9, ఆగస్టు 2023, బుధవారం

కర్మ తప్పదు.

 శరీరము ఉన్నంతవరకు కర్మ తప్పదు. ఎటువంటివారైనా కర్మ చెయ్యవలసినదే. అది గృహస్థుడైనా పూర్తి వైరాగ్యం పొందిన సన్న్యాసి అయినా తప్పదు. 


పూర్తిగా వైరాగ్యం పొందిన సన్న్యాసులకూ కర్మ అవసరమేమున్నది? అనే ప్రశ్న రావచ్చును. 


వైరాగ్యం పొందిశా, ఆత్మజ్ఞానాన్ని పొందినా శరీరం ఉంటుంది కదా! కనుక శరీరం నిలచి ఉన్నంతవరకు దానిని పోషించవలసి ఉంటుంది. అటువంటప్పుడు శరీరానికి ఆహారము, నిద్ర,శౌచము కనీస అవసరాలు. వాటిని శరీరానికి అందించటము కూడా కర్మచెయ్యటమే అని చెప్పబడినది. కనుక ఎటువంటి శరీరధారికైననూ కర్మాచరణ తప్పదు. అయితే...

 నేను ఈ పని చేస్తున్నాను. దీని ఫలితం నాకు ఇలా లభిస్తుంది అనే స్పృహ/కోరిక అనేవి విడిచివెయ్యాలి నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. అదేవిధంగా ఆ కర్మాచరణ వలన కలిగే ఫలితాన్నీ ఆశించకూడదు. అన్నిటికీ కర్త కర్మ క్రియ అంతా భగవంతుడే అని భావించాలి. ఏ కర్మ చేసినా భగవద్దత్తంగా చెయ్యాలి. నేను, నాది అనేది పూర్తిగా విడిచివెయ్యాలి. అప్పుడే కర్మఫలాలు మంచివైనా చెడ్డవైనా అంటుకోవు. కర్మఫలాలు ఎప్పుడైతే అంటుకోవో అప్పుడు శరీరధారి/జీవుడు కర్మరహితుడు అవుతాడు. కర్మరాహిత్యం వలననే మోక్షం లభిస్తుంది. 


ఈ కర్మరాహిత్యమైన స్థితికి చేరిన శరీరధారికి అసంకల్పితంగానే జ్ఞానం ఉద్భవిస్తుంది. 


జ్ఞానము అంటే ఆత్మను తెలుసుకోవటమే. ఆత్మను తెలొసుకోవటమంటే బ్రహ్మమును తెలుసుకోవటమే.

కామెంట్‌లు లేవు: