27, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము



పతు లిరువురు యిలు వీడగ 

వెత లన్నియు వెంటబడగ విధి వక్రించీ 

ప్రతి దినమున బిక్షాటన 

గతిలేకను చేయువలసె కడువ్యధ తోడన్   91


ప్రతి దినమున యా కళావతి 

యతి వినయముతోడ వెళ్లి యా పురమందున్ 

మతిమంతుల గృహమందున 

యతి దీనత నడుగుకొనును యన్నము బిక్షన్   92



పూర్వ రీతిగ నొకనాడు పురము నందు 

తరుణి భిక్షకు తిరుగుచు దాహమయ్యు 

యాగి నొక విప్రు గృహమున యలస టొంది 

గాంచె నచ్చోట జరుగుట ఘన వ్రతంబు        93



గమనించె నట కళావతి 

తమ యింటిలొ  సత్య వ్రతము సల్పెడు విప్రున్ 

కమలాక్షు వ్రతము జూచియు 

శ్రమ దక్కియు నుండె నచట సంతోషమునన్  94



సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

శాస్త్ర యుక్తంబుగా నచట సల్పుచుండ 

క్రతువు జూచి కళావతి కలుగ భక్తి 

తీర్ధమును యా ప్రసాదంబు తీసుకొనియె     95


క్రతువు మొత్తము జూచియు కథను వినియు 

తీర్ధమును ప్రసాదంబును తీసుకొనియు 

కొంత తల్లికి గైకొని సంతసమున 

యింటి కెళ్ళగ జాగయ్యె యీశ్వ రేచ్చ      96


ఆలస్యంబుగ కూతురు 

యేలా యిపుడొచ్చనంచు విస్మయ మందీ 

లీలావతి యిట్లడిగెను 

తాలిమిసహనంబు తోడ తగు మృదు భాషన్   97


"ఇంత రాత్రి వఱకు యెచ్చోట నుంటివి ?

కారణంబు యేమి కలుగ జాగు 

దిగులు కలిగె నాకు తెల్పుము పుత్రికా !

మనసు లోని మాట మాటు లేక "            98


మాత  యడుగ నిటుల మానిని కూతురు *

పరమతోషమునను పలికె నిట్లు 

"తిరిప మెత్తు నేను తిరుగుచూ తిరుగుచు 

వెళ్లి యుంటి నొక్క విప్రు గృహము           99


అచట సత్యవ్రతము యాచరించుచు నుండ 

భక్తి తోడ నేను పరవశించి

చివరి వరకు యుండి తీర్థంబు గొనియును 

వచ్చు చుంటి నేను వడిగ వడిగ "            100


                                 సశేషము...


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: