16, జులై 2020, గురువారం

వరలక్ష్మి వ్రతం తీసుకోవలసిన జాగ్రత్తలు


హాయ్ లేడీస్, శ్రావణ మాసం వచ్చేస్తోంది,  అందరు అమ్మవారిని ఆహ్వానించే హడావిడి లో ఉన్నారు. ఇళ్ళు వాకిళ్లు  శుభ్రం చేసుకుని నోములు,  పూజలు,  వ్రతాలు చేసుకోవాలి అని, పనులు మొదలెట్టారు.  ఇక నైవేద్యం పేరుతో  పిండి వంటలు లాగించేయొచ్చు. ఈ సందర్భంగా అందరికీ ఒక విన్నపం. ఈ సంవత్సరం మన దేశం corona  అనే మహమ్మారి తో పోరాడుతోంది. రాబోయే కొద్ది నెలలు మనకి చాలా కీలకమైనవి. మనదేశంలో ఎంతో మంది వైద్యులు, వారికి సహాయం చేసేవారు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఎన్నో హాస్పిటల్స్ లో బెడ్ సరిపోక, వెంటిలేటర్లు లేక, జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గమనించాల్సింది, మనం చేసే ఏ పని వల్ల చిన్న ఇబ్బంది కలిగినా  వైద్య వ్యవస్థ తట్టుకునే పరిస్థితి మనకి లేదు. మనం అందరం చాలా బాధ్యతతో, జాగ్రత్తతో, వ్యవహరించాల్సిన సమయం. ఏ చిన్న పొరపాటు జరిగినా, కొన్ని వందల కుటుంబాలు, డాక్టర్లు నర్సులు, పెద్దలు పిల్లలు ఎంతో మంది కరోనా బారిన పడతారు. దయచేసి ఆడవారు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. పేరంటాలు పూజలు పేరిట పదిమందిని పిలవకండి. ఇది క్షమించరాని తప్పు. భగవంతుడు కూడా దీన్ని అంగీకరించడు. గుళ్ళు కూడా మూసేసి, నైవేద్యాలు ప్రసాదాలు ఇవ్వడంలేదు ఎక్కడ. అంటే మన సమస్య తీవ్రత గురించి అర్థం అవుతోంది. భగవంతుడు కూడా  నియమాలు పాటిస్తున్నాడు. మనం కూడా నిజమైన భక్తులం అయితే ఆయనతో నడవాలి. అసలు భక్తి అంటే ఏంటి? మనం క్షేమంగా ఉండి, అందరి క్షేమాన్ని కోరుకోవడం. దానికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చాలు,ఒక మంచి నైవేద్యం, ఒక చిన్న దీపారాధన, భక్తితో ఒక స్తోత్రం చేసుకుంటే చాలదా? పదిమందిని పిలిచి ఈ సంవత్సరం ఎందుకు ఈ ఆర్భాటాలు? ఎందుకు ఈ చాదస్తాలు? ఒక సంవత్సరం ఇంట్లో పూజ చేసుకో లేమా? మాస్కు పెట్టుకున్నాం కదా, శానిటైజర్ రాసుకుందాం కదా, దూరంగా కూర్చున్నాం కదా అని దయచేసి అనుకోవద్దు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, దురదృష్టవశాత్తు ఎంతోమంది కరోనా బారిన పడుతున్నారు. ప్రసాదాలు తీర్ధాలు పంచడం వల్ల, ఇతరులని ఇబ్బంది పెట్టిన వాళ్లు అవుతారు. మీ భక్తి పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మీరు పిలిచారు కదా అని మొహమాటంతో ఇష్టం లేకపోయినా, వచ్చి ఇబ్బంది పడతారు, ఇబ్బంది పెడతారు. ప్రతి కుటుంబంలోనూ పెద్దవాళ్లు, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు, చంటి పిల్లలు, ఉండొచ్చు. దయచేసి ఆ విషయం గుర్తుంచుకోండి. దయచేసి ఎవరి ఇంట్లో వాళ్ళు హాయిగా ఉన్నదాంట్లో మనస్పూర్తిగా అమ్మవారిని పూజించుకుందాం. భక్తి వేరు, చాదస్తాలు వేరు, దయచేసి అర్థం చేసుకోండి. 10 మందికి హాని కలిగించే విషయం ఏ మతము సమ్మతించదు. భగవంతుడు హర్షించ డు. ఒక్కరూ ఆదర్శంగా ఈ మార్గాన్ని అనుసరించి నా, పది మంది మిమ్మల్ని అనుసరిస్తారు, తద్వారా దేశానికి, వైద్య వ్యవస్థ కి మేలు చేసిన వారం అవుతాం. #Stay home stay safe. #NoSocialgatherings.

కామెంట్‌లు లేవు: