6, జనవరి 2021, బుధవారం

మొగలిచెర్ల

 *మనసులో మార్పు..*


పది నెలల క్రిందట ఒక శనివారం సాయంత్రం ఐదు గంటల వేళ, ఆ దంపతులు మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఉచిత దర్శన వరుసలో వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దూరం నుంచే చూసి, నమస్కారం చేసుకొని..అదే వరుసలో ఉంచబడిన స్వామివారి dcవెండిపాదుకులకు భక్తిగా నమస్కారం చేసుకొని, పూజారి ఇచ్చిన తీర్ధాన్ని తీసుకొని..ఇవతలకు వచ్చారు.."ఇక్కడ ప్రతి శనివారం నాడు పల్లకీసేవ జరుగుతుంది కదా..మేము అందులో పాల్గొనాలంటే ఎలా..? " అని అక్కడే ఉన్న మా సిబ్బంది లో ఒకరిని అడిగారు..అతను చెప్పిన జవాబు విని, టికెట్ కొనుక్కొని, తమ పేర్లు నమోదు చేయించుకొని..మంటపం లో కూర్చున్నారు..


ఆరోజు సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొన్న తరువాత ఆ దంపతులు నా వద్దకు వచ్చారు.."ప్రసాద్ గారంటే మీరేనా..? " అన్నారు..నేను తలవూపాను..నా ప్రక్కన కుర్చీలో కూర్చున్నారు.."రేపుదయం ఎన్ని గంటలకు ఆలయం తెరుస్తారు..?మేము స్వామివారి సమాధి వద్దకు వెళ్లాలని అనుకుంటున్నాము..మమ్మల్ని అనుమతిస్తారా?..చాలా సమస్యలో ఉన్నాము.." అన్నారు..మందిరం వేళలు చెప్పాను..ఉదయం ఏడు గంటల తరువాత సమాధి దర్శనానికి వెళ్లొచ్చని తెలిపాను..సరే అన్నారు..ఏదో చెప్పాలని సందేహిస్తున్నట్లు అనిపించింది.."ఏమన్నా సందేహం ఉందా.."? అని అడిగాను..

"సందేహం ఏమీ లేదండీ..మా సమస్య చెప్పుకుందామని అనుకుంటున్నాము..మీరు స్వామివారి వద్దే ఎక్కువ కాలం వుంటారు కదా..పైగా స్వామివారితో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం తో వున్నారు..మీకు చెప్పుకుంటే..కొంచెం బాధ తగ్గుతుందని భావించాము.."అన్నారు..

"చెప్పండి.." అన్నాను..


"నా పేరు ఉమాపతి రావు, ఈమె సుబ్బరావమ్మ..మాకు ఇద్దరు సంతానం అండీ..అమ్మాయి, అబ్బాయి..అమ్మాయి పెద్దది..ఇంజినీరింగ్ చదివింది..MBA కూడా చేసింది..అబ్బాయి కూడా ఇంజినీరింగ్ చేసాడు..దేవుడి దయవల్ల వాడికి వెంటనే ఉద్యోగం వచ్చింది..ఇప్పుడు మా సమస్య మా అమ్మాయేనండీ..చిన్నతనం నుంచీ గారాబంగా పెంచాము..మొండితనం ఎక్కువ..తాను అనుకున్నది వెంటనే జరగాలి..లేకపోతే ముందూ వెనుకా చూడకుండా చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు విసిరి కొడుతుంది..ఎంత నచ్చచెప్పినా వినదు.." అంటూ ఒక్కక్షణం ఆగాడు..


"అది ఆరకంగా తయారు కావడానికి ఈయన కూడా కారణమేలెండి..ఆడపిల్ల..మహాలక్ష్మి..అంటూ చిన్నప్పటి నుంచీ నెత్తికెత్తుకున్నారు..అది ఆడిగిందల్లా కొనివ్వడం చేశారు..అది మొండిగా మారింది..అంతా మా ఖర్మ..పెళ్లి కావాల్సిన పిల్ల..ఇలా ఉంటే ఎవరు చేసుకుంటారు?..ఈ స్వామివారి గురించి తెలుసుకొని, ఇక్కడ మొక్కుకుంటే దాని మనసు మారుతుందేమో అనే ఆశతో వచ్చామండీ..అమ్మాయిని కూడా తీసుకొద్దామని శతవిధాల ప్రయత్నం చేసామండీ..రాను గాక రాను..అని తెగేసి చెప్పింది..విధిలేక అమ్మాయిని ఒక్కదాన్నీ ఇంట్లో ఉంచలేక..అబ్బాయిని తోడు ఉంచి వచ్చాము..దాని మనసు మారి..ఒక దారిలో పడితే..అదే మాకు చాలు..ఇప్పుడు దానికి పాతికేళ్ళు..ఇప్పుడన్నా పెళ్లి చేయాలి కదా..మేము ఆ బాధ్యత తీర్చుకోవాలని ఆరాటపడుతున్నాము..ఏ దిక్కూ తోచక..ఇలా వచ్చాము.." అని ఆవిడ వేదనతో చెప్పింది..


"రేపుదయం స్వామివారి సమాధి దర్శించుకొని మీ ఆవేదన తెలుపుకోండి..ఆపై మీ ప్రాప్తం.." అన్నాను.."అంతేలేండి..ప్రారబ్ధాన్ని అనుభవించాలి కదా.." అన్నారు ఇద్దరూ..


ప్రక్కరోజు ఉదయం ఎనిమిది గంటలకు వాళ్ళిద్దరికీ శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లే అవకాశం కలిగింది..ఇద్దరూ లోపలికి వెళ్ళొచ్చారు.."స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొన్నామండీ..మళ్లీ పది గంటల బస్ కు మా ఊరు వెళతామండీ..అన్నీ సక్రమంగా జరిగి..అమ్మాయి మనసు మారి, దాని వివాహం జరిగితే..మళ్లీ వస్తాము.." అన్నారు..సరే అన్నాను..ఆరోజు భక్తులు ఎక్కువగా వున్నారు..ఆ హడావిడి లో ఉండిపోయాను..


మరో గంటన్నర తరువాత..ఆ దంపతులిద్దరూ లోపలికి వస్తున్నారు..వాళ్ళ వెనుకే ఒక అమ్మాయి అబ్బాయి వున్నారు..నేరుగా నా దగ్గరికి వచ్చి.."ప్రసాద్ గారూ..వీళ్ళిద్దరూ మా పిల్లలు..అమ్మాయి..అబ్బాయి..ఈ బస్ కు ఇక్కడికి వచ్చారు..రాత్రి నుంచీ మా అమ్మాయి,  మొగిలిచెర్ల వెళదాము..అమ్మా నాన్న దగ్గరకు పోదాము..అని మా వాడి తో ఒకటే పోరు పెట్టిందట..ఆ బాధ పడలేక తెల్లవారుజామున బయలుదేరి అమ్మాయిని తీసుకొని ఇక్కడకు వచ్చాడు..స్వామివారి సమాధిని తానూ దర్శించుకుంటానని చెప్పింది..ఏమిటోనండీ దీని ప్రవర్తన అర్ధం కావడం లేదు..సరే కనీసం స్వామివారి దగ్గరకు వచ్చింది కదా..ఆమాత్రం చాలు..ఆపై ఆ స్వామే చూసుకుంటాడు.." అన్నాడు ఆయన..


అందరూ మళ్లీ టికెట్లు కొనుక్కొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్ళొచ్చారు..ఆ అమ్మాయిని చూస్తే..ఎంతో సౌమ్యంగా ఉంది..మధ్యాహ్నం భోజనం చేసి..ఆ తరువాత బస్ కు వాళ్ళ ఊరెళ్లిపోయారు..


పోయిన జూన్ మొదటివారం లో.."ప్రసాద్ గారూ నేను ఉమాపతి రావును మాట్లాడుతున్నాను..గుర్తొచ్చానా..కొన్నాళ్ల క్రితం మా అమ్మాయి సమస్యతో మొగిలిచెర్ల స్వామివారి మందిరానికి వచ్చాము.." అని ఫోన్ చేశారు.."చెప్పండి.." అన్నాను.."ఈనెల 21వతేదీ నాడు మా అమ్మాయి వివాహం..స్వామివారి దయతో అంతా సర్దుకున్నది..మా బంధువుల అబ్బాయే వరుడు..పెళ్లి కాగానే..వధూవరులను తీసుకొని స్వామివారి మందిరానికి వస్తాము..ఆయన చల్లగా చూడబట్టే..ఈ కార్యక్రమం జరుగుతున్నది..మీరు కూడా పెళ్లికి వచ్చి ఆశీర్వదించండి..తప్పకుండా రండి.." అన్నారు..


పాతికేళ్ల మొండితనం ఎటు పోయిందో తెలీదు..భర్తతో కలిసి స్వామివారిని అత్యంత భక్తితో సమాధిని దర్శించుకున్నది..ఉమాపతిరావు దంపతుల ఆనందానికి హద్దులు లేవు..

అన్నీ తెలిసిన శ్రీ స్వామివారు సమాధిలో ఉండిపోయారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380).

కామెంట్‌లు లేవు: