27, నవంబర్ 2020, శుక్రవారం

ధార్మికగీత - 93*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 93*

                                       *****

             *శ్లో:- నాస్తి మేఘ సమం తోయం ౹*

                    *నాస్తి చాత్మ సమం బలం ౹*

                    *నాస్తి చక్షు సమం తేజ:  ౹*

                    *నాస్తి చాన్న సమం ప్రియమ్ ౹౹*

                                       *****

*భా:- సృష్టిలో భగవంతుడు మానవాళికి ప్రసాదించిన అపూర్వమైన వరాల్లో నాలుగింటి పట్ల సదా మనం కృతజ్ఞులమై ఉండాలి. 1."మేఘము":- మేఘాలు వర్షించి జీవకోటికి త్రాగునీరు, పొలాలకు సాగునీరు ఇస్తున్నాయి.నీరు లేనిదే పనే లేదు. నీరే ప్రాణాధారము.మేఘాలు కురవకుంటే దుర్భిక్షమే. అపార జలసిరిని ఇచ్చే మేఘంతో సమానమైన వేరే జలం లేనేలేదు. 2. "ఆత్మబలం":-  మనిషికి అంగ,ఆర్థిక,కండబలా లెన్ని ఉన్నా, మహత్తర కార్యసాధనకు "ఆత్మబలం" కావాలి. హనుమ సముద్రలంఘనానికి, భగీరథుని గంగావతరణ కార్యసాఫల్యానికి, సతీసావిత్రి పతి ప్రాణసాధనకు వారి "ఆత్మబలమే" ప్రధాన కారణము. ఆత్మబలంతో సమాన బలం వేరే యేది లేదు. 3. "చక్షువు":-  సృష్టి లోని మహనీయ  , కమనీయ, రమణీయ సుందరదృశ్యాలను తనివితీరా చూడగలిగేది మన "కన్ను". అది లేకుంటే అంతా అంధకార బంధురమే. కోటి మేటి విద్యుత్ కాంతులు విరజిమ్మే దీపాలు వెలిగించినా కంటి చూపుకు మించిన తేజస్సు లేదు. 4".అన్నము":- అన్ని జీవాలు అన్నం తినే బ్రతుకు తున్నాయి.ఎన్ని ఉపాహారాలు, చిరుతిండ్లు,పాలు,పండ్లు తిన్నా, అన్నం తినకుంటే తృప్తి ఉండదు.ఈ అన్నానికి కారణం మేఘమే.గూడు, గుడ్డ లేకున్నా బ్రతకవచ్చు. కాని అన్నం లేకుంటే మనలేము. అన్నంతో సాటిరాగల ప్రియమైన  ఆహారం మరొకటి లేదు. కాన వాటి విలువలను గ్రహించి, జలాన్ని, అన్నాన్ని వృథాచేయరాదని, ఆత్మబలం పెంపొందించుకోవాలని,కంటిని జీవితాంతం పదిలంగా చూచుకొంటూ, సుఖజీవనయానం చేయాలని  సారాంశము,*.

                                   *****

                    *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: