22, జులై 2020, బుధవారం

*శ్రీకృష్ణలీలలు*

భాగవతంలో  ఇలా చెప్పలేదు.

పెద్దలు చెప్పారు నా చిన్నప్పుడు. భగవంతుని లీలలు ఇలా కూడా ఉంటాయని అది కథగా అల్లాను. 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అది మండు వేసవి. మధ్యాహ్న ఒంటిగంట దాటింది. ఆ అవ్వ పండు ముదుసలి. తలపై బరువైన పళ్ళ బుట్టతో వేణుగోపాలస్వామి గుడిదగ్గర కాసేపు నీడలో కూచుందామని వచ్చింది. మెల్లగా బుట్టదించింది. చెమట పట్టిన ఆ ముడుతల ముఖాన్ని తుడుచుకుంటూ  *నాయనా గోపాలా ఊరంతా తిరిగాను. ఒక్కపండుకూడా అమ్మలేదు. ఈ రోజు పస్తేనా*  ఆ వేణుగోపాలుని విగ్రహం చూస్తూ అంది.

అంతలో ఒక బాలుడు. నుదుటిపై కస్తూరి తిలకం, వక్షస్థలంపై కౌస్తుభహారం, నాసాగ్రమున నవమౌక్తికం,  కంఠాన ముత్యాల హారం, చేత పిల్లనగ్రోవి, శిఖలో నెమలి పింఛం. ఎవరో కాదు. ఆ బాలుడు వేణుగోపాలుడే. ఆ అవ్వ దిశగా వస్తున్నాడు. ఆ అవ్వ అలా చూస్తోంది ఎవరా అన్నట్లు. దగ్గరగా వచ్చిన బాలుని చూసింది. ఆ లీలా మానుషుని చూసింది. అయినా కలియుగం. భగవంతుని దర్శనం ఏమిటిలే అనుకుంది. 

*అవ్వా, ఈ పళ్ళుతీయగా ఉంటాయా* అడిగాడు.

*అవును కన్నా. చాలా తీయగా ఉంటాయి. తీసుకో* అంది. 

బాలుడు: *ఎన్ని* 

అవ్వ: *ఎంత డబ్బు ఇస్తే అన్ని*

బాలుడు: *డబ్బా? అంటే?*

అవ్వ: *నీకు అర్ధం అవలేదా*

అవలేదన్నట్లు తల ఊపాడు

ఆ చోద్యాన్ని నారదుడు చూస్తున్నాడు. ఆ లీలామానుష విగ్రహదారి లీల ఏమిటా అన్నట్లు గమనిస్తున్నాడు.

అవ్వ: *అయ్యొ పిచ్చికన్నా, డబ్భంటేనే తెలియదా? నీవు ఏదైనా తీసుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వాలి. అదే డబ్బంటే*

బాలుడు: *డబ్బా? అదేమిటి? నాదగ్గర లేదే?*

అవ్వ: *నీకు తెలియదులే. అమ్మనడుగు పళ్ళుకొనడానికి డబ్బు కావాలని. ఇస్తుంది. పో. త్వరగా రా*

బాలుడు: *అమ్మ ఇంట్లో లేదు. యమునకు వెళ్ళింది*

అవ్వ: *ఇంట్లో ఏమైనా ధాన్యం గింజలున్నాయా*

బాలుడు: *ఓ చాలా ఉన్నాయి. గాదెల నిండా ఉన్నాయి*

అవ్వ: *అయితే  తీసుకురా. పళ్ళు ఇస్తాను*

బాలుడు: *చాలా వింతగా ఉందే. అమ్మ ఎన్నో ఇస్తుంది. కానీ ఏమీ తీసుకోదు. గొల్లభామలు వెన్న పెడతారు. డబ్బులు తీసుకోరు. వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకోమంటారు. కౌగిలించుకోమంటారు. అమ్మా అనమంటారు*

బాలుడి మాటలు అవ్వకు అంత అలసటలోను నవ్వు తెప్పిస్తున్నాయి. బాలుని చూస్తోంది అలాగే. ఏదో తన్మయమయిపోతోంది ఆ ముద్దుముద్దు మాటలకు.

బాలుడు: *అమ్మా*

అవ్వ: *అమ్మానా? నన్నే* 

బాలుడు: *అవునమ్మా నిన్నే అమ్మా అన్నాను. అమ్మా అంటాను. నిన్ను కౌగలించు కుంటాను. నీ ఒళ్ళో కూచుంటాను. నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఒక్క పండు ఇవ్వవా?తినాలనుంది*

అవ్వ: *పిచ్చి తండ్రీ. నాకా అదృష్టం లేదుకన్నా.*

బాలుడు: *ఎందుకు?*

అవ్వ: *నేను అంటరానిదానను. నేను ఎలా ముద్దాడగలను?*

అవ్వ అలా అంటుంటే బాలుడు *ఇలా* అంటూ అవ్వ ఒడిలో వాలిపోయాడు. అవ్వను ముద్దె ట్టుకున్నాడు. మెడ చుట్టూ చేతులు చుట్టేశాడు.

అవ్వ: *అయ్యో కన్నా. ఏమిటిది. ఎవరైనా చూస్తే ఎంత గొడవ. నేను అంటరాని దానను*

బాలుడు: *ఏం? అంటరానివారు మనుషులు కారా?. అలాంటి ఆంక్షలు నాకు ఇష్టంలేదు. నా స్నేహితులు చాలా మంది అంటరానివారే. నవ్వు కూడా అమ్మవే నాకు* అంటూ అవ్వనుముద్థు పెట్టుకున్నాడు.

నారదుడు చూస్తున్నాడు. దవడలు నొక్కుకుంటున్నాడు. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.

అవ్వ ఆ బాలుడి కళ్ళలోకి అలా వాత్సల్యంగా శ్రీకృష్ణునికి యశోదాదేవిలాగ, శ్రీనివాసూనికి వకుళాంబలాగ చూస్తోంది. తన అదృష్టానికి మురిసిపోతోంది. 

అవ్వ: *కన్నా నువ్వు ఎవరివి? ఏమిటీ మాయ? నీ స్పర్శ నా ఆత్మలో వెలుగు చిమ్మి తన్మయ పరచింది. క్రిందటి జన్మలో యశోదా దేవినా? లేక వకుళాదేవినా? చాలు ఈ అదృష్టం. ఇంతకన్నా ధనం వద్థు. తీసుకో పళ్ళు ఎన్నికావాలో. ఒకటా? రెండా? అన్నీనా? తీసుకో కన్నా ఎన్నికావాలో*.

బాలుడు: *నాకు ఇవి అన్నీ కావాలి*

అవ్వ: *అలాగే కన్నా. అన్నీ తీసుకో* అన్నీ తీసి ఒక గుడ్డలో మూట కట్టబోయింది.

బాలుడు: *ఉండమ్మా. బాధపడకు. నేను కావలసినన్ని  ధాన్యం గింజలు కూడా తెస్తాను* 

అవ్వ: *కన్నా వద్దు. నా జన్మ తరించిపోయింది. పళ్ళు  తీసుకో కన్నా*

ఆ బాలుడు వినిపించుకోకుండా చిట్టి చిట్టి అడుగులతో తుర్ మంటూ  ఇంట్లోకి వెళుతుంటే ఆ అవ్వ ఆ బాలునివైపే చూస్తూ తన్మయమయిపోతోంది.

బుట్టలో పళ్ళన్నీ ఆ బాలునికోసం గుడ్డలో వేసి మూటకడుతోంది.

ఇంతలో ఆ బాలుడు పెద్ద నంద (ధాన్యం దాచే పెద్ద జాడీలాంటి కుండ) మీద ఉన్న మూత రెండు చేతులతో మెల్లగా దించి క్రింద ఉంచాడు. చిట్టి చేతులను దోసిలిగా చేసి, నిండా ధాన్యం తీసుకున్నాడు. తీసుకు వస్తున్నాడు. దారంతా గింజ గింజా పడిపోతున్నాయి. 

బాలుడు: *ఇవిగో ఇన్ని గింజలు తెచ్చాను. తీసుకో* అంటూ అవ్వకు చూపించాడు. ఆ చిట్టి చేతుల దోసిలిలో పది లేదా పదిహేను గింజలు మాత్రమే ఉన్నాయి. 

అవ్వ అలా దోసిలివైపు ఆబాలుని బుంగమూతవైఫు, ఆ బాలుని మిలమిలలాడే కన్నులవైపు చూస్తోంది.

ఆ బాలుడు గర్వంగా చిరునవ్వుతో, నాడు  పదునాల్గులోకాలు యశోదాదేవికిచూపిన ఆ నోటిని సగం తెరచి అవ్వవైపు చూస్తున్నాడు.

ఆ గింజలు చూసి పక్కున నవ్వలేక బోసి నోరు సగం తెరచుకుని, కంటి నుండి వాత్సల్య పూరితమైన ఆనందాశ్రువులతో లీలామానుషధారిని చూస్తూ తన్మయమైపోతూ తనను తాను మరచిపోయి అలా ఉండిపోయింది ఆ అవ్వ. 

అవ్వ: *అబ్బో చాలా తెచ్చావే. చాలు కన్నా* 

బాలుడు: *చాలానే దోసిలిలో తీసకున్నాను. అన్నీ మార్గంలో జల్లుకుపోయాయి. ఇవే ఉన్నాయమ్మా* బుంగమూతితో అవ్వ వైపు చూస్తున్నాడు.

అవ్వ: *ఇవే చాలా ఎక్కువ కన్నా. నా బుట్టనిండా అవుతాయి.* ఆ ధాన్యంగింజలు తీసుకుంది. ఈరోజు ఒక మంచిరోజు అనుకుంది అవ్వ. ఆ కొంచం గింజలే బుట్టలోని గుడ్డలో అపురూపంగా పోసుకుంది. పళ్ళమూట బాలునికి ఇచ్చింది. బాలుడిని మనసారా కౌగలించుకుంది. ముద్థుపెట్టుకుంది. విడువలేక విడువలేక బయలుదేరింది.

అంతా నారదమహాముని తిలకించుతున్నాడు. ఆ శ్రీకృష్ఞపరమాత్మ ఏ లీల చూపనున్నాడా అన్నట్టు నమస్కారం చేశాడు.

అవ్వ బుట్ట తేలికగా ఉంది. మనసు ఆ బాలుని స్పర్శతో పరమానందంతో నిండిపోయింది. ఇంటికి చేరింది. నట్టింట్లో బుట్ట క్రింద పెట్టి, కూర్చుని బుట్టలోని ధాన్యం గింజలు కట్టిన గుడ్డ తెరిచి చూస్తే......🙏🙏🙏అందులో ధాన్యంగింజలు లేవు. వాటి స్థానంలో గంపెడు నవరత్నాలు, మణి మాణిక్యాలు ధగధగలతో అవ్వ కళ్ళను ఆశ్చర్యపరిచాయి. ఆమె చేతులు రేండు జోడించి పరమాత్మని నమస్కరిస్తున్నాయి. 

గమనిస్తున్న నారదుడు ఆ పరమాత్మ ఆవ్వపై కురిపించిన కనకవర్షానికి ఇది పరమాత్మ చూపించిన ఇంకొక భక్తిమార్గము అనుకున్నాడు. మనకు ధనరాశులు ఇచ్చి  భక్తిమార్గంలో వెళుతామా లేక ధనరాశులవలన వేరే పేరాశలు, పెనబంధాలకు  మార్గం మార్చుకుంటామా అనేదానికి ఇది ఒక పరీక్ష కాదుగదా? ఆ పరమాత్మ వేసే ధనాకర్షణ అనే ఉచ్చులో నరుని వివేకము ఏవిధంగా పయనిస్తుందో..దైవచింతనవైపా లేక ధనచింతనవైపా? నరుడీ పరీక్షలో బాగా యోచించి ధనమనే మాయాపాశానికి లొంగక ఆ పరమాత్మ చింతనలోకి వెళతాడా లేక ఆ ఉచ్చులోచిక్కిపోయి ఐహిక బంధాలలో ఉండిపోతాడా? ఆ నందనందనుడు బహు చమత్కారి. అనుకున్నాడు నారదుడు🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

కామెంట్‌లు లేవు: