28, జులై 2020, మంగళవారం

రామాయణమ్ 13
.
ఆ అడవిలో కాలుపెట్టే సందులేనంతగా అల్లుకొనిపోయి ఉన్నాయి వృక్షాలు,లతలు .దానికి తోడు పురుగులు ఈలవేసుకుంటూ చేసే ధ్వని!అత్యంత కర్ణకఠోరంగా అరిచే వివిధరకాల జంతువులు ,క్రూరమృగాలు ,  
సామాన్యుడి గుండె జలదరించేటట్లున్నదా వనము .
.
మహర్షిని కుతూహలంతో అడిగాడు!రాముడు! ఏమిటిది ? ఈవిధంగా ఎందుకున్నది? అని
.
రామా ,పూర్వము ఇది రెండు దేశముల సముదాయము 
అవి ఒకటి మలదము,రెండు కరూశము .
.
ఈ రెండు దేశాల ప్రజలు సుఖశాంతులతో ,ధనధాన్యసమృద్ధితో హాయిగా జీవనంసాగించేవారు..
.
మహర్షీ ఈ దేశాల పేర్లు వింతగా ఉన్నవేమిటి? మలదము,కరూశమా? ఆ పేర్లెట్లా వచ్చినవి? అని రాముడు ప్రశ్నించాడు.
.
రామా ! పూర్వము  వృత్రాసుర వధ అయిన పిదప ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకము చుట్టుకున్నది .
అతనిని తీవ్రమైన ఆకలి బాధించింది! ,శరీరమంతా మలినమయై అసహ్యకరంగా మారిపోయాడు!.
అప్పుడు సకలమునిసంఘాలు,దేవతలు ఆయన శరీరమలాన్ని కడిగివేసి మలాన్ని తొలగించారు ,అదేవిధంగా ఆకలిని (కారుశాన్నికూడా) తొలగించారు.
.
 ఆతని మలాన్ని ,ఆకలిని స్వీకరించిన భూమి కావున మలాదము,కరూశము అని పేర్లు ఈ ప్రాంతానికి!.
.
దేవేంద్రుడు సంతోషంతో ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండేటట్లు వరమిచ్చాడు!.
.
కొంతకాలానికి ఒక యక్షిణి ,స్వేచ్ఛారూపధారిణి, వేయి ఏనుగుల బలమున్నది,తాటక నామధేయురాలు ఈ ప్రాంతంలో  జనులను పీడిస్తూ వారిని భయభ్రాంతులను చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నది.
.
దాని భర్త సుందుడు ,కొడుకు మారీచుడు! కొడుకు కూడా తల్లివలెనే మహాబలవంతుడు వాడి బారినపడి బాధపడని వాడు లేడు! .
.
తల్లీ కొడుకులంటే ఉన్నభయం చేత ఈ ప్రాంతంలో అడుగు మోపే సాహసం ఎవ్వరూ చేయటంలేదు. మనమున్న ప్రదేశం నుండి ఒకటిన్నర ఆమడల దూరంలో దాని నివాస స్థానం !
.
రామా ! అలాంటి ఘోరతాటకను నీవు వధించాలి! అని విశ్వామిత్రుడు పలికాడు!.
.
రాముడప్పుడు వినయంగా, మహర్షీ యక్షులకు ఇంతటి బలములేదని విన్నాను ఈవిడకింత బలమెక్కడిది? అని ప్రశ్నించాడు! .
.
నీవన్నది నిజమే రామా ! ఇది సుకేతుడు అనే గొప్పయక్షునకు బ్రహ్మ వరప్రసాదం వల్ల జన్మించింది.
 వేయిఏనుగుల బలంపొందింది. 
.
దీని భర్త సుందుడు అగస్త్య మహర్షికి చేసిన అపచారం వల్ల ఆయన శాపానికి గురి అయి మరణించాడు.
.
అందుకు ఆగ్రహించి తల్లీకొడుకులు ఇరువురూ ఆయనను భక్షించబోగా ఇరువురినీ రాక్షసులు కమ్మని శపించాడు !
.
అప్పటినుండి అది ఈ ప్రదేశాన్ని నాశనంచేస్తూ వస్తున్నది! 
ఈ ప్రదేశం ఒకప్పుడు అగస్త్యుడు నివసించినప్రాంతం!
.
రామా !నీవు తప్ప ముల్లోకాలలో దానిని వధింప సమర్ధుడు లేడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: