1, డిసెంబర్ 2023, శుక్రవారం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 17*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*17. తిరునాళైపోవార్ నాయనారు*


 *(నందనార్ చరిత్ర)*


కొళ్లిడం నదీతీరంలో ఉన్న ఒక అందమైన గ్రామం ఆదనూరు. ఈ గ్రామానికి బాహ్యప్రదేశంలోని ఒక దళిత వాడలో నందనారు జన్మించాడు.

పుట్టినప్పటి నుండి పరమేశ్వరుని తిరుచరణాలను సదా ధ్యానిస్తూ వచ్చాడు

నందనారు. ఇతడు శివాలయంలోని భేరీ, మృదంగం మొదలైన

వాయిద్యాలకు కావలసిన చర్మాన్ని, వీణ మొదలైన వాయిద్యాలకు

తంత్రులుగా నరాలను అందిస్తూ ఉండేవాడు. 


ఈ విధంగా స్వామి

కైంకర్యాన్ని చేస్తూ వచ్చిన నందనారు గుడి వాకిలి దాటక అక్కడి నుండే

స్వామిని దర్శిస్తూ, నోరారా స్వామిని గానంచేస్తూ ఆనందించేవాడు.

ఆదనూరుకు సమీపంలో తిరుప్పునూరు అనే గ్రామంలో వెలసిన

పరమేశ్వరుని దర్శించాలనే ఆకాంక్షతో నందనారు అక్కడికి వెళ్లి గుడి

వాకిలి ముందు నిలబడి చూశాడు. కాని నందీశ్వరుడు అడ్డంగా ఉండడం

వలన నందనారుకు స్వామి దర్శనం కలగలేదు. 


స్వామిని దర్శించ

లేకపోయాననే తీవ్రమైన సంతాపంలో నందనారు మునిగిపోయాడు. భక్తుని

ఆవేదనను గుర్తించిన కరుణామూర్తి అయిన శివుడు అడ్డంగా ఉన్న

నందీశ్వరుని పక్కకు తొలగమని ఆజ్ఞాపించాడు. నందనారుకు స్వామిని

నేరుగా దర్శించడానికి వీలయింది.


 ఒక పర్యాయం నాయనారు చిదంబరంలోని నటరాజ స్వామిని దర్శించాలను కున్నాడు. కాని “పవిత్రమైన చిదంబరంలోని శివాలయానికి

నాలాంటి అపవిత్రుడు, నిమ్నకుల సంజాతుడు వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది?” అని తన ప్రయత్నాన్ని విరమించు కున్నాడు.

నందనారు ఒకరోజు చిదంబరం వెళ్లాలని గట్టిగా నిశ్చయం చేసుకొని ఆలస్యం చేయక వెంటనే బయలుదేరాడు. 


చిదంబరం పొలిమేరలు

చేరుకున్నాడు. కాని తన కులాన్ని తలచుకొని చిదంబరం నగరంలోనికి

అడుగుపెట్టకుండా అక్కడే నిలిచాడు. “నేను జన్మించిన ఈ కులం నాకు

అడ్డంకిగా ఉంది” అంటూ చిదంబరానికి వెలుపల ప్రదక్షిణంగా వచ్చాడు.


ఈ విధంగా ఎన్నో రోజులు చిదంబరాన్ని ప్రదక్షిణం చేస్తూ వచ్చిన నందనారుకు పరమేశ్వరుడు ఒకరోజు కలలో కనిపించి "భక్తుడా! నీకు

సంక్రమించిన ఈ నీచకులం తొలగిపోవాలంటే నీవు నిప్పుల్లో నడిచి

తిల్లైలోని బ్రాహ్మణులతో కలసి నాముందుకు రా!" అని చెప్పాడు.


బ్రాహ్మణులు అగ్నిని ప్రజ్వలింపజేశారు. నందనారు సంతోషంతో

పరమేశ్వరునికి చేతులు మోడ్చి నమస్కరించి పవిత్ర పంచాక్షరీ మంత్రాన్ని

పఠిస్తూ అగ్నిగుండంలో ప్రవేశించాడు. కెందామరల నుండి నడిచి వచ్చినట్లు

నందనారు అగ్నిగుండం నుండి బయటకు వచ్చాడు. 


అతని రూపం పూర్తిగా

మారిపోయింది. 'పవిత్రమైన యజ్ఞోపవీతం వేలాడుతుండగా, ముని

వేషధారియై బ్రహ్మదేవుని తలపించేలా, నందనారు కనిపించాడు. తిల్లెలోని

బ్రాహ్మణులందరూ చేతులు మోడ్చి నందనారుకు నమస్కారం చేశారు.


నందనారు మెల్లగా శివాలయంలోనికి ప్రవేశించాడు. నటరాజస్వామి

సన్నిధిలోనికి వెళ్లగానే నందనారు అంతర్ధానమయ్యాడు. కైలాసంలో

ఎల్లప్పుడూ తన సన్నిధిలో ఉండే వరాన్ని నందనారుకు అనుగ్రహించాడు

పరమేశ్వరుడు.


*పదిహేడవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: