14, జూన్ 2023, బుధవారం

వసుచరిత్రలో సవతుల కయ్యం



వసుచరిత్రలో సవతుల కయ్యం!


శా: ఆమందాకిని మౌళిఁ బూని నను నర్ధాంగీకృతం జేసి 'తౌ

నౌ మేల్మే' లని యార్య యల్గఁ ,బ్రణతుండై ,తత్పదాంభోజ యో

గా మర్షంబున గంగయు న్మొరయఁ జూడాభోగ సమ్యక్క్రియా

సామర్ధ్యంబున వేఁడు శంభుఁడు కృతిస్వామిం గృపన్ బ్రోవుతన్.


వసుచరిత్రము- అవతారిక- రామరాజ భూషణకవి !


ఇది రామరాజ భూషణ కవి రచించిన వసుచరిత్రలోని పద్యం. కృతిపతికి పరమశివుని ఆశీర్వాద మందజేసేపద్యం.

బలే చమత్కారాన్ని రంగరించాడుకవి. ఇద్దరు పెళ్ళాలమొగుఁడు యిరుకున బడక తప్పదేమో? వెనక పారిజాతాపహరణంలో ఆదెబ్బ యెలా ఉంటుందో ముక్కుతిమ్మన గారు మనకు రుచి చూపించారు. సత్య కాలితాపుకి కృష్ణుని తలబొప్పి గట్టింది. దాసుని తప్పు దండంతోసరియని యామె కాళ్ళకు మొక్కి యెలాగో బయట పడ్డాడు.


ఇపుడా సౌభాగ్యం శాంపిల్గా శంకరునకు చవిచూపుతున్నారు మనకవిగారు యీపద్యంలో. వినండి!


" పార్వతి పరమేశ్వరునిపై కోపించిందట. అవును కోపంరాదామరి. తానుండగానే గంగమ్మను తెచ్చి నెత్తిన బెట్టుకుని

ఊరేగుతున్నాడాయె! అందుకే పరమేశ్వరుణ్ణి నిలదీసి గట్టిగా అడిగేసింది. కాదుకాదు మాటలతో కడిగేసింది ' ఆగంగను నెత్తిని బెట్టుకొని ఊరేగుతూ దానిని కప్పిబుచ్చుట కోసమేగదా నన్ను అర్ధనారిగా (సగము ఆడది ) జేసినావు. ఆహా !నీయుక్తి తెలిసినదిలే!

ఎంత మోసకారివి. నిన్ను నమ్మి మోసపోతినిగదా " యని తన యాగ్రహమును ప్రకటింప, వేరుదారిలేక శంకరుడు క్రిందకు తలవంచి యామె పాదములను తాకినాడట! శ్రీకృష్ణుని వలెనే దాసునితప్పు దండముతో సరిపెట్టజూచెనన్నమాట. ఏమైన నేమి శంకరుడు తలవంచ శిరసున నున్న గంగా జలములు ఆమెపాదములను ప్రక్షాళణమొనరించినవి. అనగా గంగకూడ సవతిని పూజించినట్లయినది.మెడలోనున్నపాములుబుసబుసలతోక్షమింపబ్రతిమాలినవి.యిలాచాలాతెలివిగా,  శంకరుడు పాదాభివందనము చేయుటతో,ఇటు సవతి పరిచర్యల నొనరించుటతో నామెకోపము పటాపంచెలయినదట. శంకరుడు సవతికయ్యపు గండమునుండి క్షేమముగా బయటపడినాడట. అట్టి శంకరుడు కృతిభర్తను బ్రోచుగాత! యని యాశీస్సు.


కవి పార్వతిని అర్ధనారీశ్వరిగా నొనర్చుటకు ఒక కారణమును జెప్పినాడు. అట్లు చేయుట వలన నామె సగము

ఆడదియై సంతానమును పొందుటకు అనర్హ యైనదట! సంతానమే స్త్రీజన్మకు సాఫల్యము.గదా! గొడ్రాలును ఉపేక్షించి సంతానము కొరకై మగవాడు మరల పెండ్లియాడుట లోకరీతి. భార్య యుండగా పునర్వివాహ మేల ?యని యడుగు వారికి సమాధానము చెప్పుట సులభమగునుగదా, అదిగో ఆలోకరీతిని అడ్డు జేసికొనుటకై నన్ను అర్ధనారిని జేసి దీనిని నెత్తి కెక్కించు కొన్నావని పార్వతి వాదన! ఆహా! కవికెంత గొప్పయూహ!


అందుకే కిమ్మనకుండా శంకరుడు పార్వతికి మొక్కినాడు.గంగమ్మచేత కాళ్ళుకడిగించినాడు. ఇది చాలా తెలివైన పనిగదా , సరి . ఆమె కోపము పోయినది . శంకరుడు ప్రసన్నత నొందినాడు.


ప్రబంధకవులలో సవతి కయ్యములను ప్రస్తావించిన కవులిద్దరు.తిమ్మన సుదీర్ఘముగా వర్ణించి దానికొరకొక కావ్యమునే(పారిజాతాపహరణము)

వ్రాయగా, రామరాజ భూషణుడు ఒకే ఒక పద్యంతో సరిపెట్టినాడు మిక్కిలి చమత్కారంగా!

                            .స్వస్తి!

🌷

 నాచన సోమనాథుని

కవితాశిల్పం!


 ‘ఉత్తర హరివంశం’లోని ఈ పద్యశిల్పంఅనల్పం. దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకపోయినవారు ప్రబంధక కవులు!


మొల్ల తెనాలి రామకృష్ణులు ఈ చమత్కారాన్ని అందిపుచ్చుకున్నారు


తెనాలి రామకృష్ణకవి పేరడి


ఆతుకూరిమొల్ల శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన తెలుగు కవయిత్రి. ఆమె కృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించినప్పుడు రాయలవారిని ఈ క్రిందిపద్యం తో ప్రస్తుతించింది. 


"అతడు గోపాలకుం డితడు భూపాలకుం, డెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు పాండవ పక్షు డితడు పండితరక్షు, డెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు యాదవపోషి ఇతడు యాచకతోషి, డెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు కంసధ్వంసి ఇతడు కష్టధ్వంసి, డెలమినాతని కన్న నితడు ఘనుడు,


పల్లెకాతండు పుట్టణ ప్రభువీతండు

స్త్రీల కాతండు పద్మినీ స్త్రీల కితడు

సురలకాతండు తలప భూసురులకితడు

కృష్ణుడతండు శ్రీమహాకృష్ణుడితడు"

                        మొల్ల;


శ్రీకృష్ణునకు - కృష్ణరాయలకు మధ్య ఉండే తేడాలను చూపిస్తు శ్రీకృష్ణునికన్నా కృష్ణదేవరాయలే మిన్న అని నిరూపిస్తున్న చాటుపద్యం ఇది.


మొల్ల పద్యాన్ని విన్న వికటకవి తెనాలిరామకృష్ణుడు తనసహజధోరణిలో దానిని అనుకరిస్తూ ఈ క్రిందిపద్యం చెప్పాడని అంటారు.


 బహుశః ఇదే మొట్టమొదటి పేరడి పద్యమేమో. 


ఈశ్వరునితో ఎద్దుని పోలుస్తూ చెప్పిన ఈ పద్యం చూడండి.


అతడంబకు మగం డితడమ్మకు మగండె, లమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు శూలము ద్రిప్పు నితడు వాలము ద్రిప్పు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడమ్మున నేయు నితడు కొమ్మున డాయు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతని కంటను చిచ్చు నితని కంటను బొచ్చు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,


దాతయాతండు గోనెల మోత యితడు

దక్షుడాతండు ప్రజల సంరక్షుడితడు

దేవుడాతండు కుడితికి దేవుడితడు

పశుపతి యతండు శ్రీమహ పశువితండు


బాగుంది కదా!మొల్లపద్యాన్ని హేళనచేద్దామనుకున్నాడు.కానీ,

మొల్లపరిమళం దీనికి వచ్చిందా?


అభ్రంకషంబైన యాలపోతునీతండు

    త్రుంచినాడీతండు పెంచినాడు


సాధు సమ్మతముగా సామజంబునితండు

    గాచినాడీతండు త్రోచినాడు


బహిర్ముఖార్థమై పర్వతేశునీతండు 

    దాల్చినాడీతండు వ్రాల్చినాడు


ఫణపరంపరతోడి పన్నగంబు నీతండు

    మెట్టినాడీతండు సుట్టినాడు


నేడు నాడును నాడును నేడు మనకు

జూప జెప్పంగ జెప్పంగ జూప గలిగె

ననుచు కొనియాడు సంయమి జనులకొదవె

రజితగిరిమీద హరిహరారాధనంబు


     

 వర్ణించింది హరిహరనాథుణ్ని కదా! అతనెలా ఉన్నాడనుకున్నారు?


 ఒకవైపు భాగమేమో బాగా ఏపుగా ఉన్న- అభ్రంకషం అంటే చాలా ఎత్తయిన- ఆలపోతును చంపిందట, ఇంకో వైపున్న రూపమేమో ఆలపోతును పెంచుకుందట. కృష్ణావతారంలో అరిష్టాసురుడనే- ఎద్దు రూపంలో వచ్చిన రాక్షసుణ్ని సంహరించింది- హరి, ఇక ఎద్దును పెంచుకునేవాడు అంటే- నంది వాహనుడైన హరుడే. అదే రూపంలో ఒకవైపు భాగమేమో సామజాన్ని, అంటే ఏనుగును కాచిందట- రక్షించాడట! ఇది గజేంద్రమోక్ష ఘట్టం. అంటే శ్రీహరి రూపం. మరోవైపు ఏనుగును తోసేశాడట- గజాసురుణ్ని చంపటం. ఈ తలనే వినాయకుడికి అతికించారు. ఇది శివరూపం. ఆ మూర్తిలో ఒకభాగం పర్వతేశుణ్ని దాల్చిన రూపమట! ఇది గోవర్ధనోద్ధరణం చేసిన కృష్ణుడిది. ఇంకోవైపు పర్వతాన్ని- అది మేరుపర్వతం, చేతిలోకి విల్లుగా చేసుకున్న శివుడిది. పడగల వరుసతో ఉన్న పన్నగాన్ని ఒకాయనేమో మెట్టాడట- ఆయన శేషతల్పం మీద పవళించిన హరి, ఇంకొకాయనేమో భుజంగాన్ని చుట్టుకున్నాడట- ఆయన కైలాసాధీశుడైన హరుడు! ఇద్దరూ కలిసిందే హరిహర రూపం. ఈవిధంగా రజతగిరి మీద హరిహరారాధనం చేసే భాగ్యం మనకు దక్కించాడు సోమన. 

      రెండు మూర్తులు కలిసిన రూపాన్ని, రెండు అవతారాలకు సమానంగా ఉండే అంశాలతో పోలికపెట్టాడు నాచన సోమన. అంతేనా సంస్కృత మణులు, తెలుగు పగడాలను ఒడుపుగా ప్రయోగించి మణిప్రవాళంలో రచించాడు. శివకేశవులకు ఇలా అభేదం చెప్పడంలో సోమన చూపిన ప్రతిభ అసామాన్యం కదూ!!రసజ్ఞభారతి.సౌజన్యంతో-


 నచికేతుడు,తెలిసికొన్నఆత్మ రహస్యం!


  (ఇది గహనమైన వేదాంతం ఇష్టమైనవారు చదవండి)


  నచికేతుడు చిన్నవాడు. తెలివైనవాడు. అతని తండ్రి గౌతముడు. 


      గౌతముడు “విశ్వజిత్‌” అన్న యజ్ఞం చెయ్యాలనుకున్నారు. యజ్ఞం చెయ్యడానికి సమస్తం దానం చెయ్యాలి. అట్లా దానం చేసే క్రమంలో ఎంతో బలహీనమయిన, నిరుపయోగమయిన ముసలి గోవుల్ని దానం చేశాడు.


          స్వర్గ సుఖాల్ని ఆశిస్తూ పనికిరాని ముసలి పశువుల్ని దానమిచ్చే తండ్రిని చూసి నచికేతుడికి నవ్వు వచ్చింది. పైగా అది అనుచితమయిన చర్య అనిపించింది. 


     తన తండ్రిని సమీపించి “నాన్నగారూ! మీరు ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి మీ సమస్తాన్నీ దానం చెయ్యాలి కదా! మీ సంపదలో నేనూ భాగాన్నే కదా! నన్నెందుకు దానం చెయ్యరు?” అన్నాడు.


          గౌతముడు యజ్ఞ కార్యాల్లో మునిగి ఆ మాటలు పట్టించుకోలేదు. కాని నిచికేతుడు పట్టిన పట్టు వదలని వాడు. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. కొడుకు ప్రశ్న తండ్రి చెవిన పడినా ఏమీ చెప్పకూడదనే గౌతముడు మౌనంగా ఉన్నాడు.

కానీ నచికేతుడు పట్టువదల్లేదు.


          “నాన్నగారూ! నేను మీకు సంబంధించిన సంపదలో భాగాన్నే కదా! మరి నన్ను ఎవరికి దానం చేస్తారు?’ అని అడిగాడు.


          చిరాకు పడిన గౌతముడు “నిన్ను మృత్యుదేవతకు దానంగా ఇస్తాను” అన్నాడు. అన్నాడే కాని మళ్ళీ ఎందుకామాట అన్నానా? అని గౌతముడు బాధపడ్డాడు.


          నచికేతుడు “మా నాన్న ఎందుకిలా అన్నాడు? మృత్యుదేవతకు నాతో ఏం లాభం? అని విచికిత్సకులోనయ్యాడు. కానీ నాన్న గారి మాట నెరవేర్చాలి” అని తీర్మానించుకుని మృత్యు దేవత దగ్గరకు బయల్దేరాడు. మృత్యు దేవత అంటే యముడే కదా! కాబట్టి యమపురికి బయల్దేరాడు.


           నచికేతుడు వెళ్ళే సరికి యమపురిలో యముడు లేడు. బ్రహ్మను సందర్శించి రావడానికి వెళ్ళాడు. మూడు రోజులకు కానీ తిరిగి రాలేదు. నచికేతుడు మూడు రోజుల పాటు ఎదురు చూశాడు. మూడు రోజులు గడిచాక యముడు వచ్చాడు.


     యముడు దేదీప్యమానంగా వెలుగుతున్న నచికేతుణ్ణి చూశాడు. మూడు రోజుల నుంచీ నిరాహారుడివై వున్నందుకు మన్నించు. నీకు ఆతిథ్యం యివ్వ లేకపోయినందుకు అన్యథా భావించకు “దానికి పరిహారంగా, నీకు మూడు వరాలిస్తున్నాను, కోరుకో” అన్నాడు.


          నచికేతుడు “యమధర్మరాజా! నువ్వు చెప్పినట్లే మూడు వరాలు కోరుకుంటాను. వీటిల్లో మొదటిది నా తండ్రికి సంబంధించింది. ఆయన నేను వెళ్ళేసరికి ఆగ్రహంతో వుండకుండా, సౌమ్యంగా, ప్రేమగా నన్ను స్వీకరించేలా చేయి” అన్నాడు.


          యముడు “నచికేతా! తప్పకుండా మీ నాన్న నిన్ను కోపం లేకుండా ప్రేమతో దగ్గరికి తీసుకునేలా వరమిస్తున్నా” అన్నాడు.


          నచికేతుడు “ధన్యవాదాలు. ఇక రెండో కోరిక స్వర్గంలో మృత్యు భయముండదు, వృద్ధాప్యముండదు, భయముండదు, దుఃఖముండదు, ఆకలి దప్పలుండవు. అట్లాంటి స్వర్గాన్ని అందుకునే మార్గం “అగ్ని చయనం” అన్న యజ్ఞం ద్వారా సాధ్యమని అంటారు. నాకు ఆ “అగ్నిచయన” క్రతువు గురించి వివరించు” అన్నాడు. యముడు “తప్పక వివరిస్తాను” అని స్వర్గ ప్రాప్తినిపొందే అగ్నిచయన క్రతువు గురించి వివరించాడు.


          నచికేతుడు “నా పై దయతో రెండు వరాలని ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. మీకు రుణపడి ఉన్నాను. ఎప్పటి నించో నన్ను వేధిస్తున్న సమస్య వుంది. దానికి పరిష్కారం మీ దగ్గర దొరుకుతుందని నమ్మకంతో వున్నాను” అన్నాడు.


          యముడు “తప్పక  నాకు వీలయితే చెబుతాను” అన్నాడు.


          నచికేతుడు “యమధర్మరాజా! మనిషి చనిపోయిన తరువాత ఏమవుతాడు? శరీరానికి వేరుగా ఆత్మ వున్నదని, శరీరం నశించిపోయినా ఆత్మవుంటుందని కొందరంటారు. కొందరు ఆత్మ లేదంటారు? ఈ విషయానికి సంబంధించిన నిజానిజాల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇదే మిమ్మల్ని కోరే మూడోవరం” అన్నాడు.


          అతని ప్రశ్నతో యముడు నిరుత్తరుడయ్యాడు. “నచికేతా! ఆత్మ చర్చ అతి గహనమయింది. సూక్ష్మమయింది. ఈ విషయంలో దేవతలు కూడా సందిగ్ధంలో పడ్డారు. నీకు ఇతర భౌతికానందాలు, స్వర్గ సుఖాలు ఎన్ని కావాలన్నాయిస్తాను. ఇది తప్ప ఇంకేదయినా వరం కోరుకో” అన్నాడు.


          ఎంత చెప్పినా నచికేతుడు పట్టు వదల్లేదు. చివరికి అతని పట్టుదలకు సంతోషించి యముడు “నచికేతా! మనిషికి రెండు మార్గాలున్నాయి. ఒకటి శ్రేయోమార్గం రెండోది ప్రేమోమార్గం. మొదటిది నివృత్తి మార్గం, రెండోది ప్రవృత్తి మార్గం. మనిషికి నిగ్రహం లేకపోతే జనన మరణ చక్రంలో చిక్కుకుంటాడు. నిర్మలమయిన నిగ్రహముంటే జనన మరణ చక్రమనే పునరావృతమయ్యే మార్గం వదిలి అమృతత్వాన్ని అందుకుంటాడు. అట్లా ఆత్మని అన్వేషించే, ఆ అనుభవాన్ని అందుకునే అంతర్ముఖులు ఎక్కడో అరుదుగా వుంటారు.


          సృష్టి మొదలయినప్పటి నుండి ఆత్మ మనసుతో, ఇంద్రియాలతో బాహ్యమయిన వస్తువులతో, బాహ్య ప్రపంచంతో పరిచయం కలిగించుకుంటుంది. అంతర్ముఖుడయిన వాడు మేలుకుని వున్నపుడు, నిద్రిస్తున్నపుడు కూడా అన్నిటి పట్ల సాక్షీ భూతుడుగా వుంటాడు. తనని తాను తెలుసుకుంటాడు.


          ఆత్మే అన్నిటికీ ఆధారమని గ్రహిస్తాడు. అది తెలుసుకుంటే అన్ని దుఃఖాల నుండి విముక్తుడవుతాడు. అనంత ఆనంద కేంద్రంలో వుంటాడు.


          ఆత్మ అనంత వ్యాప్తం. ఆత్మని మాటల్లో వర్ణించలేం. చేతుల్తో తాకలేం. కళ్ళతో చూడలేం. నాలికతో రుచి చూడలేం. వాసన చూడలేం. తర్కానికి ఆత్మ అందదు. అది ఆది మద్యాంత రహితం, రూపరహితం. అది అణువు కన్నా చిన్నది, విశ్వం కన్నా విశాలమైంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే మనిషి మృత్యువుని జయిస్తాడు.


       నచికేతా! జీవులు నిద్రపోయేటప్పుడు కూడా తాను మేలుకొని ఉండి, అనేక విషయాలను నిర్మిస్తూ, నిత్యమై, శుద్ధమై ఉండేదే పరబ్రహ్మం. అన్ని లోకాలూ అందులోనే ఉన్నాయి. దానిని దాటి ఎవరూ పోలేరు. ఆత్మ అంటే ఇదే. ఒకే అగ్ని వేర్వేరు కట్టెలలో వెలుగుతున్నట్టు ఆత్మ జీవులందరిలో వేర్వేరు రూపాల్లో కనిపిస్తుంది. వాటికి భిన్నంగా కూడా ఉంటుంది. ఒకే వాయువు జీవులలో ప్రవేశించి వివిధ రూపాల్లో కనబడుతున్నట్టు అందరిలో ఉన్న పరమాత్మ భిన్నరూపాల్లో దర్శనం ఇస్తున్నాడు.


     లోకానికి అంతటికీ నేత్రంగా ఉన్న సూర్యుడు ఆ చర్మచక్షువుల రాగద్వేషాలకు అతీతంగా ఉన్నట్టు అందరిలో ఉన్న ఆత్మ స్వచ్ఛమై నిర్మలమై ఉంటుంది. 


   పరమాత్మ సకల జీవుల అంతరాత్మగా ఉంటూ భిన్నరూపాల్లో కనిపిస్తున్నాడు. ఆ పరమాత్మ తనలోనే ఉన్నాడని తెలుసుకున్న జ్ఞానులకు శాశ్వతానందం కలుగుతుంది. దీనిని అజ్ఞానులు పొందలేరు. అనిత్యమైన వాటిల్లో నిత్యంగా, చేతనాల్లోని చైతన్యంగా ఉండే పరమాత్మను తమ ఆత్మలో దర్శించగలిగిన ధీరులు మాత్రమే శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు.


     గురువర్యా! యమధర్మరాజా! నువ్వు చెప్పినట్టు రుషులు పొందే అనిర్వచనీయమైన ఆ పరమానందాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? అది స్వయంప్రకాశమా? మరొక వెలుగులో కనిపిస్తుందా?


  నచికేతా! అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, మెరుపులు ఎవరూ ప్రకాశించరు. పరమాత్మ వెలుగులోనే ఇవన్నీ ప్రకాశిస్తాయి. 


    సనాతనమైన ఈ రావిచెట్టు వేళ్లు పైకి, కొమ్మలు కిందికీ వ్యాపించి ఉంటాయి. ఇదే పవిత్రమూ, శాశ్వతమూ అయిన పరబ్రహ్మం. ఎవరైనా ఏదైనా దీంట్లోనే ఉన్నాయి. ఇదే ఆత్మ, పరమాత్మ నుంచే సకల ప్రపంచం ప్రాణాన్ని పొంది మళ్లీ దానిలోకే లీనమౌతోంది. 


     పెకైత్తిన వజ్రాయుధంలా ఆత్మ మిరుమిట్లు గొలుపుతూ భయపెడుతూ ఉంటుంది. ఇది తెలుసుకున్నవారు జనన మరణాలకు అతీతంగా అమృతత్వాన్ని పొందుతారు. 


         నాయనా! భయంతోనే అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, వాయువు, మృత్యువు అందరూ తమ బాధ్యతలను నిర్వహించడానికి పరుగెత్తుతున్నారు.


         ఆ పరబ్రహ్మాన్ని శరీరం నశించకముందే దర్శించగలిగిన మానవుడు బంధాలనుంచి విముక్తుడు అవుతాడు. లేకపోతే జన్మలు తప్పవు.


       లోపల ఉన్న పరమాత్మ  పితృలోకంలో స్వప్నంలా, గంధర్వలోకంలో నీటిలో ప్రతిబింబంగా, బ్రహ్మలోకంలో వెలుగునీడలుగా కనిపిస్తుంది. ఇంద్రియాల విభిన్నతనూ, వృద్ధిక్షయాలనూ తెలుసుకొన్న ధీరుడు దేనికీ దుఃఖించడు.


        ఇంద్రియాలకన్నా మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి ఉత్తమం. బుద్ధికంటే విశ్వాత్మ, దానికంటే అవ్యక్త ప్రకృతి శ్రేష్ఠం. అవ్యక్త ప్రకృతి కంటే సర్వవ్యాపకుడూ, స్త్రీ పురుషాదిలింగరహితుడూ అయిన పరమపురుషుణ్ణి తెలుసుకోగలిగిన ప్రాణికి అమృతత్వం లభిస్తుంది. 


      ఆ పరమ పురుషునికి ఏ కోపమూ లేదు. కంటికి కనపడడు. హృదయంలో ఉండి మనస్సును శాసించే బుద్ధికి మాత్రమే కనపడతాడు. చూడగలిగిన వారికి జననమరణాలు ఉండవు.


        నచికేతా! మనస్సుతో సహా అయిదు జ్ఞానేంద్రియాలు (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం)ఆత్మల్లో స్థిరమైనప్పుడు, బుద్ధి నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ‘పరమపదం’ అంటారు.


    ఇంద్రియాలను స్థిరంగా నిగ్రహించుకోవడమే ‘యోగం’. యోగి మనోవికారాలను అప్రమత్తతతో గెలుస్తాడు. యోగంలోనుంచి ఏ క్షణంలోనైనా పతనం కావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. 


      ఆత్మను మాటలతో, కళ్లతో, మనస్సుతో చూడలేరు. అది ఉన్నదని తెలుసుకున్న వారి ద్వారానే తెలుసుకోగలరు. ‘అస్తి’ ‘నాస్తి’ అనే రెండు పదాల్లోనూ ‘అస్తి’ఉంది. అది తెలుసుకున్నవారికి తత్త్వ దర్శనం అవుతుంది.


       మానవుడు ఎప్పుడు కోరికలను నశింపజేసుకుంటాడో అప్పుడు మరణం ఉండి కూడా లేనివాడు అవుతాడు. శరీరం ఉండగానే బ్రహ్మత్వాన్ని పొందుతాడు.

మానవుడు జీవించి ఉండగానే బంధాలను ఛేదించుకుంటే మరణం లేనివాడు అవుతాడని వేదాంతం బోధిస్తోంది. 


      మానవ హృదయంలో నూటొక్క గదులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తలలోకి ప్రయాణిస్తుంది. దానిద్వారా మనిషి అమృతత్వాన్ని పొందుతాడు. మిగిలిన నాడులు శరీరంలో అన్ని వైపులకి ప్రయణిస్తూ  అంతరించిపోతాయి. 


         బొటనవేలు పరిమాణంలో అన్ని ప్రాణుల్లోనూ ఉండే ఆత్మ గురించి మానవుడు మాత్రమే తెలుసుకోగలడు. అందుకే జంతువులలో నరజన్మ శ్రేష్ఠం. 


    ధీరుడైనవాడు వివేకంతో అంతరాత్మను దర్శించగలగాలి. అంతరాత్మయే స్వచ్ఛమూ, శాశ్వతమూ అని తెలుసుకున్న వాడు పవిత్రుడూ, శాశ్వతుడూ అవుతాడు. ఇదే బ్రహ్మవిద్య. బ్రహ్మజ్ఞానం.


       ఈవిధంగా యమధర్మరాజు చెప్పినదంతా శ్రద్ధగా విన్న నచికేతుడు నిర్మలుడై, మృత్యువును జయించి పరబ్రహ్మత్వాన్ని పొందాడు. 


         నచికేతుణ్ణి ఆదర్శంగా తీసుకుని కఠోపనిషత్తులో చెప్పిన ఆత్మజ్ఞానాన్ని గురువు సన్నిధిలో శ్రద్ధగా అధ్యయనం చేసి, అభ్యసించి, అనుభూతిని పొందినవారు జీవన్ముక్తులై బ్రహ్మజ్ఞులు అవుతారు.


ఓం సహనావవతు, సహనౌ భునక్తు

సహవీర్యం కరవావహై, తేజస్వినా వధీతమస్తు,

మా విద్విషావహై ఓం శాంతిశ్శాంతి శాంతిః


ఓం నమః శివాయై చ నమః శివాయ !🙏🙏🌷👌🙏🙏

కామెంట్‌లు లేవు: