పద్యరచనలో దోషాలు లేకుండా ఉండాలని ఛందశ్శాస్త్రం చెబుతోంది. చూడటానికి ఇదొక కళగా, క్రీడగా అనిపిస్తున్నా... ఇదొక శాస్త్రం.
వేదమునకు ఆరు అంగములు కలవు.
*"శిక్ష-వ్యాకరణము-ఛంధస్సు నిరుక్తము-జ్యోతిషము-కల్పము అను ఆరు వేదము యొక్క అంగములు."*
వీటినే షట్ శాస్త్రములు అని కూడా అంటారు. అపౌరుషేయమైన వేదము కూడా ఛందోబద్ధమైనదే.
కనుక పద్యం అనేది ఛందోబద్ధంగా ఉండాలి కాని, ఛందోభంగములు ఉండకూడదు.
ఛందోభంగములతో పద్యాన్ని వ్రాయటం అవయవలోపాలతో శిశువు జన్మించటంవంటిదే.
పద్యరచనరో ఏవిధమైన లోపాలు లేకుండా ఉండాలో.... ఈ క్రింద వ్రాస్తాను.
దయచేసి ఇకపై ఛందోభంగాలు లేకుండా వ్రాయటానికి ప్రయత్నించగలరు.
*"ఈ "వైదికప్రపంచం" లో అనేకమంది సంస్కృత, ఆంధ్రభాషాపండితులతోపాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలైన సంస్కృతభాషాకోవిదులు కూడా ఉన్నారు."* దోషభూయిష్టమైన కవిత్వాన్ని చూచి వీరందరితోపాటు సంస్కృత సాహిత్యాలకు అధిదీవత అయిన సరస్వతీమాత కూడా బాధపడుతుంది.
*పద్యరచన-దశవిధదోషములు*
ఏ పద్యములు ఎలా వ్రాయాలో తెలుసుకోవడానికి ముందు పద్య రచన చేసేసమయంలో చేయకూడని పది దోషములు తెలుసుకుందాము. పద్య రచన యందు సహజముగా వచ్చెడి దోషాలు 10 గుర్తించారు మనపూర్వులు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
*1) గణ భంగము:-* గురువు వ్రాయ వలసిన స్థానంలో లఘువు వ్రాసినా, లఘువు బదులు గురువు వ్రాసినా ఈ గణ భంగమనే దోషం వస్తుంది.
*2) యతి భంగము:* యతి స్థానము నందు యతి మైత్రికి సరిపోయే అక్షరం లేకపొయినా....యతికి యతిమైత్రి సరిపోక పోయినా.... యతి స్థానం మారినా.... అది యతి భంగముగా గుర్తించ వలెను.
*3) సంశయము:-*
పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా.. అర్ధంలో సంశయమున్నా.. సంశయ దోషము అంటారు.
*4) విసంధి:-* సంధి చేయవలసిన చోట సంధి చేయకపోతే అది విసంధి దోషము అవుతుంది. తప్పనిసరిగా సంధి చేయవలెను. పద్యరచనలో ఇది అవశ్యము.
సంధి పొసగని యెడల యడాగమ సంధినైనా చేయవలెను. ఉత్వ సంధి వంటి నిత్య సంధిని అసలు విస్మరించ రాదు)
*5) పునరుక్తము:-*
ఒక శబ్ధాన్ని మరల మరల ప్రయోగించడం పునరుక్త దోషము ఒకే అర్ధం వచ్చే విధముగా శబ్దములను పలుమార్లు ప్రయోగించకూడదు.
*6)అపశబ్దము:-* వ్యాకరణంతో సంబంధము లేకుండా...కుసంధులు, దుస్సంధి, వైరి సమాసాలు ఉపయోగించరాదు.
*7)వ్యర్ధము:-* అనవసరమైన అక్షరములు, పదములు, అనుగుణముగా లేని పదములు, కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది.
*8) అపక్రమము:-*
వరుస తప్పడమే అపక్రమము.
ఉదా: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అన రాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి అని అనాలి.
*9) అపార్ధము:-*
సరి అయిన అర్ధము లేకుండా.. ప్రాస కోసమో.. యతి కోసమో శూన్య పదాలు వాడ రాదు వాడిన ఎడల అపార్ధ దోషమంటారు.
*10) విరోధము:-* ప్రకృతి విరుద్ధంగా వర్ణించ రాదు, భౌగోళికాంశములకు విరుద్ధంగా రచనలు చేయరాదు.
ఉదా:
ఆ.వె
అమిత భక్తితోడ నానందముప్పొంగ
విప్రుడొకండు జేరి విజయవాడ
గౌతమందు మునిగి కనకదుర్గఁ గొలిచి
సేద దీరెనతడు చెట్టు క్రింద ! (ఇలా ఒక ఆ.వె పద్యము వ్రాసామనుకుందాము)
"భక్తి విశ్వాసములు మెండుగాగల ఒక బ్రాహ్మణుడు విజయవాడ చేరి కనక దుర్గమ్మ పాదాల చెంత గౌతమీ నదిలో స్నానమాచరించి కనకదుర్గతల్లి దర్శనం చేసుకున్న పిదప చెట్టుక్రింద సేద తీరినాడ"ని కదా ఈ పద్యభావము కాని అక్కడ విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి పాదాలచెంత ప్రవహించేది కృష్ణమ్మ తల్లి. గోదావరి మాత కాదు. కావున పై పద్యము ప్రకృతి విరుద్ధంగా ఉందని తెలుసుకోవాలి. ఇలా వ్రాసినచో అది విరోధము దోషము అవుతుంది.
*నిషిద్ధ గణము వాడుట:-* కంద పద్యం లో.. జ గణం బేసి గణము గా వాడ రాదు కదా. 6 వగణము తప్పనిసరిగా జ గణము లేదా నల గణము వ్రాయలికదా, ఆవిధంగా వాడకుంటే అది నిషిద్ద గణం అవుతుంది.
*పదచ్చేద భంగము:-* ద్విపద, మంజరీ ద్విపద లలో ఏ పాదమునకు ఆపాదము విడి విడివిడిగా వ్రాయలి రెండు పాదములు కలుప రాదు
పద్యాలు అందలి రకాలు...,
కం//
విద్యలలోపల నుత్తమ
విద్య కవిత్వంబు మఱి కవిత్వము ఛందో
వేద్యముఁ గావునఁ జెప్పెద
హృద్యంబుగఁ గవిత చందమేర్పడఁ గృష్ణా! (చందోదర్పణము-అనంతామాత్యుడు)
అన్ని విద్యలలోను కవిత్వము ఉత్తమ విద్యయని ఆ కవిత్వము ఛందస్సు వలననే రంజిల్లు తున్నదని అనంతామాత్యుడు చందోదర్పణములో తెలియ చేసినాడు.
🕉️🪷🕉️🪷🕉️
పద్యరచనలకోసం సమస్యలు,దత్తపదులు, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, వర్ణన, పురాణపఠనము మొదలైన అంశాలను ఉద్దండులైన అవధానులైన కవిపండితులకు ఇస్తుంటారు.
వాటిని సభాముఖంగా స్వీకరించిన ఆ అవధానులైన కవిపండితులు సమర్థవంతంగా వివిధఛందస్సులలో పూరిస్తుంటారు.
ఈ అవధానులు ఉద్దండులైనట్లే... అంశాలను అడిగే పృచ్ఛకులు కూడా గొప్పకవులే అయి ఉంటారు.
*ఈ విధంగా అంశాలను అడిగిన పృచ్ఛకులైన కవులుకూడా తామిచ్చిన సమస్య మొదలైన అంశాలకు సంబంధించిన పద్యాలను వ్రాయటం సంప్రదాయం మరియు గౌరవం.*
*ఆ విధంగా పద్యపూరణలను చేయలేనివారు పృచ్ఛకులుగా అనర్హులు.*
*"నారుద్రో రుద్రమర్చయేత్*
అంటే రుద్రుడు కానివాడు రుద్రునికి అర్చన చేయటానికి అనర్హుడు." అందుకే రుద్రార్చనకు ముందు మహాన్యాసం చేసి తనలో రుద్రుని ఆవాహన చేసుకొని తాను రుద్రుడిగా మారటం జరుగుతుంది.
అదేవిధంగా పద్యపూరణలను కవులనుండి కోరేముందు ఆ విధంగా పద్యపూరణలను కోరేవారు కూడా ఛందోరీతులను తెలిసిక కవులై ఉండాలి.
కాకపోయినట్లైతే... వారు కవిపండితులను, ఛందశ్శాస్త్రాన్ని అవమానించినట్లే.