14, జూన్ 2023, బుధవారం

దత్తాత్రేయుడి అవతారం

 "దత్తాత్రేయుడి అవతారం ఏ యుగంలోనిది? ఆయన తత్వం సామాన్యులకు అర్థం కాదంటారు. ఎందుకు?

శ్రీ దత్తాత్రేయులవారు అత్యంత ప్రాచీన భగవదవతారమన్నది ఒక్కటియే మనకు తెలియును. ఎప్పటి అవతారమో ఖచ్చితముగా చెప్పలేము. ఒక్కొక్క సంప్రదాయము ఆయనను ఒక్కొక్క విధముగా వర్ణించును. కొన్ని చోటులలో ఆయనను బ్రహ్మవిష్ణు మహేశ్వరుల సమ్మిళిత రూపముగా చెప్పిరి. వ్యక్తిగతముగా నా యెంచిక కూడ అదియే.

మఱికొన్నిచోటులందు ఆ విధముగా కాక ఒక ఋషిగా వర్ణించిరి. అందుచేత ఆయన స్వయంకృషి చేత భగవత్ స్థితిని అందుకొన్న గొప్ప సాధకుఁడని కొందఱు తలఁచిరి. పరమార్థమున ఏదైనను ఒకటియే. ఎందుకనఁగా ప్రతి సద్గురువు భగవంతుఁడే. తదన్యుఁడు కాఁడు. అయితే శ్రీ దత్తులు లోకోద్ధరణార్థము అవతారములెత్తుచుండుటయు, మిగితా ఋషులు ఎత్తకుండుటను బట్టి ఆయన ఋషుల కన్నను మిక్కిలి ఉన్నత స్థాయివాఁడని తెలియుచున్నది. ఆయనకు చావు లేదు. విసుగు, విరామము లేక భూమండలమంతట తిరుగుచునే ఉండును.

ఆయన స్థాయి వేఱు. మన స్థాయి వేఱు. కనుక శ్రీ దత్తుల తత్త్వము మనకు గహనమగుటలో ఆశ్చర్యము లేదు. శ్రీ దత్తుల అనుగ్రహము కలిగినప్పటి నుండి అనేక మంది దేవతలు తమంతట తామే సాక్షాత్కరింప సాఁగెదరు. ఆయన అనుగ్రహము తగ్గినచో ఎవఱును పలుకరు. కనుక ఆయన దేవతల మీఁద సైతము అధికారి అని తెలియుచున్నది. ఆయన దయామయుఁడే. కాని అదే సమయములో భక్తుల మంచి నడవడిక విషయములో రాజీ లేనివాఁడు. భక్తులు ఆర్తితో వేఁడినచో వారి నొసట బ్రహ్మ వ్రాసిన వ్రాతను కూడ తుడిపివేసి తన స్వంత వ్రాత వ్రాసి ఉద్ధరింపఁగల సమర్థుఁడు. ఎంతటి మహాపాపముల నైనను రద్దుచేయఁగల శక్తిమంతుఁడు. ఆయన నిర్ణయములకు యముఁడు, బ్రహ్మ కూడ తలయొగ్గి తీరవలెనన్నచో - ఆయన స్థితి ఏమిటి? ఆయన ఎవఱు? అన్నది చదువరుల నిర్ణయమునకే వదలిపెట్టుచున్నాను.

కామెంట్‌లు లేవు: