4, జులై 2023, మంగళవారం

శ్రీ నవగ్రహ ఆలయం

 🕉 మన గుడి : 



⚜ అస్సాం : గౌహతి


⚜ శ్రీ నవగ్రహ ఆలయం 



💠 సాధారణంగా మనం ఆలయా‌లలో  నవగ్రహాలు  ఒక ప్రక్కగా విగ్రహ రూపాల్లోనూ,కొన్ని ఆలయాలలో వారి వారి వాహన సహితంగానూ ప్రతిష్టింపబడి వుండటం చూస్తాము.

కాని కేవలం నవగ్రహాలకే ప్రత్యేక ఆలయము అస్సాం రాష్ట్రమందలి  గౌహతీ నగరమున కలదు 


💠 పరిస్ధితులు బాగుండనివారు నవగ్రహాలకి నియమం ప్రకారం ప్రదక్షిణలు, పూజలు, దానాలు చేస్తారు. గౌహతిలో నవగ్రహాలకి ప్రత్యేకించి ఆలయం వున్నది.  ఉజాన్ బజార్ లో వున్న ఈ ఆలయం 18వ శతాబ్దానికి చెందినది. 

చిత్రాచల్, లేదా నవగ్రహ హిల్ గా పిలువబడే ఈ చిన్ని కొండ ఎక్కటానికి దాదాపు 25 మెట్లు ఎక్కాలి.


💠 సాధారణంగా ఆలయంలో నవగ్రహాలు అంటే ఆయా గ్రహాల అకృతితో కూడిన శిల్పాలతో  ఉంటాయు.. కానీ  గౌహతి లోని ఆలయంలో నవగ్రహాలు అన్ని శివలింగ ఆకృతిలో ఉంటాయి .. 

గర్భగుడిలో నవగ్రహాల శివలింగాలు మాత్రమే ఉంటాయి .. శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహం దాని రంగులో ఉంటుంది . ఆకారం మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటాయి .. 


💠 వర్తులాకారంలో వున్న గర్భ గుడిలో మధ్యలో సూర్యుడి స్ధానంలో ఒక లింగం, చుట్టూ మిగతా గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు లింగరూపంలో వాటికి నిర్దేశింపబడిన స్ధానాలలో ప్రతిష్టించబడ్డారు.  

ప్రతి గ్రహానికీ ఆ గ్రహాన్ని సూచించే రంగు బట్ట కడతారు. ఇవన్నీ నేలమట్టంలోనే వుంటాయి.  వాటిమధ్య కేవలం ఒకరు నడవటానికి మాత్రమే ఖాళీ వుంటుంది. గుమ్మంలోంచి చూస్తే గర్భగుడి అంతా లింగాలతో కనబడుతుంది.

ఇక్కడ గర్భగుడిలో వెలుతురు వుండదు.  కరంటు వుందిగానీ, లైటు వెయ్యరు. అస్సలు కనబడటంలేదంటే ఒక్క నిముషం లైటు వేసి తీసేస్తారు


💠 అస్సాం ఇదివరకు పేరు ప్రాగ్జోతిష్య పురం.   అస్సాంలో  నవగ్రహ ఆరాధన ప్రాచీన కాలంనుంచీ వున్నది.  పూర్వం అస్సాం జ్యోతిష్య శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికీ నెలవుగా వుండేది.  అందుకే అస్సాంకి ప్రాగ్జోతిష్యపురం అనే  పేరు వచ్చిందంటారు.  

ప్రాక్ అంటే తూర్పు ప్రాంతం అని జ్యోతిష్య పురం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది గనుక ప్రాగ్జోతిష్యపురం (eastern city of astrology) అన్నారు


💠 అక్కడ నవగ్రహ అభిషేకాలు పూజలు ... గ్రహ అభిషేకాలు పూజలు చేస్తారు... ముఖ్యంగా జాతకంలో గ్రహ దోషాలు ఉన్నవాళ్లు అక్కడ నివారణ  పూజలు చేయించుకొంటారు.


💠 గ్రహబలం మీద జాతకం ఆధారపడి ఉంటుందని హిందువులు నమ్ముతారు.

గ్రహదోషాలు వున్నవారు ఈ ఆలయానికి వచ్చి ఆయా గ్రహాలకు దోష నివారణా పూజలు చేయించుకుంటారు.


💠 కాళికా పురాణం ప్రకారం బ్రహ్మ దేవుడు ఇంద్రలోకంతో సమానమైన నగరాన్ని సృష్టించాలని ప్రాగ్జోతిష్యపురాన్ని నిర్మించాడంటారు.  

ఇక్కడ దేనికైనా ప్రామాణికంగా ఎక్కువ కాళికా పురాణాన్నే చెబుతారు. మానవుని జీవిత గమనాన్ని నిర్దేశించే నవగ్రహాలకి ఎంతో ప్రాముఖ్యత వున్నది.  గ్రహ సంచారాల వలన మనుష్యల జీవితాల్లో సుఖ దుఃఖాల సంఘటనలు ఏర్పడతాయని హిందువుల నమ్మకం.


⚜ చరిత్ర మరియు పురాణం ⚜


💠 గౌహతి నవగ్రహ ఆలయ చరిత్ర 18వ శతాబ్దం నాటిది. ఈ దేవాలయం అహోం రాజు రాజేశ్వర్ సింఘా కాలంలో నిర్మించబడిందని నమ్ముతారు. ఈ ఆలయం ఒక కొండపై నిర్మించబడింది, దీనిని స్థానికులు పవిత్ర స్థలంగా భావిస్తారు. 

పురాణాల ప్రకారం, రాక్షస రాజు నరకాసురుని నుండి 16,000 మంది యువరాణులను రక్షించడానికి శ్రీకృష్ణుడు తన ప్రయాణంలో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు.

 శ్రీకృష్ణుడు రాక్షసరాజుతో యుద్ధానికి ముందు ఈ ప్రదేశంలో నవగ్రహాల పూజ (పూజలు) చేశాడని చెబుతారు.


💠 ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో అహోమ్ రాజు రాజేశ్వర సింఘ నిర్మించారు. తర్వాత 1923-45 మధ్య పునరుధ్ధరింపబడింది.


💠 ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి కుడివైపు  వినాయకుడు ఆసీనుడైవునాడు.

ఆ విఘ్నేశ్వరునికి నమస్కరించుకుని లోపలికి ప్రవేశించగానే  గుండ్రటి హాలు అందులో తొమ్మిది శివలింగాలు వున్నాయి.

మధ్యలో సూర్యలింగం చుట్టూ లింగరూపంలో వున్న 8 గ్రహాలు వున్నాయి.


💠 ఈ ఆలయంలో పవిత్రమైన చెరువు ఉంది. దీనిని నవగ్రహ కుండ్ అని పిలుస్తారు, 

ఇది వైద్యం చేసే శక్తులను కలిగి ఉందని నమ్ముతారు.


💠 భక్తులు, పూజలు నిర్వహించి, దేవతలకు పూలు, పళ్లు, మిఠాయిలు సమర్పిస్తారు. ముఖ్యంగా నవరాత్రులు, శివరాత్రి, మకర సంక్రాంతి వంటి శుభ సమయాల్లో ఆలయాలు రద్దీగా ఉంటాయి. నవగ్రహాల ఆశీర్వాదం కోసం నవగ్రహ పూజకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి . పూజారి మంత్రాలను పఠిస్తూ దేవతలకు వివిధ పదార్థాలను సమర్పిస్తారు. ఈ పూజలో ఒక్కో గ్రహానికి సంబంధించిన ఒక్కో రకమైన పదార్ధాలను విడివిడిగా పెట్టి పూజిస్తారు.


💠 గౌహతి నవగ్రహ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ వార్షిక నవగ్రహ ఉత్సవం. 

నవంబరు నెలలో జరుపుకునే ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. పండుగ యొక్క ప్రతి రోజు నవగ్రహాలలో ఒకరికి అంకితం చేయబడి ,సంబంధిత దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు. 


💠 గౌహతిలో కామాఖ్య అమ్మవారి ఆలయానికి 20 కిమీ దూరంలో ఉంటుంది...  వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి 5 కిమీ దూరంలో ఉంటుంది ..

కామెంట్‌లు లేవు: