3, డిసెంబర్ 2023, ఆదివారం

 *మనో నేత్రాలు..*


దాదాపు నాలుగు సంవత్సరాల కాలం క్రితం..


"వాట్సాప్ లో గురుచరణ్ అనే గ్రూప్ ను నిర్వహిస్తున్నాము..మీరు ఇతర గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్న మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుభవాలు..లీలలు..ఈ గ్రూప్ లో కూడా పోస్ట్ చేయండి..నా పేరు నందకిశోర్..నేను ఆ గ్రూప్ అడ్మిన్ గా వున్నాను..మీకు లింక్ పంపుతాను.." అన్నారు..సరేనండీ అన్నాను..అదేవిధంగా ఆ గ్రూప్ లో చేరాను..ఆ తరువాత శ్రీ నందకిశోర్ గారు మళ్లీ నాతో మాట్లాడుతూ.."ఈ గ్రూప్ లో ఎక్కువ మందిమి అంధత్వం కారణంగా చదవలేని వాళ్ళము..మీకు వీలుంటే ఆడియో రూపం లో పెట్టగలరా..?" అన్నారు..ఒకింత ఆశ్చర్యం వేసింది..ఖమ్మం లో నివాసం ఉంటున్న శ్రీమతి జీవని గారు..మొగిలిచెర్ల స్వామివారి జీవితచరిత్రను ఆడియో రూపం లో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు..వారిని సంప్రదించి..వారిని ఈ గ్రూప్ లో చేరమని అడిగాను..వారూ ఈ గ్రూప్ లో చేరి..ఆడియో రూపం లో శ్రీ స్వామివారి చరిత్రను పోస్ట్ చేశారు..అంతే కాకుండా..మా తల్లిగారు వ్రాసిన శ్రీ శిరిడీ సాయినాథ భాగవతాన్ని కూడా ఆడియో రూపం లో జీవని గారు పోస్ట్ చేశారు..అలా గురుచరణ్ అనే సమూహములో సభ్యుడిగా మారి..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను, లీలలను ఆ గ్రూప్ సభ్యులకు చేరవేయడం ఇన్నాళ్లూ జరుగుతున్నది..


ఇలా ఉండగా ఒక నాలుగైదు నెలల క్రితం.."అంకుల్..నేను నందకిశోర్ ను మాట్లాడుతున్నాను..వచ్చే శనివారం నేనూ..మా స్నేహితుడూ ఇద్దరం కలిసి..మొగిలిచెర్ల వచ్చి..స్వామివారిని దర్శించుకుందాము అనుకుంటున్నాము..మీతో ముందుగా తెలియచేస్తున్నాను.." అన్నారు..నందకిశోర్ గారు తనకు సరిగా కళ్ళు కనబడవు అని చెప్పి వున్నారు కదా..మరి ఎలా వస్తున్నారో..అనే సందేహం కలిగింది..వస్తానని చెప్పారు కదా..వేచి చూద్దాం..అనుకున్నాను..


ఆ ప్రక్క శనివారం ఉదయం తొమ్మిదిన్నరకు స్వామివారి మందిరం వద్దకు వచ్చే బస్సు లో నందకిశోర్ గారు..వారి స్నేహితుడు..వీళ్ళిద్దరికీ తోడుగా మరో పదిహేనేళ్ల కుర్రవాడు దిగారు..నందకిశోర్ గారు, వారి స్నేహితుడు పూర్తిగా అంధులు..స్వామివారి మందిరం లోపలికి వచ్చి..నేను ఎక్కడ వుంటానో విచారించి..ఆ పిల్లవాడి సహాయంతో నా వద్దకు నడచి వచ్చారు..నేను నందకిశోర్ గారిని..వారి స్నేహితుడిని చూసి..పూర్తి ఆశ్చర్యం లో మునిగిపోయి వున్నాను.."ప్రయాణం బాగా జరిగిందా.." అని మాత్రం అడిగాను.."నిన్నరాత్రి నేను హైదరాబాద్ లో బస్సు ఎక్కాను అంకుల్..ఒంగోలు లో నా స్నేహితుడు..మా ఇద్దరికీ తోడుగా ఈ పిల్లవాడు కలిశారు..ముగ్గురం కలిసి వచ్చాము..మీ పోస్టుల ద్వారా ఈ స్వామివారి లీలలు తెలుసుకుంటున్నాము..ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్లాలని బలంగా అనిపించింది..ఈరోజు వస్తే..స్వామివారి పల్లకీసేవ కూడా వుంటుంది అని విన్నాను..అందులో కూడా పాల్గొని..రేపు ఉదయం స్వామివారి సమాధి వద్దకు వెళ్లి వస్తాము.." అన్నారు..


స్వామివారి పల్లకీసేవ..స్వామివారి సమాధి..ఈ రెండూ కళ్ళతో చూసి అనుభూతి చెందడం అందరికీ సాధ్యమయ్యే పని..మరి నందకిశోర్ గారు..వారి స్నేహితుడూ ఎలా దర్శించుకుందామని అనుకుంటున్నారో..అని అనిపించింది..ఆరోజు సాయంత్రం స్వామివారి పల్లకీసేవ వద్ద ఆ ఇద్దరూ భక్తి శ్రద్ధలతో కూర్చున్నారు...వాళ్ళిద్దరినీ బాగా గమనిస్తూనే వున్నాను..బాహ్య దృష్టి లేకపోయినా..మనో నేత్రం తో తనను దర్శించే భాగ్యాన్ని వారికి కల్పించాడమో ఆ స్వామివారు అని మా దంపతులము అనుకున్నాము..పల్లకీసేవ తరువాత..నా వద్దకు వచ్చి.."చాలా బాగా జరిగింది అంకుల్.." అని చెప్పారు..


ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం ఐదు గంటలకే ఆ ఇద్దరూ తయారయ్యి మందిరం లోకి వచ్చారు..స్వామివారి ప్రభాతసేవ లో జరిగే విశేష హారతుల అనంతరం..తమ సహాయకుడిని తీసుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..దర్శించుకొని వచ్చారు..నిజమే..వాళ్లిద్దరూ స్వామివారి సమాధిని ముట్టుకొని...నమస్కారం చేసుకొని..తమ అంతర్దృష్టి తో దర్శించి..తృప్తిగా ఇవతలకు వచ్చారు...వారి అంధత్వం వారికి అడ్డురాలేదు..మాకు ఆశ్చర్యం తో నోట మాట కూడా రావడం ఆగిపోయింది..


ఈ మొత్తం తతంగం చూస్తూ ఉన్న మా దంపతులకు..మా సిబ్బందికి ఒక విషయం బాగా అర్ధమయింది..స్వామివారి మీద ఎనలేని భక్తి ఉంటే..వారికి చూపు లేకపోయినా..ఆయన వారికి తన దర్శనభాగ్యాన్ని కలిగిస్తారు..చూపు చక్కగా ఉండికూడా..కొందరు దైవాన్ని చూడలేరు..కానీ దైవం తలుచుకుంటే..అంధులు సైతం దైవాన్ని దర్శించే అదృష్టానికి నోచుకుంటారు..అనే విషయాన్ని మా కళ్ళకు కట్టినట్లుగా స్వామివారు సోదాహరణంగా చూపించారు..


మరి కొద్దిసేపటి తరువాత..నందకిశోర్ గారు నావద్దకు వచ్చి.."అంకుల్..మళ్లీ అతి త్వరలో స్వామివారి దర్శనానికి వస్తాము..మీ సహకారం మరువలేనిది.." అని చెపుతుంటే..ఆ భక్తిపరుడి వినయపు మాటలకు కళ్ళకు నీళ్లు వచ్చాయి.."అలాగే తప్పకుండా రండి..మీరు వచ్చేముందు తెలియచేయండి.." అని మాత్రం అనగలిగాను..


శ్రీ నందకిశోర్ గారికి మరలా స్వామివారు ఎప్పుడు తన దర్శనాన్ని కలిగిస్తారో అని నేను కూడా ఎదురుచూస్తూ వున్నాను..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..99089 73699 & 94402 66380).

కామెంట్‌లు లేవు: