16, జులై 2020, గురువారం

వేదమంత్రాన్ని వింటే లాభమొస్తుందా?

మనపీఠాదిపతులు, అవధూతలు, సత్యమెరిగిన వారు ఎమంటారంటే సమాన్య జనానికి వేదం రాకపోయినా ఫర్వాలేదు వారు వింటే చాలు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.

మనకు చిన్నప్పుడు మన అమ్మ లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో ఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు, అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చిన్ని పాపకి.

Vedas will help the human beings
ఇదే విధంగా వేదమంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్దతరంగాలు అంతటిని ప్రభావితం చేస్తాయి. ఆ శబ్దబ్రహ్మం మనకు రక్ష అవుతుంది.

ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటాయి. కొన్ని రేడియో తరంగాలు, కొన్ని AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV తరంగాలు, ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు ఒక వాటి వాటి నిర్దుష్ట frequencyతో మనను చుట్టుముట్టి వుంటాయి. మనమొక రేడియో రిసీవర్ పెట్టుకుని ఆ స్టేషన్ కి ట్యూన్ చేస్తే ఆ తరంగాలు రేడియో నుండి ఒక మంచి పాట రూపంలో అవగతం అవుతాయి.

లేదా మన మొబైల్ నుండి వాటిని డేటా గానో, ఒక ఫోన్ కాల్ గానో అందుకోగలము. అటువంటి పరికరం మన దగ్గర ఉన్నప్పుడు వాటిని మనం సరిగ్గా రిసీవ్ చేసుకుని ఆనందించగలము. వాటితో పాటు మనకు noise కూడా వస్తుంది. రిసీవర్ సరైనది కాకపోతే ఆ noise మన చెవులకు కానీ కళ్ళకు కాని ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా మనం వినగా వినగా చిరాకు పుట్టి మానసిక ప్రశాంతత కోల్పోగలము.

ఎలా అయితే ఇటువంటి తరంగాలు ఉన్నాయో, మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్ తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా ఉంటాయి.

ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు మన చుట్టూ ప్రకటితం అవుతాయి. ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయి. తద్వారా కేవలం మన కర్ణావయవం ద్వారా కేవలం మంచికి సంబంధించిన frequency మన మెదడుకు అందిస్తుంది. తద్వారా మన బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యం మాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది.

అదే మంత్రం మరిన్ని సార్లు మనమే చదవగలిగితే ఆ ఎనర్జీ మనమే తయారు చేసుకోగలము. మంత్రాన్ని కేవలం వినడం ద్వారా మన చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తే అదే మనం ఉచ్చరించగలిగితే మరింత శక్తియుతంగా ఆ పాజిటివ్ శక్తిని మనం గ్రహించగలము. ఎలాగంటే ఒక గదిలో చెడు వాసన వస్తుంటే మనమొక రూమ్ స్ప్రే ద్వారా ఆ చెడు వాసనను పోగొట్టి మంచి సువాసనను ఆ గదిలో కొంత సేపు నిలపగలమొ అలాగే మంత్రాన్ని విన్నంత సేపు అదే జరుగుతుంది. అదే ఆ చెడు వాసన ఎక్కడ నుండి వస్తోందో మనమే కనిపెట్టి దాన్ని బయటకు విసర్జించి సంపూర్ణంగా నివారించడం అనేది మనమే మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది.

కేవలం ఉచ్చరించడం తో ఆగిపోతే అక్కడ వరకు లాభం. అన్నం కేవలం తిని ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాదు కదా. అది జీర్ణం అవ్వాలి. అది జీర్ణం అయితేనే ఆ ఆహారం నాకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో మనం మరిన్ని పనులు చెయ్యగలము. అదే విధంగా కేవలం మంత్రోచ్చరణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం ధ్యానం చెయ్యగలిగితే ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది. తద్వారా మనం మంత్రం వలన సంపూర్ణలాభం పొందుతాము. "మననాత్ త్రాయతే ఇతి మంత్రః". మననం చెయ్యడం మాత్రం వల్ల రక్షించేస్తుంది. ఇక నిధిధ్యాస చేసి ఆ మంత్రం మీద తపిస్తే లభించే శక్తి మనకే కాదు మన చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలుగచేస్తుంది.

మన కర్మలవలన లోకశాంతి ఆశిస్తే ఆ లోకంలో నువ్వు ఒక వ్యక్తివి కాబట్టి నీకు కూడా ఆ లాభం వస్తుంది. మన సనాతన ధర్మం ఎప్పుడూ లోకహితం చెబుతుంది. నువ్వు చెప్పే అష్తోత్తరంలో నీ నక్షత్ర పాదానికి ఒక్క నామం అయితే మిగిలిన 107 నామాలు 27నక్షత్రాల x 4పాదాలకు చెందిన లోకం అంతటికీ మంచి జరగాలని ఆకాంక్షించేవిధంగా మనకు విష్ణు సహస్రనామాలు 108 జపించమని, లేదా మంత్రం తక్కువలో తక్కువగా 108 స్మరించమని పద్ధతిని తెలియజేస్తుంది శాస్త్రం. ఏది చేసినా అందరూ సుభిక్షంగా శాంతిగా ఉండాలని ఆకాంక్షించే అద్భుతమైన భారతదేశ ధర్మం మన సనాతన ధర్మం, లోకా సమస్తా సుఖినో భవంతు.

సేకరణ.....

కామెంట్‌లు లేవు: