22, నవంబర్ 2023, బుధవారం

 ౦౦౦ ఆలోచనాలోచనాలు ౦౦౦ అవధాన మధురిమలు ౦౦౦ శతావధాని శ్రీ పులుగుర్త వేంకట రామారావు ౦౦౦.      సమస్యాపూరణములు ;--- 1* "" భీష్మద్రోణుల కావహంబుఁ గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్.""          శా. గ్రీష్మాదిత్య ప్రతాప శోభితుడు నాభీలా జిరంగోన్నతా/ ర్చిష్మ త్పుత్రుని మున్ను కౌరవులలో సేనాధిపత్యం బొగిన్/ భీష్మ ప్రక్రియఁ గల్గె నేరి కనియే వేడ్కందగెన్ ధారుణిన్/ భీష్మ ద్రోణుల కావహంబుఁ గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్.            2* "" గణ చతుర్థినాడు ఫణి చతుర్థి.""                        ఆ.వె. చిగురుబోడి వినుము చెల్మిదీపింపగ/ పాలు పోసినారమోలి మనము/ పరమ భక్తితోడ పరగకార్తికదిన/ గణచతుర్థినాడు ఫణిచతుర్థి.                          3*"" కాకము కాకమే మధుర గానరసజ్ఞతఁ జూపజాలునే!""                     ఉ. ప్రాకట చూత భూరుహ విరాజిత పల్లవముల్ గ్రసించి య/ స్తోకముదాత్త చిత్తమున బొబ్బిలి యుజ్వల కాకలీధ్వనిన్/ వీక రహించు గోకెలల బెంచిన మాత్రన నేమి గల్గెడున్/ కాకము కాకమే మధుర గాన రసజ్ఞతఁ జూపజాలునే!                        4*"" నూతి జలంబులోన పది నూర్ల శిరస్సుల యెద్దు మేసెగా""                              ఉ. చేతము పల్లవింప వెల చేడియ చేదలు వైచెనెందు? సం/ ప్రీతి దలిర్ప శేషుడల వెన్నుని సంస్తుతి చేయునెట్లు? ప్ర/ ద్యోతితలీల పచ్చికను నుర్వర మేసినదెద్ది సెప్పుమా/ నూతి జలంబులోన? పదినూర్ల శిరస్సుల? యెద్దు మేసెగా? (క్రమాలంకారము)                 5"" అంగన పొందునంద భువి నంబుజసంభవుండెట్లు వ్రాసెనో?""                             ఉ. పొంగుచు స్వర్ణ కుంభముల పోడిమి నొప్పు కుచద్వయంబుతో/ బంగరుమేనిడాలెసగ బల్మరు మోహము గొల్పునట్టి యా/ త్మాంగన రోసి యుజ్వల గృహంబుల గాసిలు నాపె బాసి వా/ రాంగన పొందునంద భువి నంబుజ సంభవుడెట్లు వ్రాసెనో?                                దత్తపదులు;----                    1* "" అంగ-- వంగ -- మంగ -- కంగ "" పదములతో పద్యము---                          ఉ. అంగజ రూపుఁడీ సుజన తాధిక వత్సలుడీత డెవ్వడో/ వంగడమెట్టిదో వినుతవైభవమెట్టిది యొక్కొ? వీని వీ/ కంగను గొన్న డెందమున గౌతుకముబ్బ దొడంగెసారవ/ న్మంగళమూర్తి కంఠమున మచ్చికదామము వైతునో చెలీ!                                     2*"" జనానా-- దేవిడీ -- లుంగీ -- పానీ"" పదములతో "" అంజనాదేవి-- వాయుదేవుల వలపు"" పై పద్యం.                                తే.గీ. ఎక్కడిది వెలుంగీ శరదిందువదన / అంజనా! నా యెదకు నిట్టులరుసమంద/ మమ్మనగ గొప్ప దేవిడి రంజిలంగ/ నరిగె పతికడ కెడవలపాని యాపె.             వర్ణనలు;---- 1* " కలికాలంలో లోకరీతిపై పద్యం."                                   చం. ఒకరుని యున్నతిం గనుట కొప్పరు సంతత దుష్టశీలురై/ వికల మనస్కులై సతము పృథ్వి జరించుటెగాని పాండితీ/ ప్రకటిత సత్కవీశ్వరుల భాషల నించుక నాలకింపగా/ నొకడును రాడు సూడ నిది యుర్వర నీ కలికాల ధర్మమౌ!              2* పోతన కవిత్వం పై పద్యం.                                 మ. పరగం గబ్బములందు నంత్యనియమప్రాసంబు లేపారి మా/ ధురి జాలోయన గద్యపద్యముల దోడ్తోనిండి పారంగ శ్రీ/ హరి రూపాధిక వర్ణణాది గత భక్త్యావేశమింపొంద న/ వ్యరసాలంకృతులన్ రహించు గడు పోతనాత్యు కైతల్ ధరన్.                         3* "దురభ్యాసములపై పద్యం"                                  శా. చుట్టల్గాల్చుట; కల్లుద్రావుట; కడున్జోద్యంబుగా గానలం/ దెట్టేబోవుచు వేట లాడుటలు; నెంతేద్యూత కేళీరతుల్;/ చెట్టల్వట్టుట; కీడుసల్పుట; పరస్త్రీభోగమాసించుటల్;/ రట్టుల్గోరుట; లివ్వి దుర్వ్యసన దుర్వ్యాపారము ల్చూడగాన్.                          ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వము సౌజన్యంతో) తేది 22--11--2023, బుధవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: