1, డిసెంబర్ 2023, శుక్రవారం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*పాండిత్యమూ..పరామర్శా..*


*(నలభై నాలుగవ రోజు)*


"ఏమయ్యా!..చాలాదూరం నుంచి వచ్చినట్లువున్నారే!..బాగున్నారా?.." అని శ్రీ స్వామివారు ఆ పండితులవారిని అడిగారు..


మొగలిచెర్ల గ్రామం చేరింది మొదలు..తన పాండిత్యం గురించి..దొంగ సాధువుల గురించి..కుహనా యోగుల గురించి..అన్నింటికీ మించి శ్రీధరరావు దంపతుల తెలివి తక్కువ గురించి..అనర్గళంగా మాట్లాడుతూ..శ్రీ స్వామివారిని కలిసి ఆయన లోని విషయపరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని తపన పడుతున్న ఆ పండితుల వారు..శ్రీ స్వామివారిని చూసిన మరుక్షణం నుంచీ..నిర్ఘాంతపోయి వున్నారు..శ్రీ స్వామివారి చల్లని చూపులో ఏదో తెలియని మహత్తు దాగి వుందని ఆయనకు తోచింది..ఆయన శరీరం ఒకానొక జలదరింపుకు గురవడం స్పష్టంగా తెలుస్తోంది.. తనకెదురుగా త్రిమూర్త్యావతారుడు అయిన ఆ దత్తాత్రేయుడు దిగంబరంగా నిలబడి నవ్వుతున్నట్లు అనిపించింది..అప్రయత్నంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేసారు..


శ్రీ స్వామివారు  ఈ ప్రశ్న అడిగి మళ్లీ పాక లోపలికి వెళ్లి మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..ముందుగా మీరాశెట్టి దంపతులు..ఆ తరువాత పండితుల వారు, చివరగా శ్రీధరరావు ప్రభావతి గార్లు పాక లోకి వెళ్లి, శ్రీ స్వామివారి కెదురుగా బల్లల మీద కూర్చున్నారు..


"రేపటి నుంచి ఇంకొక ఇద్దరు ముగ్గురు పని వాళ్ళను ఎక్కువ పెట్టండి మీరాశెట్టీ..పని త్వరగా చేయిద్దాము..ఆశ్రమం తొందరలో పూర్తి కావాలి.." అన్నారు శ్రీ స్వామివారు.."అలాగే స్వామీ.." అన్నారు మీరాశెట్టి..


"చాలా ప్రయాసపడి వచ్చారు..పుట్టెడు సందేహాలతో వచ్చారు..ఇప్పుడు చెప్పండి..ఇంతదూరం నన్ను వెతుక్కుంటూ రావడం దేనికోసం?..పాండిత్యాన్ని నామీద ప్రయోగం చేయడానికేనా?..సరే కానివ్వండి..ఒక్క ప్రశ్న అడుగుతాను..నన్ను తెలుసుకుందామని వచ్చావా?..లేక నిన్ను నువ్వు తెలుసుకుందామని వచ్చావా?".. ఏక వచనం తో సంబోధిస్తూ అడిగారు పండితుని వైపు తిరిగి..


ఆ పండితుడే కాదు, శ్రీధరరావు ప్రభావతి గార్లు కూడా ఆశ్చర్యపోయారు..ఎందుకంటే.. ఈయన మొగలిచెర్ల వచ్చేదాకా ఆ దంపతులకు ఆయన వస్తున్న విషయం తెలీదు..అంతేకాక..తాము స్వామివారి దగ్గరకు ఇప్పుడు వచ్చే సంగతీ తెలియపరచలేదు..ఆయనెవరో శ్రీ స్వామివారికి తెలిసే అవకాశం లేదు..కానీ..శ్రీ స్వామివారు ఒక్క ముక్కలో..ఆ పండితుల వారి మనసులోని మాటను బైటపెట్టేసారు..


శ్రీ స్వామివారు నిశ్చలంగా కూర్చుని చిరునవ్వుతో ఆయన వైపు చూడసాగారు..అప్పటిదాకా శ్రీ స్వామివారి ఎదురుగ్గా కూర్చుని ఉన్న ఆ పండితుల వారు..చప్పున లేచి నిలబడి..రెండు చేతులూ జోడించి..నమస్కారం చేస్తూ.."స్వామీ నన్ను మన్నించండి..అహంకరించాను.." అంటూ..శ్రీ స్వామివారి పాదాలకు తన చేతులు తగలకుండా..కొద్దిగా ఎడంగా ఆనించి..శిరస్సు వంచి నిలబడ్డారు..


శ్రీ స్వామివారు తన కుడి చేత్తో వారి తలపై తాకి..ఆశీర్వదించి.."తెలుసుకోవలసింది చాలా ఉంది..ఇప్పటికైనా సమయం మించిపోలేదు..అహం తొలగించుకుంటే శరణాగతి సాధ్యం అవుతుంది.." అన్నారు..శ్రీధరరావు దంపతుల వైపు తిరిగి.."ఇక్కడకు వచ్చి మంచిపని చేసారు.. పొద్దుపోక ముందే మళ్లీ బైలుదేరండి..శుభం జరుగుతుంది.." అన్నారు.


మీరాశెట్టి దంపతులు తాము కొద్దిసేపు అక్కడవుండి.. పని పురోగతి చూసుకొని రాత్రికి మొగలిచెర్ల వస్తామని చెప్పి..ప్రక్కకు వెళ్లిపోయారు..శ్రీధరరావు ప్రభావతి గార్లు ఆ పండితుల వారు తిరిగి బండిలో కూర్చుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు..


"అమ్మాయీ..నేను తొందరపడ్డానమ్మా..శ్రీధరా..మీరిద్దరూ అదృష్టవంతులు..ఆయన సిద్ధపురుషుడు..సామాన్యుడు కాదు..ఎంత సులభంగా నాకు బోధ చేశారు?..అన్ని అనర్ధాలకూ మూలమైన అహం నిర్మూలించుకోమన్నారు..ఇది నాకు గర్వభంగం కాదమ్మా..నాకు ఉపదేశం..మీరు శరణాగతి చెందారు..అందుకే ఆ మహానుభావుడి సేవ చేసుకునే భాగ్యం కలిగింది..ఆశ్రమం నిర్మిస్తున్న మీరాశెట్టి దంపతులకు ఎంత పుణ్యమో కదా?.." అన్నారు..ఆయన కళ్లనుండి అశ్రువులు ధారగా కారుతున్నాయి..


దారిపొడుగునా శ్రీ స్వామివారి గురించే తలుచుకుంటూ పొంగిపోయారు.. ఆరాత్రి శ్రీధరరావు గారింట్లోనే గడిపి..తెల్లవారి తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు..అంత పెద్ద పండితుడు తమ ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్లడం శ్రీధరరావు ప్రభావతి గార్లకూ సంతోషాన్ని కలుగచేసింది..


సమాధి గది నిర్మాణం....రేపటి భాగం..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: