28, జులై 2020, మంగళవారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - నాలుగవ అధ్యాయము*

*గజగ్రాహముల పూర్యజన్మ వృత్తాంతములు - వాటి ఉద్ధారము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*4.1 (ప్రథమ శ్లోకము)*

*తదా దేవర్షిగంధర్వా బ్రహ్మేశానపురోగమాః|*

*ముముచుః కుసుమాసారం శంసంతః కర్మ తద్ధరేః॥6425॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! అంతట బ్రహ్మదేవుడు, పరమశివుడు మొదలగు దేవతలు, ఋషులు, గంధర్వులు శ్రీహరియొక్క అద్భుత కార్యమును ప్రశంసించుచు ఆయనపై పుష్పవర్షమును కురిపించిరి.

*4.2 (రెండవ శ్లోకము)*

*నేదుర్దుందుభయో దివ్యా గంధర్వా ననృతుర్జగుః|*

*ఋషయశ్చారణాః సిద్ధాస్తుష్టువుః పురుషోత్తమమ్॥6426॥*

స్వర్గమున దుందుభులు మ్రోగెను. గంధర్వులు గానము చేయుచు, నృత్యములొనర్చిరి. ఋషులు, చారణులు, సిద్ధులు పురుషోత్తముని వేనోళ్ళ ప్రశంసించిరి.

*4.3 (మూడవ శ్లోకము)*

*యోఽసౌ గ్రాహః స వై సద్యః పరమాశ్చర్యరూపధృక్|*

*ముక్తో దేవలశాపేన హూహూర్గంధర్వసత్తమః॥6427॥*

ఆ మొసలి వెంటనే పరమ ఆశ్చర్యమైన దివ్య రూపమును దాల్చెను. ఆ మొసలి ఇంతకుముందు జన్మలో *హూ హూ* అను గంధర్వ శ్రేష్ఠుడు, దేవలుని శాపము వలన అతనికి మొసలి రూపము ప్రాప్తించెను. ఇప్పుడు భగవంతుని అనుగ్రహమువలన అతడు శాపవిముక్తుడయ్యెను.

*4.4 (నాలుగవ శ్లోకము)*

*ప్రణమ్య శిరసాధీశముత్తమశ్లోకమవ్యయం|*
*అగాయత యశోధామ కీర్తన్యగుణసత్కథమ్॥6429॥*

*4.5 (ఐదవ శ్లోకము)*

*సోఽనుకంపిత ఈశేన పరిక్రమ్య ప్రణమ్య తమ్|*

*లోకస్య పశ్యతో లోకం స్వమగాన్ముక్తకిల్బిషః॥4429॥*

ఆ గంధర్వుడు పరమేశ్వరుడైన భగవంతుని పాదములకు శిరసా ప్రణమిల్లెను. పిమ్మట శాశ్వతుడు, సర్వోత్తమ కీర్తి సంపన్నుడు ఐన శ్రీమహావిష్ణువు యొక్క మనోహర లీలలను, ఉదాత్త గుణములను శ్లాఘింపసాగెను. భగవంతుని కృపాపూర్ణ స్పర్శచే అతని పాపతాపములు నశించెను. శ్రీహరికి ప్రదక్షిణపూర్వకముగా ప్రణమిల్లి, బ్రహ్మాదిదేవతలు చూచుచుండగనే అతడు తన లోకమునకు చేరెను.

*4.6 (ఆరవ శ్లోకము)*

*గజేంద్రో భగవత్స్పర్శాద్విముక్తోఽజ్ఞానబంధనాత్|*

*ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః॥6430॥*

గజేంద్రుడు గూడ భగవంతుని కరస్పర్శచే అజ్ఞానబంధమునుండి విముక్తుడాయెను. అతనికి భగవద్రూపము ప్రాప్తించెను. అతడు   చతుర్ముజుడు, పీతాంబరధారి అయ్యెను.

*4.7 (ఏడవ శ్లోకము)*

*స వై పూర్వమభూద్రాజా పాండ్యో ద్రవిడసత్తమః|*

*ఇంద్రద్యుమ్న ఇతి ఖ్యాతో విష్ణువ్రతపరాయణః॥6431॥*

ఆ గజేంద్రుడు పూర్వజన్మమున ద్రవిడ దేశమును ఏలిన ఇంద్రద్యుమ్నుడను పాండ్యవంశ ప్రభువు. అతడు భగవానుని ఉత్తమ ఉపాసకుడు, మహాయశస్వి.

*4.8 (ఎనిమిదవ శ్లోకము)*

*స ఏకదాఽఽరాధనకాల ఆత్మవాన్ గృహీతమౌనవ్రత ఈశ్వరం హరిమ్|*

*జటాధరస్తాపస ఆప్లుతోఽచ్యుతం   సమర్చయామాస కులాచలాశ్రమః॥6432॥*

ఆ మహారాజు ఒకసారి తన రాజ్యమును విడిచి, మలయ పర్వతమునందు నివసింపసాగెను. అతడు జటాధారియై, తాపసవేషమును ధరించెను. ఒకనాడు స్నానాదికములను ముగించుకొని, పూజాసమయమున  ఏకాగ్రచిత్తుడై మౌన వ్రతమును పూని సర్వశక్తిమంతుడైన భగవానుని ఆరాధించుచుండెను.

*4.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యదృచ్ఛయా తత్ర మహాయశా మునిః సమాగమచ్ఛిష్యగణైః పరిశ్రితః|*

*తం వీక్ష్య తూష్ణీమకృతార్హణాదికం   రహస్యుపాసీనమృషిశ్చుకోప హ॥6433॥*

అదే సమయమున దైవికముగా పరమ యశస్వియైన అగస్త్యముని శిష్యగణముతో అచటికి ఏతెంచెను.  ఆ రాజు ప్రజాపాలనమును, అతిథిసేవ మొదలగు గృహస్థాశ్రమ ధర్మములను వీడి, తాపసి వలె ఏకాంతముగా మౌనవ్రతమును బూని ఉపాసించు చుండుటను చూచెను. అందువలన అగస్త్యుడు ఇంద్రద్యుమ్నునిపై కుపితుడాయెను.

*4.10 (పదియవ శ్లోకము)*

*తస్మా ఇమం శాపమదాదసాధురయం  దురాత్మాకృతబుద్ధిరద్య|*

*విప్రావమంతా విశతాం తమోఽన్ధం యథా గజః స్తబ్ధమతిః స ఏవ॥6434॥*

ఆ ముని రాజును ఇట్లు శపించెను: "ఈ రాజు గురువుల యొద్ద శిక్షణను  పొందలేదు. అభిమానముతో పరోపకారము నుండి నివృత్తుడై స్వేచ్ఛాచారియై యున్నాడు. ఇతడు  ఏనుగు వలె జడబుద్ధియై బ్రాహ్మణులకు అవమానము నొనర్చినారు. కనుక, ఇతనికి అజ్ఞానియైన ఏనుగు జన్మ ప్రాప్తించునుగాక"

*శ్రీశుక ఉవాచ*

*4.11 (పదకొండవ శ్లోకము)*

*ఏవం శప్త్వా గతోఽగస్త్యో భగవాన్ నృప సానుగః|*

*ఇంద్రద్యుమ్నోఽపి రాజర్షిర్దిష్టం తదుపధారయన్॥4435॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! అగస్త్యుడు శపించుటకును, వరములను ఇచ్చుటకును సమర్థుడు. ఆ మహర్షి ఈ విధముగా ఇంద్రద్రుమ్నుని శపించి, అచటి నుండి తన శిష్యులతో గూడి వెళ్ళిపోయెను. ఆ రాజర్షియు అది అంతయును తన ప్రారబ్ధకర్మయని భావించెను.

*4.12 (పండ్రెండవ శ్లోకము)*

*ఆపన్నః కౌంజరీం యోనిమాత్మస్మృతివినాశినీమ్|*

*హర్యర్చనానుభావేన యద్గజత్వేఽప్యనుస్మృతిః॥6436॥*

అనంతరము ఇంద్రద్యుమ్నుడు ఆత్మస్మృతిని కోల్పోవు ఏనుగు జన్మను పొందెను. కాని, అతడు ఏనుగుగా జన్మించినను భగవతారాధన ప్రభావమున (అంతిమ సమయమున) అతనికి భగవంతుని స్మృతి కలిగినది. 

*4.13 (పదమూడవ శ్లోకము)*

*ఏవం విమోక్ష్య గజయూథపమబ్జనాభస్తేనాపి పార్షదగతిం గమితేన యుక్తః|*

*గంధర్వసిద్ధవిబుధైరుపగీయమానకర్మాద్భుతం స్వభవనం గరుడాసనోఽగాత్॥6437॥*

శ్రీహరి గజేంద్రుని ఈ విధముగా ఉద్ధరించి, అతనిని తన పార్షదునిగా చేసుకొనును. దేవతలు, గంధర్వులు, సిద్ధులు ఆ పరమాత్ముని లీలలను కీర్తించిరి. పిమ్మట ఆ పరమ పురుషుడు పార్షదుని రూపములో ఉన్న గజేంద్రుని తనతో తీసికొని, గరుఢారూఢుడై తన దివ్యధామమునకు చేరెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************

కామెంట్‌లు లేవు: