళ్ళు ,1838 నుండి 1855 దాక మరో 17 ఏళ్ళు మొత్తం 34 ఏళ్ళు భారత దేశంలో సివిల్ ఉద్యోగి లాగా సామ్రాజ్యతత్వ వలసతత్వ ప్రతినిధిగా, తెలుగువాళ్ళ మధ్య బ్రతికి, తెలుగు సాహిత్య అధ్యాయానికి , ఉద్ధరణకు తనలోని జీవశక్తులన్నీ ఖర్చు చేసి తెలుగు సంస్కృతిని, తెలుగు భారతిని తన రక్తంలో జీర్ణింప చేసుకుని తన తత్త్వంలో ఒక ప్రధాన భాగం చేసుకున్న బ్రౌన్ తెలుగు వాళ్లపై ఒక లివింగ్ అథారిటీలా లండన్ లో కాలు పెట్టారు. 1868 లో తెలుగు ఛందస్సు పుస్తకం రాసి పునఃప్రచురించారు.
ఈ తెలుగు సూర్యుడు 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, లండన్లో అవివాహితునిగానే మరణించాడు.
తెలుగు భాషకు చేసిన సేవ:
1.వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.
2.1841లో "నలచరిత్ర"ను ప్రచురించాడు.
3. "ఆంధ్రమహాభారతము"
4. "శ్రీమద్భాగవతము"
5. 1840లో తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు.
6.లండన్‌లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణ భారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు. "హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.
7. 1844లో "వసుచరిత్ర"'
8.1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.
9.1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు.
రచనలు:
1.ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827.
2.లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కథల తెలుగు అనువాదం
3.రాజుల యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర 4.తెలుగు-ఇంగ్లీషు (1852), ఇంగ్లీషు-తెలుగు (1854), మిశ్రభాషా నిఘంటువు, జిల్లా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ (తెలుగు వాచకాలకు అనుబంధమైన నిఘంటువు)
5.తెలుగు వ్యాకరణము - 1840లో ప్రచురణ
6. వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం
ఇతరుల ప్రశంసలు:
నాటి పండితుడు, అద్వైత బ్రహ్మ శాస్త్రి: "సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాస స్థానంగా కనపడుతున్నారు. ఎక్కడ ఏయే విద్యలు దాచబడి ఉన్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నవి... తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కార గ్రంథములు ఆకల్పాంతమున్నూ తమయొక్క కీర్తిని విస్తరిస్తూ ఉంటవి"
ప్రముఖ భాషా పరిశోధకుడు బంగోరె (బండి గోపాల రెడ్డి) : "నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్"
బంగోరె: "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు"
బంగోరె: సీపీ బ్రౌన్ తెలుగు సూరీడు. కారణజన్ముడు. ఆయన మనకు మిగిల్చిపోయిన అక్షర సామ్రాజ్యం ఎంతో విశాలమైంది.
"సి.పి.బ్రౌను అను నాతడు ఆంధ్రభాషామతల్లి సేవకే జన్మమెత్తినట్లు కానవచ్చుచున్నది. ఇతడు ఆంధ్ర వాజ్మయాభివ్రుద్దికి చేసినంతటి పని ఇటీవలి వారెవ్వరూ చేయలేదని చెప్పిన అతిశయోక్తి కానేరదు" - కొమర్రాజు లక్ష్మణరావు
"ఆంధ్రభాషోద్దారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు, మహావిద్వాంసుడు సి.పి.బ్రౌను" – వేటూరి ప్రభాకరశాస్త్రి
స్మృతి చిహ్నం:
బ్రౌను స్మృతి చిహ్నంగా, కడపలో ఆయన నివసించిన బంగళా స్థలంలో బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వము మరియు ప్రజల నిధులు మరియు సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించింది. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు.2006 నవంబర్ 10 న భాషాపరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాగమైంది.
ఆయనలా మనం తాళపత్ర గ్రంధాలు సేకరించక్కర్లేదు..నిఘంటువులు రాయక్కర్లేదు..అప్పు చేసి మరీ తెలుగు భాషకి సేవ చెయ్యక్కర్లేదు..తెలుగులోనే మాట్లాడి..మన పిల్లలకి తెలుగు నేర్పించుకుని వాళ్ళతో కొన్ని మంచి తెలుగు పుస్తకాలు చదివించి తెలుగుని బతికించుకుంటే చాలేమో.. అవే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళులు..🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి