22, నవంబర్ 2023, బుధవారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 93*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 93*


*ఆస్తుల విషయంలో తలెత్తిన బేధాభిప్రాయాలు...*


1886 ఆగస్ట్ 31వ తేదీతో కాశీపూర్ ఉద్యానగృహ బాడుగ గడువు తీరి పోయింది. ఇల్లు ఖాళీచేసి ఇవ్వవలసిన అగత్యం ఏర్పడింది. ఆ యువకులు ఎక్కడకు పోగలరు? వారిలో పలువురు అక్కడ నివసించి శ్రీరామకృష్ణుల అస్థికలను ఆరాధించుకొంటూ తపోమయ జీవితం గడపాలని ఆశించారు. కాని అద్దె ఎవరు చెల్లిస్తారు?. బలరాంబోసు, సురేంద్రనాథ్ మిత్ర, గిరీశ్ ఘోష్ ప్రభృతులు యువ శిష్యులు నివసించడానికి ఒక మఠం ఏర్పాటు చేయవచ్చుననే అభిప్రాయానికి ఆమోదముద్ర వేశారు. కాని రామచంద్రదత్తా, మరి ఒకరిద్దరు ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించి ఆ యువకులతో, 


"ఈ విధంగా మీరు ఇల్లూవాకిలీ త్యజించి సన్యాసులు కావాలని గురుదేవులు చెప్పలేదు. మీ మీ ఇళ్లకు తిరిగి వెళ్లిపోండి. గురుదేవులు చెప్పినట్లు సంసారంలోనే ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని రూపొందించుకోండి. అస్థికలను పూజించే విషయం గురించి మీరు ఆందోళన చెందనక్కరలేదు. కాంకూర్ గాచ్ఛి లో నాకు ఒక తోట ఉంది. అక్కడ ఆయన అస్థికలను ప్రతిష్ఠించి నిత్యారాధన చేసేలా ఏర్పాట్లు చేశాను. దానిని గురించి మీరు ఏమాత్రం ఆందోళన చెందనవసరం లేదు" అని చెప్పాడు.. 


యువకులలో ఎవరూ రామచంద్ర దత్తా యోచనను సమ్మతించలేదు. గంగాతీరంలో ఒక అనువైన స్థలంలో అస్థికలను ప్రతిష్ఠించి నిత్యార్చనకు ఏర్పాట్లు చేయాలని వారు అభిలషించారు. ఇలాంటి భావననే ఒకసారి శ్రీరామకృష్ణులు మునుపు వ్యక్తం చేశారు. కాని ప్రస్తుతం అందుకు మార్గం లేనట్లు కనిపించింది.. తక్షణమే ఒక స్థలం ఏర్పాటు చేసుకోవడం కుదరని పని. నెమ్మదిగా ఆ పని చేయవచ్చు. కనుక అస్థులను తమ వద్దే ఉంచుకోవాలని యువకులు భావించారు. ఈ అభిప్రాయభేదం పాకానపడి ఒక సమస్యగా పరిణమించింది. 


ఇదంతా విన్న మాతృదేవి, "సాటిలేని మహాపురుషుణ్ణి కోల్పోయి నిలబడి ఉన్నాను. వారేమో ఆయన అస్థికల కోసం పోట్లాడుకొంటున్నారు” అన్నారు. ఆవేదనతో.


చివరికి నరేంద్రుడు జోక్యం చేసుకొని, "సోదరులారా! మనం ఇలా పోట్లాడుకోవడం సబబు కాదు. పరమహంస శిష్యులు అస్థికల కోసం పోట్లాడుకొంటున్నారని లోకులు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకండి. అంతేకాదు; ఇకపై మనం ఎక్కడ నివసించాలో కూడా నిర్ణయించుకోలేదు. ‌ఇది ఇలావుండగా అస్థికలను ఎలా పదిలపరచగలం? రాంబాబు తన ఉద్యాన గృహంలో అస్థికలను  ప్రతిష్ఠించి, దానిని శ్రీరామకృష్ణుల పేరిటే కదా ఏర్పాటు చేయబోతున్నాడు! 


 మనమూ అక్కడకు వెళదాం, ఆయనను ఆరాధించుకొందాం. గురుదేవులు చూపిన ఆదర్శం ప్రకారం జీవించి చూపితే అది ఈ అస్థికలను పూజించడం కన్నా మహత్తరమయినది" అన్నాడు. నరేంద్రుడు చెప్పిన తరువాత అందరూ అందుకు అంగీకరించారు. ఆగస్ట్ 23వ తేదీ కృష్ణజయంతి పర్వదినం నాడు అస్థికలను ప్రతిష్ఠించాలని నిర్ణయించారు.


ఈ ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ యువశిష్యులలో ఏదో చెప్పరాని వెలితి ఉండనే ఉంది. చివరికి నరేంద్రుణ్ణి సంప్రతించి యువకులందరూ ఇలా తీర్మానించారు: ఆగస్ట్ 22వ తేదీ అస్థులలో అధిక భాగం ఎవరికీ తెలియకుండా మరొక కలశంలో మార్చి తమ కోసం ఉంచుకొన్నారు.


కృష్ణ జయంతి రోజు ఉదయం శశి అస్థికల కలశాన్ని తన తల మీద పెట్టుకొని రాగా, అందరూ కాంకూర్ గాచ్చికి వెళ్లి విధివిహితంగా అక్కడ అస్థులను ప్రతిష్ఠించి పూజలు నిర్వర్తించారు. కాని యువశిష్యులు అస్థికలు విభజించిన విషయం త్వరలోనే అందరికీ తెలియవచ్చింది. అప్పుడు గృహస్థ భక్తులు, "గురుదేవుల సంకల్పం అదే అయితే, అట్లే జరగనీ” అని చెప్పి మౌనంగా ఉండిపోయారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: