4, జులై 2023, మంగళవారం

భాగవత కధా కవితా సుధారసము

 భాగవత  కధా కవితా సుధారసము

                                                   --------------------------------------------------- 


              కం: పలికెడిది భాగవతమట!

                     పలికించెడు వాఁడు  రామభద్రుండట!  నే

                     పలికిన  భవహర మగునట!

                     పలికెద,  వేరొండు గాధ  పలుకఁగ  నేలా? 


                       అంటూ సర్వము  భగవత్కర్తృత్వము గా నెంచి  భక్తి భావ సంభరితముగా  రచియింపఁ బడిన  మహాపురాణ గ్రంధము

శ్రీమదాంధ్ర మహాభాగవతము.


                 భాగవతం చదవటం  అంటే  బాగుపడటం"- అన్నారు పెద్దలు. తపస్సు యజ్ఙయాగాదులు చేయటం, వంటి కష్టాలు యేమాత్రం పడకుండా కేవలం  ,శ్రవణ  మాత్రం చేతనే  ముక్తిని పొందే ఉపాయం భాగవత కధాశ్రవణం .


                                 చతుర్వేదములను, అష్టాదశ పురాణములను, పదునెనిమిది పర్వముల మహాభారతమును  రచించించియు,

కలత వొందు వ్యాసుని  చిత్తార్తిని దీర్చుటకు నారదోప దేశమున వ్యాసునిచే నీగ్రంధము విరచింప ఁబడినది .పన్నెండు స్కంథములుగా

విస్తరిం చిన  యీగ్రంధము మహాపురాణముగా కీర్తింప బడుచున్నది.


                                  భగవం తుడే (శ్రీకృష్ణుడు) కథానాయుకుడైన యీగ్రంధమును  పరమ భాగవతాగ్రేసరుడు  ఆంధ్రీకరించి  యాంధ్రులకు  సారస్వత సంబంధమైన విందు సమకూర్చినాడు. కల్పక సదృశమైన యీభాగవతము మందార మకరందములను

గురియించు పద్య సంపదకు నెలవై యాంధ్రుల హృదయ క్షేత్రములలో  నాధ్యత్మికమును పండించుచు ముక్తిద్వారముగా మురిపించుచున్నది.


                              పోతన కవిత్వ మొక పంచదార పాకము. జుంటితేనియ. గొజ్జగి పూమృదులము. తెనుగు పదములకు సంస్కృత సమపదములను జోడించి, శబ్దార్ధాలంకార భాసురమై  నాదసుభగాభిరామమై  చదివినంత సేపు పాఠకుని యొక దివ్య కవితాలోకమున

విహరింపఁజేయును.


                    కృష్ణుని బాల్యక్రీడలు మరపురాని ఘట్టము. భావుకుడైన పాఠకుడా ఘట్టమున మునిగి కన్నుల నానంద భాష్ప శిక్తుడౌట

తథ్యము. యిందలి యుపాఖ్యానములన్నియు నొకదానిని మించి మరియొకటిగా చిత్రిపబడి యుండును. అనుప్రాసలతోను, అంత్యప్రాసలతోను, యమకాదులతోను, ఆపద్యములు పాఠకుని కవితాడోలలో  నూయల లూగించును.


                     పోతన ప్రతిభను "మందార మకరందాది యొండు రెండు పద్యములతో  వివరించుట  సాధ్యము కానిపని.సామాన్యముగా క్రియాపదముతోనో లేక అవ్యయముతోనో ప్రారంభమౌ వృత్తపద్యములు ఆపై వరుసగా విశేషణ ముల

ముక్తాయింపులతో  అంత్యప్రాసల విన్యాసములతో బహు సుందరముగా నుండును.


            "  అట  గాంచెన్  కరణీ విభుండు  నవఫుల్లాంభోజ కల్హారమున్

                నట దిందీవర వారమున్  గమఠ మీన గ్రాహ  దుర్వారమున్

               వట హింతాల తమాల తాల తరుణీ వల్లీ కుటీతీరమున్

                చటులోధ్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గా సారమున్ి


                                అట, అవ్యయం.కాంచెన్ క్రియ.కాసారమున్  విశేష్యము.తక్కినవన్నీ విశేషణములే!


                     పోతన భాగవత మొక కవితా సాగరము.పద్యములన్నియు మంచి ముత్యముల రాసులే  ఎన్నిని యెన్నగలం? అదిమన శక్తికి మించిన పని.


                        పోతన కవితా తత్వమును బహుముఖములుగా బరిశీలించిన వారిలో  అభినవ పోతన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి ప్రశంసా పద్యాలతో మనమీ విషయాన్ని ముగిద్దాం.మరోసారి విపులంగా పోతన గారిగురించి చెప్పుకుందాం.


                "  అచ్చపు జుంటితేనియల  నైందవబింబ  సుధారసాల  గో

                   ర్వెచ్చని  పాలమీగడల  విచ్చిన  కన్నె  గులాబి  మొగ్గలన్

                   మచ్చరికించు  నీ మధుర మంజుల మోహన మైన  శైలి నీ

                   వెచ్చట  నేర్చినావు సుకవీ!సుకుమారకళా కళానిధీ!


                "  ముద్దులుగార  భాగవతమున్  రచియించుచు  పంచదారలో

                    నద్దితివేమొ  ఘంటము  మహాకవి శేఖర!  మధ్య  మధ్య   న

                    ట్లద్దక  వట్టి ఘంటమున  నట్టిటు  గీసిన  తాటియాకు  లో

                    పద్దెములందు  నీ మధుర  భావన  లెక్కడినుండి  వచ్చురా?


                                                         కరుణశ్రీ,


జ      జుంటితేనెల తీయదనం. వెన్నెల లోని యమృతం,  గోరువెచ్చని పాలమీగడల సొగసును,విచ్చిన లేతగులాబి మొగ్గలను మచ్చరికింప జేస్తుందట పోతన కవిత్వం. కరుణశ్రీ యెంతచక్కగా చెప్పారు.అసలు యింత సుకుమారమైన కవితాకళను నీవెక్కడ

నేర్చుకున్నావయా? అనిప్రశ్న? అదియా భగవదత్తము. నిరంహంకారమునకు నిర్మమత్వమునకు ప్రతిఫలము!


                     మద్దులు గారేవిధంగా కవిత్వంవ్రాస్తూ గంటాన్ని పంచదారలోముంచావేమో ?అందుకే నీకవిత్వానికి అంతతీపి! మధ్యమధ్యమరచావేమో నంటాడు కరుణశ్రీ యింతకన్నా యెవ్వరు మాత్రం పోతన కవితను వింగడించగలరు?


                           " అందుకే భాగవతమును రోజూ చదువుకుందాం  అందరం బాగుపడదాం!


                                                                       స్వస్తి!🙏🙏🌷🌷💐💐💐🌷🌷🌷🌷💐💐💐

కామెంట్‌లు లేవు: