11, ఆగస్టు 2023, శుక్రవారం

రామాయణమ్ 287

 రామాయణమ్ 287

...

మేమందరము పలు విధాలుగా వెతుకుతూ దారితప్పి వింధ్యపర్వతము వద్దకు చేరగా పలు దినములు గడచిపోయినవి.

.

కార్యసాధనలో విఫలురమయినామన్న బాధ ఒక ప్రక్క ,మరొకప్రక్క గడువుదాటిన పిమ్మట తిరిగి వెళ్ళినచో సుగ్రీవుడు విధించు కఠినదండన మా మనస్సును నిలకడగా ఉండనీయక వేధింప ప్రారంభించినవి.

.

వేరే దారి ఏది కనపడక ప్రాణత్యాగమే శరణ్యమని నిశ్చయించుకొ‌ని ప్రాయోపవేశమునకు సిద్ధపడుతూ నిన్ను అపహరించినదాదిగా జరిగిన సంఘటనలను మాలో మేము ఏకరువు పెట్టుకొనుచుంటిమి .ప్రసంగవశమున జటాయువు ప్రస్తావన రాగా అది విని ఒక గొప్ప ముదుసలి గృధ్రరాజు అట కు ఏతెంచెను.

.

ఆయన ఎవరో కాదు జటాయువు సోదరుడు సంపాతి !

.

ఆవేశముగా మమ్ము ప్రశ్నించాడు సంపాతి .నా తమ్ముడిని ఎవ్వరు ఎక్కడ చంపి వేసినారు ? ఏ కారణము వలన అట్లు జరిగినదని మమ్ము ప్రశ్నించగా మేము ఆయనకు జరిగిన విషయమును ఎరుక పరచితిమి.

.

అంత సంపాతి నీ యొక్క జాడను మాకు తెలియ చెప్పెను. నీవు బందీవై రావణుని గృహములో ఉన్నావని చెప్పినాడు .తన దృష్టికి నీవు కనపడినావని కూడా మాకు తెలిపినాడు.

.

నీ జాడ తెలిసిన మాకు పోయిన ప్రాణములు తిరిగివచ్చినట్లాయెను .

.

నీ జాడ కనుగొనుట కొరకు నేను నూరుయోజనముల పొడవు గల సముద్రమును లంఘించి దుమికి లంకా పురి చేరినాను.

.

రావణలంకలో రాత్రిపూట ప్రవేశించి అంతటా వెతుకుతూ ఇచటికి చేరి దుఃఖసాగరములో మునిగియున్న నిన్ను కనుగొన్నాను తల్లీ!

.

ఓ పరమపావనీ !

 ఓ దోషరహితా ! 

ఓ పుణ్యచరితా

సీతామాతా ! 

అన్నివిషయములు నీకు ఎరుక పరచితినమ్మా ! 

నేను రావణుడను కాను రామునిబంటును హనుమంతుడు నాపేరు .

.

కేసరీ,అంజనాదేవి నా తల్లితండ్రులు వారికి వాయుదేవుని వరప్రసాదము వలన నేను జన్మించితిని.

 .

నా ఇష్టము వచ్చిన రూపములు ధరించగల శక్తి నాకున్నదమ్మా!

.

అమ్మా ! నా అదృష్టము బాగున్నది సముద్రలంఘనము వ్యర్ధము కాలేదు !

నిన్ను కనుగొంటినన్న కీర్తిపొందగలవాడను !

.

ఈ విధముగా మాటలాడిన హనుమ పలుకులను విశ్వసించి ఆతడు శ్రీరామదూతయే అని సీతమ్మ తెలుసుకొన్నదాయెను.

.

వూటుకూరు జానకిరామారావు 

.

కామెంట్‌లు లేవు: