4, జులై 2023, మంగళవారం

విద్యాభ్యాసం - గురుదక్షిణ

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - VI 


విద్యాభ్యాసం - గురుదక్షిణ 

    

   ప్రస్తుత విద్యావిధానంలో 

1. సమగ్రమైన విద్యను నేర్చుకొనే అవకాశం లేదు. 

    దీనికి కారణం, మానవ మేధస్సుతో ఆలోచించి, తయారుచేసిన విద్యావిషయాలు. 

2. ఉపాధికోసమే విద్యార్జన అనేది పూర్తి అలవాటైంది. 

3. ఏదైనా విద్య నేర్చకొనాలంటే, 

* ప్రవేశ పరీక్షలో ప్రతిభనైనా కనబరచాలి. లేదా 

* రిజర్వేషను వర్తించాలి. లేదా 

* Donation కట్టి చదువు "కొనే" స్థోమతైనా ఉండాలి. 


    కానీ, మెకాలే విద్యావిధానం ప్రవేశపెట్టకముందు, మన దేశంలో,

1. విద్య అసలు సిసలు శాస్త్రీయమైనది. వేద, ఉపనిషత్ ప్రామాణికమైనది. 

2. విద్య ఉపాధికోసం కాక, మనో వికాసానికే.

3. పిల్లవాడి అభిరుచి మేరకు గురువు దగ్గర విద్య నేర్చుకునేవాడు. 

    గురువు వద్ద విద్యనేర్చుకోవడానికి ఏ విధమైన ప్రవేశ పరీక్ష ఉండేదికాదు. 

    రాజు - రైతు - సేవకుడు అనే భేదం లేకుండా, విద్యార్థుల అభిరుచినిబట్టి అందఱూ కలసి గురుకులంలో ఉచితంగా విద్యని అభ్యసించేవారు. కృష్ణుడు - కుచేలుడు కలసి చదువుకోవడమే దీనికి నిదర్శనం. 


గురుదక్షిణ 


    గురువువద్ద విద్యనేర్చుకున్న అనంతరం శిష్యుడు తన గురువుకు సమర్పించుకునేదే గురుదక్షిణ. 

    గురువు తన అవుసరాన్నీ, శిష్యుని స్థితినీ దృష్టిలో పెట్టుకుని గురుదక్షిణ అడిగేవాడు. 

    దీనికి ఉదాహరణలు 

 1. కుచేల,బలరామ,కృష్టులకు గురువైన సాందీపని, 

     ప్రభాస తీర్థంలో మునిగి మరణించిన తన పుత్త్రుని గురుదక్షిణగా తెచ్చిమ్మని,  కృష్ణుణ్ణి అడిగాడు. 

2, పాండవుల కౌరవుల గురువైన ద్రోణుడు, గురుదక్షిణగా - తనని అవమాన పరచిన ద్రుపదుని బంధించి తీసుకురమ్మని అర్జునుని అడిగాడు. 


లౌకిక - పారమార్థిక విద్యలు 


1. ద్రోణ ద్రుపదులు కలసి చదువుకున్న ప్రాణమిత్రులు. ఎప్పటికీ ప్రియమైనవారుగా ఉండాలని ప్రతిజ్ఞ చేసుకున్నవారు. కానీ ద్రోణుడు దరిద్ర స్థితిలో ద్రుపదుని సహాయంకోరి వెడితే "రాజుకీ - బీదబ్రాహ్మణునికీ సంబంధమేమని" అవమానపరిచాడు. 

    ప్రతిగా ద్రోణుడు ద్రుపదుడు తన సహాధ్యాయే అయినా, తనని అవమాన పరచి శత్రువైన ద్రుపదుని బంధించి తీసుకురమ్మని అర్జునుని అడిగాడు. 

   {అదే ద్రోణుడు అర్జునుని మాత్రమే మేటి విలుకాడుగా చూడడానికి, 

    బొటనవ్రేలు గురుదక్షిణగా అడగడం కూడా గమనించదగ్గ విషయం(దానికి లోతైన వేరే కారణం ఉంది. అది వేరే విషయం) }. 

2. కృష్ణ - కుచేల సంబంధాన్ని మనం గమనిస్తే, దీనికి విరుద్ధంగా కనిపిస్తుంది. 

    తనతో కలసి విద్యనభ్యసించిన కుచేలుడు వస్తే, సాదరంగా ఆహ్వానించి, 

     కుచేలుడు అడగకుండానే, కుచేలుడికి సంపదను కృష్ణుడు అనుగ్రహించాడు. 


    ఈ ద్రోణ - ద్రుపద, కృష్ణ - కుచేల సంఘటనలను గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది. 

    ద్రోణ - ద్రుపదులు విలువిద్యవంటి లౌకిక విద్యలు నేర్చుకున్నవారు. 

    కృష్ణ - కుచేలులు పారమార్థికవిద్య అభ్యసించినవారు. 


    కేవలం "లౌకిక" విద్యలైతే కక్షలూ కార్పణ్యాలకు దారితీసే అవకాశం ఉంటుందనీ, దానికి "పారమార్థిక" విద్య చేరితే దయాదాక్షిణ్యాలబ్బుతాయనీ తెలుస్తుంది. 


    ప్రస్తుతం మన విద్యావిధానంలోని లోపం అదేకదా! 


                    =x=x=x= 


రామాయణం శర్మ 

            భద్రాచలం

కామెంట్‌లు లేవు: