16, నవంబర్ 2020, సోమవారం

15-02-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఆ సంసారవృక్షమునే ఇంకను వర్ణించుచున్నారు - 

 

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్యశాఖా 

గుణప్రవృద్ధా విషయప్రవాలాః | 

అధశ్చ మూలాన్యనుసన్తతాని 

కర్మాను బన్ధీని మనుష్యలోకే || 

 

తాత్పర్యము:- ఆ (సంసార) వృక్షముయొక్క కొమ్మలు (సత్త్వరజస్తమో) గుణములచే వృద్ధిబొందింపబడినవియు, (శబ్దాది) విషయములనెడు చిగుళ్లుగలవియునై, క్రిందికిని (స్థావరము మొదలుకొని) మీదికిని (బ్రహ్మలోకమువఱకు) వ్యాపించియున్నవి. మనుష్యలోకమునందు కర్మసంబంధమును (కర్మవాసనలను) గలుగజేయునవియగు దాని వేళ్ళు క్రిందను (మీదనుగూడ) బాగుగ విస్తరించి (దృఢముగ నాటుకొని)యున్నవి. 


వ్యాఖ్య:- ఈ సంసారవృక్షము స్వల్పమైనదికాదు. అతివిశాలమైనది. అనాదికాలమునుండి కోట్లకొలది జన్మలనుండి బాగుగ దృఢపడుచువచ్చి, వేళ్ళు తన్నుకొని శాఖోపశాఖలుగ విస్తరించియున్నది. కర్మవాసనలే దీని వేళ్ళు. సత్వరజస్తమోగుణములచే దీని శాఖలు బలపడుచున్నవి. శబ్దాది విషయములయొక్క సేవనముచే దీని చిగుళ్లు వృద్దియగుచున్నవి. దీనినిబట్టి త్రిగుణరాహిత్యముచేత శాఖలు, విషయవిరక్తిచేత చిగుళ్ళు వాసనారాహిత్యముచేత వేళ్ళు ఈ సంసారవృక్షమునకు తప్పక నిర్మూలితములు కాగలవని స్పష్టమగుచున్నది. చెట్టునకు ముఖ్యాధారము మూలమే అయినట్లు ఆ సంసారవృక్షమునకు కర్మవాసనలే మూలము. కావున విజ్ఞుడు వైరాగ్యవిచారణాదులచే ప్రయత్నపూర్వకముగ ఆ వాసనలను తొలగించివేసికొని సంసారబంధవిముక్తుడు కావలయును. అట్లు కాకుండ, రాగద్వేషాదులచే ఆ వాసనలను ఇంకను బలపఱచుచు పోయినచో సంసారదుఃఖ మెన్నటికిని జీవుని వదలనేరదు. 


ప్రశ్న:- సంసారవృక్షమును ఇంకను వర్ణించి చెప్పము?

ఉత్తరము:- (1) దానికొమ్మలు (సత్త్వరజస్తమో) గుణములచే వృద్ధిబొందింపబడినవియు, (శబ్దాది) విషయములను చిగుళ్ళుగలవియునై క్రిందికి మీదికి అంతటను వ్యాపించియున్నవి. (2) మనుష్యలోకమున కర్మసంబంధమును గలుగజేయునవియగు దానివేళ్ళుగూడ క్రిందను మీదను బాగుగ వ్యాపించి దృఢపడియున్నవి.

కామెంట్‌లు లేవు: