30, అక్టోబర్ 2023, సోమవారం

మల్లికార్జునుడు

 శ్రీశైలం వృద్ధ మల్లికార్జునుడు...

శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది.

మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరునిసౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది.

ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. 

అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. 

కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. 

అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది. అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తితత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవుఇక్కడఎవరికోసంవెతుకుతున్నావు అని అడిగాడు.

ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. 

చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు.

అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. 

అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. 

అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆకాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. 

ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. 

ఈవిధంగా నరసింహ స్వామీ దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. 

అది మన తెలుగునాట ఉన్న కొండఅక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. 

ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. 

ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. 

సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి.ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.

శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది.

ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

కామెంట్‌లు లేవు: