16, జులై 2023, ఆదివారం

సూర్యదేవాలయం_ఉరవకొండ

 సూర్యదేవాలయం_ఉరవకొండ


ఉరవకొండ మండలంలో అరుదైన సూర్య దేవాలయం

    -చోళుల కాలంలో 800 ఏళ్ల క్రితం నిర్మితం అయినట్లు చెబుతున్న చరిత్ర కారులు.


-సప్త అశ్వాలతో సూర్య భగవానుడి ఏక శిలా విగ్రహం


-శివకేశవులుతో కలసిఉన్న ఏకైక దేవలయం


"అన్ని దేవాలయాలలో కన్నా సూర్యభగవానుని దేవాలయాలు చాలా అరుదైనదని చెప్పాలి. అయితే అనంతపురం జిల్లాలో సూర్యభగవానుని దేవాలయం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బూదగవి సూర్యదేవాలయం.అయితే ఉరవకొండ మండలంలోనే మరో సూర్య దేవాలయానికి కూడా ఎంతో చరిత్ర వుంది. అదే ఆమిద్యాల గ్రామంలోని పురాతన శ్రీసూర్యదేవాలయం. ఈఅరుదైన ఆలయం గూర్చి విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం."


అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో ఉన్న చారిత్రాత్మకత, పురాతన చరిత్ర కల్గిన దేవాలయాలు భక్తులను అలరిస్తున్నాయి. ఎంతో చరిత్ర కల్గిన పురాతన దేవాలయాలు ఒకే చోట నెలవై ఉన్నాయి. అందులో సప్త అశ్వవాహనంపై కొలువైన అరుదైన శ్రీసూర్యదేవాలయం ఇక్కడే ఉండడం విశేషంగా చెప్పవచ్చు.ఇదే ఆలయంలో వైష్ణవ, శైవ దేవాలయాలుండడం మరో అరుదైన విషయం


ఆలయ చరిత్ర..

శిలాససనాలు ఉన్నప్పటికీ వాటిని తర్జుమా చేసేవారు లేకపోవడంతో గ్రామస్తులు, అర్చకులు తెలిసిన వివరాల ప్రకారం క్రీ.శ 1200-1300 కాలంలో చోళ రాజుల వంశానికి చెందిన రాజు ఆమిద్యాల గ్రామంలో దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడ చెన్నకేశవ స్వామి ఆలయంగా పిలవబడుతున్న ఈఆలయంలో శివ -కేశవులు విగ్రహాలతో పాటు అరుదైన శ్రీసూర్య నారాయణుడి విగ్రహం కూడా ఉంది. గతంలో ఈ దేవాలయం ఎంతో ఆదరణ పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆలన పాలన లేక అవి శిథిలావస్థకు చేరింది. అయితే గ్రామస్తుల ఉమ్మడి కృషి ఫలితంగా 2017 నుండి తిరిగి అన్ని పూజలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మరింత అభివృద్ధి చేయాలని తలంపుతో గ్రామ పెద్దలు కమిటిగా ఏర్పడి కృషి చేస్తున్నారు.


పశ్చిమాభి ముఖంగా సూర్య భగవానుడు


ఏక్కడైన సూర్య భగవానుడు తూర్పు అభిముఖంగా కొలువు దీరి వుంటారు.మన దేశంలో కోణార్క్ కానీ,మన రాష్ట్రంలో అరసవెల్లి లో కానీ అలాగే కొలువు దీరాడు. కానీ ఆమిద్యాల గ్రామంలో సూర్య నారాయణుడు పచ్ఛిమ దిశగా కొలువై ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పచ్చిమాభి ముఖంగా ఉన్న సూర్య భగవానుడి ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే అని చెబుతున్నారు.


ఆరోగ్య ప్రదాత


ఇక్కడి సూర్య భగవానుడిని దర్శించుకుంటే ఎటువంటి అనారోగ్యలైన నయమవుతావని గ్రామస్తుల నమ్మకం.అంతే కాక ఉద్యోగ ప్రదాత కూడా అని అంటున్నారు.


ఎలా చేరుకోవాలి..!


ఆమిద్యాల గ్రామంలో ఉన్న సూర్య దేవాలయం అనంతపురం నుండి 50 కిలోమీటర్లు, ఉరవకొండ పట్టణం నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది.ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం.బస్సుల సౌకర్యం ఉంది.

కామెంట్‌లు లేవు: