14, జూన్ 2023, బుధవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 90*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️



*పార్ట్ - 90*


రాజసభా భవనం క్రిక్కిరిసిపోయి ఉంది. 


రాజపురోహితులు, మంత్రులు, సేనానులు, సామంతరాజులు, పురప్రముఖులు, పాటలీపుత్ర ప్రజలు తదితరులతో సభాభవనం కిటకిటలాడుతోంది. చంద్రగుప్తుని పట్టాభిషేక మహోత్సవాన్ని కన్నుల పండువగా తిలకించడానికి యావన్మందీ ఉత్కంఠతో నిరీక్షిస్తున్నారు. చాణక్యుడు తన ఆసనం మీదనుంచి లేచి సభాసదులకు నమస్కరించాడు. అంతవరకూ అక్కడక్కడా వినిపిస్తున్న కొద్దిపాటి గుసగుసలు కూడా నిలిచిపోయి సభాభవనమంటతటా గంభీర నిశ్శబ్దం ఆవరించింది. 


"నన్ను చాణక్యుడంటారు. తక్షశిలా విశ్వవిద్యాలయమునకు అర్థశాస్త్ర అధ్యాపకుడను..." చాణక్యుడు తనని తాను సభకి పరిచయం చేసుకుంటూ "నేడు సుదినం. మగధ మహాసామ్రాజ్య పౌరులూ చిరకాలంగా ఎదురుచూస్తున్న శుభదినం. మీ అభిమాన పాత్రులు, మగధ సార్వభౌములైన స్వర్గీయ మహానందుల వారు కలలు గన్న పర్వదినం..." అని చెప్పగానే యావన్మందీ ఒక్కపెట్టున "జోహార్... మహానంద సార్వభౌమా... జోహార్... జోహార్...." అంటూ శ్రద్ధాంజలులు ఘటించారు. 


చాణక్యుడు చెయ్యెత్తి వాళ్ళని వారిస్తూ "మాగధుల రాజభక్తి లోకోత్తరమని యావత్ ప్రపంచానికి తెలుసు. మీ అసాధారణ ప్రేమానురాగాలు, రాజభక్తి, విశ్వసనీయతలు, ధర్మనిరతులే మరల ఈ నాడు నందవంశజుడైన చంద్రగుప్తునికి ఈ మగధ సింహాసనాధీశుని చేస్తున్నాయి. ఇది మీరు కన్న కల. ఇది మీరు ఆశించిన విజయం. ఇది మీ అందరి అభిమాన వాత్సల్యానికీ, విజ్ఞతకీ నిదర్శనం" అని ఆగాడు. 


ఒక్కసారిగా కరతాళధ్వనులు ప్రతిధ్వనించాయి. ఆ చప్పట్లుహోరు సద్దుమణిగే దాకా ఆగి, గంభీర కంఠస్వరంతో తన ప్రసంగాన్ని కొనసాగించాడు చాణుక్యుడు. 


"నేటి విజయం... యీనాటి మీ ఆనందోత్సాహం శులభసాధ్యం కాలేదు... ఈ విజయం వెనక హృదయవిదారకమైన విషాదం వుంది. ఈ ఆనందం వెనక అసాధారణమైన ప్రయత్నం ఉంది. అదంతా ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరవైనాలుగేళ్ళు వెనక్కి వెళితే... మీకు అత్యంత ప్రేమాస్పదుడు, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన మీ మహారాజు మహానందుడు అంతు తెలియని దీర్ఘరోగంతో పరిపాలనకు దూరమయ్యారని మీకు తెలియజేయబడింది. కానీ, అసలు జరిగిందేమిటి...? 


మహారాజు నమ్మకంతో చేరదీసిన క్షురకుడు, రాణి సునందాదేవితో చేతులు కలిపి కుట్ర పన్నాడు. మహారాజుకి దీర్ఘరోగం వచ్చిందని పుకార్లు పుట్టించి ఆయన్ని, పట్టమహర్షి మురాదేవితో పాటు ఏకాంత దుర్గంలో నిర్బంధించాడు. పాలకులు లేని రాజ్యం పరరాజు పాలవుతుందంటూ మంత్రులనూ, సేనానులను భయపెట్టి లొంగదీసుకుని తాను మహాపద్మానందుడిగా పేరుమార్చుకుని సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రజల మద్దతు పొందడానికి మహానందుల వారి ద్వితీయ కళత్రం రాణి సునందాదేవిని వివాహమాడాడు. ఎనిమిది నందకుమారులను కన్నాడు. కానీ ... ఆ అక్రమ సంబంధం వల్ల పుట్టిన వాళ్లు నిజమైన నంద వంశజులవుతారా ? సింహాసనానికి అసలైన వారసులవుతారా....?" 


"కారు... కారు..." ప్రజలు పెద్ద పెట్టున ప్రతిస్పందించారు చాణక్యుని ప్రశ్నలకి... ఆర్యుడు మరలా ప్రారంభించాడు. 


"మగధని ఇష్టం వచ్చిన రీతిని ఏలుకున్నారు. ఈ విషయం నిర్బంధంలో ఉన్న మీ మహారాజుకి అనేక సంవత్సరాల తర్వాత తెలిసింది. ఆ గృహనిర్బంధంలో సంవత్సరాల తరబడి తన పట్టమహిషి మురాదేవి తప్ప మరో మానవమాత్రుని ముఖం కూడా ఎరుగక పరితపించిపోయిన మహారాజు  - తనకి క్షురకుడితో కలిసి సునంద చేసిన ద్రోహాన్ని తలుచుకొని కుమిలిపోయాడు. పగతో రగిలిపోయాడు. కానీ ఆ చెరనుంచి బయటపడే మార్గంలేదు. 'ఒకవేళ బయటపడినా, అధికారం చేతుల్లో లేదు. ఎలా ? తానా వార్ధ్యక్యదశలో ఉన్నాడు. తన పగతీరేమార్గం ఏమిటి ? అక్రమనందులతో కలుషితమైన మగధ సింహాసనాన్ని సక్రమ వారసుడిని ఎక్కడి నుంచి తేవాలి... ?' 


మహారాజు రోజుల తరబడి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన పట్టమహిషి, ఆదర్శ ధర్మపత్ని, మహాపతివ్రత అయిన మురాదేవితో సంప్రదించి... ఆ వయస్సులో... తన వంశాన్ని నిలబెట్టడానికి .... తన పగ తీర్చడానికి... తన వారసత్వ సింహాసనాన్ని అధిష్టించగల వారసునికి జన్మనిచ్చాడు... అతనికి చంద్రగుప్తుడని తానే పేరు పెట్టాడు... తన కుమారుని చేత నందులపై పగ తీర్పించమని, అదే తనకి ఆత్మశాంతి కలిగిస్తుందని చెప్పి మహారాణి మురాదేవి చేత ప్రమాణం చేయించుకున్నాడు మహానందుడు. అయితే... నందవంశాకురం జన్మించాడని తెలుసుకున్న సుంకర నందులు మీ మహారాజునీ, మహారాణినీ, వారి కుమారుడినీ హతమార్చడానికి ఆ ఏకాంత దుర్గాన్ని అగ్నికి ఆహుతి చేశారు. అగ్నిప్రమాదాన్ని సృష్టించి... ఆ ప్రమాదంలో ... ఆ ప్రమాదంలో......." 


ఆ గాధని వింటున్న యావన్మందీ ఒక్కసారిగా బాధతో హాహాకారాలు చేశారు. వాళ్లకి కొద్ది క్షణాలు వ్యవధి యిచ్చి తన హావభావ ప్రకటనా చాతుర్యంతో ఆ కథనాన్ని కొనసాగించాడు చాణక్యుడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*


🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: