16, నవంబర్ 2020, సోమవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అణగారిన అహంకారం!.*


శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన రెండు మూడు సంవత్సరాలు గడిచిన తరువాత ఒక వేసవి కాలంలో..విజయవాడ నుంచి ఒక సిద్దాంతి గారు మొగలిచెర్ల వచ్చారు..పలు దేవాలయాల ప్రతిష్టలు ఆయన చేసివున్నారు..ఆ రోజుల్లో ఆలయాల వాస్తు చూడాలన్నా వారినే సంప్రదించేవారు..మా అమ్మా నాన్న గార్లకు ఆయనతో చాలాకాలం నుంచీ పరిచయం ఉంది..అప్పటికే సుమారు అరవై ఏళ్ల వయసు..మా అమ్మగారిని "అమ్మాయీ.." అనీ..నాన్న గారిని.."శ్రీధరా.." అనీ పిలిచేవారు..అంతటి చనువు ఉండేది..మా అమ్మగారు "బాబాయి గారూ.." అని పిలిచేది..


శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేస్తున్న రోజుల్లో..ఈ సిద్ధాంతి గారిని తీసుకొని మా తల్లిదండ్రులు ఒక శనివారం నాడు మాలకొండ వెళ్లి, శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం చేసుకొని..శ్రీ స్వామివారిని కూడా కలుద్దామని శ్రీ పార్వతీ దేవి మఠం వద్దకు వచ్చారు..నిజానికి ఈ సిద్దాంతి గారికి శ్రీ స్వామివారిని పరిచయం చేయాలని మా నాన్నగారికి కలిగిన కోరిక..అదేమీ చిత్రమో..ఆరోజు ఎంతసేపు ఎదురుచూసినా.. శ్రీ స్వామివారు రాలేదు..సాయంత్రం దాకా చూసి, మా అమ్మానాన్న గార్లు వెనక్కు వచ్చేసారు..సిద్దాంతి గారు ప్రక్కరోజు విజయవాడ వెళ్లిపోయారు..ఆ ప్రక్కవారమే మళ్లీ అమ్మా నాన్న మాలకొండ వెళ్లారు..ఆ వారం శ్రీ స్వామివారు వీళ్ళకోసమే ఎదురుచూస్తున్నట్లు కూర్చుని వున్నారు..


"పోయిన వారం ఒక సిద్ధాంతి గారిని తీసుకొచ్చాము నాయనా..మీ కోసం చాలా సేపు ఎదురుచూసి మొగలిచెర్ల వెళ్ళాము.." అన్నారు మా అమ్మగారు..


"తెలుసమ్మా..ఆ అహంకారిని కలవడం ఎందుకులే అని అనుకున్నాను.." అన్నారు స్వామివారు..అమ్మా నాన్న గార్లు ముఖాముఖాలు చూసుకున్నారు..తమకు పరిచయమైనప్పటినుండి..శ్రీ స్వామివారు ఎవ్వరి గురించీ..ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా గానీ..ఎటువంటి వాఖ్యలూ చేయలేదు..చేయరు కూడా..కానీ ఈరోజెందుకో ఆ సిద్దాంతి గారిని అహంకారి అని అనేశారు..ఆ తరువాత, సిద్ధాంతి గారు ఇదే మొగలిచెర్ల రావడం..శ్రీ స్వామివారి మందిరానికి వెళదామని ఆయనే అమ్మా నాన్న గార్లతో చెప్పారు..సరే అని చెప్పి..ఎద్దులబండి కట్టించి..అందులో వారిని ఎక్కించుకొని..శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..


శ్రీ స్వామివారి మందిరం ముందు బండి ఆపారు..బండి దిగి.."శ్రీధరా..ఈ మందిరం వాస్తు ఎవరు చూసారు?..చాలా మార్పులు చేయాలి.." అన్నారు సిద్ధాంతి గారు..అప్పటికి ఆయన  శ్రీస్వామివారి మందిరం లోపలికి అడుగు కూడా పెట్టలేదు..


"శ్రీ స్వామివారే దగ్గరుండి కట్టించుకున్నారు.." అన్నారు నాన్నగారు.."అవునా..ఒక్క నిమిషం శ్రీధరా..చుట్టూరా తిరిగి చూసి..ఆపైన మందిరం లోపలికి వెళదాము.." అన్నారు సిద్ధాంతి గారు..


నాన్నగారికి కొద్దిగా చిరాకు వేసినా..లోపలే అణచుకొని..సిద్ధాంతి గారిని మందిరం వెలుపలి వైపు చుట్టూ ప్రదక్షిణ గా తిరగసాగారు..సగం ప్రదక్షిణ పూర్తి అయిందో లేదో..సిద్దాంతి గారికి కడుపులో చిన్నగా  నొప్పి మొదలైంది..మరో రెండు అడుగులు వేసే సరికి నొప్పి తీవ్రం అయింది..రెండు నిమిషాల కల్లా ఆయన అడుగు కూడా వేయలేక అక్కడే నేలమీద కూలబడి పోయారు..నాన్నగారికి భయమేసింది..ఆయన్ను పొదివి పట్టుకొని..అతికష్టం మీద బండి దాకా తీసుకొచ్చి..బండిలో కూర్చోబెట్టారు..గబ గబా బండికి ఎద్దులు కట్టి మొగలిచెర్ల కు తిరిగి బైలు దేరారు..


బండి శ్రీ స్వామివారు ఆశ్రమం కట్టించుకున్న ఫకీరు మాన్యం హద్దులు దాటిందో లేదో..సిద్ధాంతి గారికి కడుపులో నొప్పి శాంతించింది..లేచి కూర్చున్నారు.. మళ్లీ వెనక్కు తీసుకెళ్ళకుండా నాన్నగారు సిద్ధాంతి గారిని మొగలిచెర్ల లోని ఇంటికి తీసుకొచ్చారు.. అమ్మతో జరిగిన విషయం అంతా చెప్పేసారు..అమ్మకు ఆరోజు శ్రీ స్వామివారు చెప్పిన "ఆ అహంకారిని కలవడం ఎందుకులే అని రాలేదమ్మా.." అనే మాటలు చెవుల్లో మారు మ్రోగాయి..నాన్నగారికి కూడా గుర్తుచేశారు..సమాధి లో కూర్చుని కూడా సిద్ధాంతి గారు తన వద్దకు రావడానికి శ్రీ స్వామివారు ఇష్టపడలేదని మా తల్లిదండ్రులకు అర్ధమైంది..


"బాబాయి గారూ..మిమ్మల్ని శ్రీ స్వామివారు దూరంగా పెట్టారు..మీలోని అహంకారమే అందుకు కారణం.." అని మా అమ్మగారు చెప్పారు.."నిజమే తల్లీ..నేను ఆ మహానుభావుడు కట్టించుకున్న ఆశ్రమానికే వంకలు పెట్టబోయాను.. ఆరోజు స్వామివారు జీవించి ఉండగా ఆయన దర్శనభాగ్యం కలుగలేదు..ఈరోజు కనీసం ఆ స్వామి నన్ను తన సమాధి దర్శనానికి కూడా అనుమతించలేదు.."అన్నారు కళ్లనీళ్లు పెట్టుకుంటూ..సిద్ధాంతి గారు ఆరోజే విజయవాడ కు వెళ్లిపోయారు..


ఆయన తన జీవితకాలంలో మరెప్పుడూ మొగలిచెర్ల రాలేదు..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: