1, డిసెంబర్ 2023, శుక్రవారం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


తండ్రి చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించాడు త్రిశంకుడు. తూచ తప్పకుండా పాటిస్తానని

మాటఇచ్చి పాదాభివందనం చేశాడు. మహారాజు వేదపండితులనూ ఋత్విక్కులను ఆహ్వానించి

పట్టాభిషేకానికి త్వరత్వరగా ఏర్పాట్లు అన్నీ చేయించాడు. సర్వతీర్థాలనుంచీ పవిత్రోదకాలను రప్పించాడు.

ప్రజలను ఆహ్వానించాడు. సామంతులను పిలిపించాడు. మంచిరోజున శుభముహూర్తాన అభిషేకించి

త్రిశంకుడికి సింహాసనం అప్పగించాడు. తాను భార్యాసహితుడై వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. గంగాతీరంలో చాలాకాలం తీవ్ర తపప్పుచేపి దంపతులిద్దరూ దివంగతులయ్యారు. దేవపూజితులయ్యారు. అరుణుడు

స్వర్గంలో ఇంద్రాసనానికి అత్యంత సమీపాన కూర్చుంటూ అరుణుడిలా వెలిగిపోయాడు.

ఆదిపరాశక్తి అనుగ్రహంవల్ల పిశాచత్వం వదిలిపోయి సుందరాకారుడై సత్యవ్రతుడు అయోధ్య కు

పట్టాభిషిక్తుడైన ఈ శుభవార్త తెలిసి వసిష్ఠుడూ సంతోషించాడు. తానిచ్చిన శాపాన్ని అమ్మవారు తొలగించిందికదా అని ప్రసన్నుడు అయ్యాడు.

సత్యవ్రతుడు సనాతనధర్మమార్గంలో రాజ్యాన్ని పాలిస్తూ దేవీమహాయజ్ఞాలను అనేకం

నిర్వహించాడు. ఇతడికి హరిశ్చంద్రుడనే కుమారుడు జన్మించాడు. సుందరాకారుడు. శుభలక్షణ

సమన్వితుడు. అతడిని యువరాజును చేసిన త్రిశంకుడు మానుషశరీరంతో స్వర్గానికి వెళ్ళాలని భావించాడు.

వసిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు.

కామెంట్‌లు లేవు: