27, నవంబర్ 2020, శుక్రవారం

మొగలిచెర్ల అవధూత,

 *పల్లకీ సేవ..ప్రభాత సేవ..*


"మా వియ్యంకుడు వాళ్ళు వచ్చారు..వాళ్ళు ఉండటానికి ఒక రూమ్ కావాలి..వీలవుతుందా?" అంటూ కావలి నుంచి వచ్చిన మధు అడిగాడు..


మేము మధు అని పిలిచే గుంపర్లపాటి మధుసూదన్, ప్రస్తుతం నెల్లూరు జిల్లా విడవలూరు MRO ఆఫీస్ లో పనిచేస్తూ..కావలిలో వకాపురం ఉంటున్నాడు..దాదాపు 22 సంవత్సరాల నుంచీ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కొలిచే పరమభక్తుడు..ఏనాడూ తనకు, వసతి చూపమని అడగలేదు..శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చినప్పుడల్లా..ఏదో ఒక సేవ లో పాల్గొని, పూజ చేయించుకుని వెళ్ళిపోతాడు..ఈసారి కూడ..తనకోసం అడగలేదు..తాను ఎప్పటిలాగే..మందిరంలోనే గడిపాడు..


మధు వాళ్ళ వియ్యంకుడు, శ్రీ నాగేశ్వర రావు గారు..నెల్లూరు జిల్లా ముసునూరు (కావలి టౌన్ కు దగ్గరలోనే వుండే) గ్రామం లో ఉన్న "శ్రీ సాయి క్షేత్రానికి" నిర్వాహకులలో ఒకరు!..శ్రీ సాయిబాబా భక్తులు..నిత్యమూ సాయి నామం జపిస్తూ ఉంటారు..


ప్రతి శనివారమూ మొగలిచెర్ల అవధూత, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పల్లకీ సేవ వారికి చూపించాలని, మధు కోరిక..అందుకోసమే, శ్రీ నాగేశ్వర రావు గారిని వెంటబెట్టుకుని వచ్చాడు!..


ఆరోజు సాయంత్రం, శ్రీ స్వామి వారి పల్లకీ సేవ లో శ్రీ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు..కార్యక్రమం లో లీనమై పోయారు..పూర్తి అయిన తరువాత, అర్చక స్వాములను విడివిడిగా కలిసి, తన అనుభూతిని చెప్పుకున్నారు..అలాగే ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం శ్రీ స్వామి వారి ప్రభాత పూజ, అభిషేకము, విశేష హారతులూ చూసారు..


"ప్రసాద్ గారూ.. పల్లకీ సేవ, ఇంత వైభవంగా జరగడం, నా జీవితం లో ఏ దత్త మందిరం లోనూ చూడలేదు.." అంటూ.."మీరొక్కసారి, మీ అర్చకులతో కలిసి, మా సాయి క్షేత్రానికి రావాలి..మా కమిటీ సభ్యులందరినీ సమావేశ పరచి, ఇదే వైభోగంతో మా మందిరం లో కూడా పూజ చేయడానికి, సలహాలూ సూచనలూ ఇవ్వాలి"..అన్నారు..


వారి మాటల్లోనే, వారెంత అనుభూతి చెందారో స్పష్టమవుతోంది..


ఎంతో మంది భక్తులు..ముఖ్యంగా.. శనివారం సాయంత్రం జరిగే పల్లకీ సేవ, ఆదివారం ప్రభాత పూజ, హారతులు చూసి తన్మయత్వంతో చేసే ప్రశంసలు మాకు కొత్తకాదు కానీ..అవి, మాకు మరింత బరువును మామీద మోపుతాయి..నిరంతరం, మేము అప్రమత్తతో, అంతే భక్తితో కార్యక్రమాలు చేయాలని హెచ్చరిస్తాయి.. మాలో గర్వం పెరగకుండా..మాకు మేమే జాగ్రత్త పడాలని సూచిస్తాయి..


మీరు కూడా..ఒక్కసారి, శని, ఆదివారాల్లో జరిగే ఆ వేడుకను కళ్లారా చూడండి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం...ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: