3, డిసెంబర్ 2023, ఆదివారం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 19*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

 *19. చండేశ్వర నాయనారు*


నీయంజలూరు అనే గ్రామంలో ఎచ్చ దత్తన్, పవిత్ర అనే దంపతులు

శైవ సంప్రదాయాన్ని అనుసరిస్తూ జీవనం సాగిస్తూ వచ్చారు. పరమేశ్వరుని

అనుగ్రహం వలన వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు విచార శర్మ.


శివభక్తుడైన విచారశర్మ పశువులను మేపడమే పవిత్ర కార్యంగా నిర్వహిస్తూ వచ్చాడు. చేతిలో ఒక పొడవాటి కర్రను ధరించి పశువులను

పచ్చిక అధికంగా ఉన్న ప్రాంతాలకు తీసుకువెళ్లి మేపుతుండేవాడు. దీని

కారణంగా పశువులు ఆరోగ్యంగానూ, బలిష్టంగానూ ఉండేవి. పాలను

కూడ అధికంగా ఇవ్వసాగాయి. 


ఊరివారు కూడ దీనిని చూసి

సంతోషించారు. ఇంట్లోనున్న దూడలను ఎడబాసిన ఆవులు విచారశర్మ తమదగ్గరికి రాగానే పాలుపిండకనే యధేచ్ఛగా పాలను స్రవించసాగాయి.

ఈ పాలు ఇలా వృధాగా నేలపాలు కావడం కన్న శివునికి అభిషేకంగా

ఉపయోగిస్తే మంచిదని విచారశర్మ అనుకున్నాడు.


 శివుని కోసం ఒక ఆలయం నిర్మించాలని అనుకొని మణ్ణినదీ తీరంలోని అత్తివృక్షం కింద ఇసుకతో శివలింగాన్ని నిర్మించాడు. ఒక్కొక్క

ఆవు పొదుగులోని నాలుగు కాడలలో ఒకదానిని మాత్రం తడమగా దాని

నుండి పాలు సమృద్ధిగా కురిసింది. వాటిని కడవలలో నింపుకొని

శివలింగానికి అభిషేకం చేశాడు. పరమేశ్వరుడు అతనిభక్తికి సంప్రీతుడై

క్షీరాభిషేకాన్ని సంతోషంగా స్వీకరించాడు. 


పశువులు తామే వచ్చి పూజకు కావలసిన పాలను ఇవ్వసాగాయి. మొదట ఒక వేడుకగా ప్రారంభించిన

ఈ పూజ రోజూ చేసే నిత్య పూజగా మారింది.

విచారశర్మ చేస్తున్న ఈపూజలను చూసి వాస్తవం తెలియని ఒకడు

ఆ ఊరిపెద్దల దగ్గరికి వెళ్లి వారితో విచారశర్మ మన ఊరి ఆవుల నుండి

పాలను తీసి వాటిని ఇసుకలో పోస్తున్నాడు" అని ఫిర్యాదు చేశాడు.


ఊరిపెద్దలు విచారశర్మ తండ్రిగారిని విచారణసభకు పిలిపించారు. జరిగిన

విషయం అతనికి తెలియజేశారు. ఎచ్చదత్తన్ సభవారికి నమస్కరించి

"పెద్దలారా! ఈ విషయం నాకింతవరకు తెలియదు. ఈ ఒక్క తప్పును

క్షమించండి. ఇకమీదట ఈవిధంగా జరక్కుండా నేను చూస్తాను" అని

చెప్పి ఇంటికి వెళ్లాడు. రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు. 


సభలోని వారు

చేసిన అభియోగాన్ని తలచుకుంటూ ఉన్నాడు. ఈ అభియోగంలోని

సత్యాసత్యాలను తానే స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని నిశ్చయం

చేసుకున్నాడు. ఉదయం యధాప్రకారం పశువులను తోలుకొని వెళ్తున్న

విచారశర్మను అతనికి తెలియకుండా రహస్యంగా వెంబడించాడు. విచారశర్మ

మెల్లగా మణినదీ తీరాన్ని సమీపించాడు. 


అక్కడి అత్తి చెట్టు సమీపంలో

పశువులను మేయడానికి వదిలాడు. తాను నదిలో స్నానంచేసి అత్తిచెట్టుకింద

ఇసుకలో శివలింగాన్ని నిర్మించాడు.  పశువుల పొదుగులోని ఒక్క కాడనుండి తీసిన పాలను కడవల్లో నింపుకొని ఆపాలతో శివలింగానికి భక్తితో అభిషేకం

చేయడం ప్రారంభించాడు. 


తన కుమారుడు చేస్తున్న తతంగమంతా

ఎచ్చదత్తన్ చూశాడు. మితిలేని కోపంతో తనచేతిలో ఉన్న కర్రతో విచారశర్మ

వీపుపై బలంగా కొట్టాడు. కాని భక్తి పారవశ్యంతో పూజచేస్తున్న విచారశర్మకు

తన తండ్రి కొట్టిన దెబ్బలుకాని, తిట్టిన తిట్లుగాని వినిపించలేదు. 


ఎచ్చదత్తన్త న కోపాన్ని ఆపుకోలేక పోయాడు. పరమేశ్వరుని అభిషేకానికై కడవలో ఉంచిన పాలను తన కాలితో తన్ని తోసివేశాడు. అప్పుడు విచారశర్మలో

చైతన్యం కలిగింది. అభిషేకానికై ఉంచిన పాలను నెట్టి వేసినది ఎవరని

చూశాడు. పాలను ఎవరైతే కింద తోసివేశారో వాళ్లు ఎవరైనప్పటికీ వాళ్ల

కాళ్లను నరకాలని నిశ్చయం చేసుకున్నాడు. 


తన చేతిలో ఉన్న కర్ర

గండ్రగొడ్డలిగా మారగా దానితో తండ్రిగారి కాళ్లను నరికివేశాడు. ఎచ్చదత్తన్

నేలమీదికి వాలిపోయాడు. శివపూజకు కలిగిన అంతరాయం

తీరిపోయిందనే సంతోషంతో విచారశర్మ మళ్లీ పూజలో నిమగ్నమైపోయాడు.


విచారశర్మ అచంచలమైన శివభక్తికి పరవశుడైన పరమేశ్వరుడు పార్వతీ

సమేతుడై, విచారశర్మ ముందు ప్రత్యక్షమయ్యాడు.

తనకు చేతులు మోడ్చి భక్తితో నమస్కరించిన విచారశర్మతో "భక్తుడా! నాకోసం నీవు నీ తండ్రిగారి కాళ్లను నరికావు. 


ఇక నీకు మేమే తండ్రి

మేము ధరించిన ఆభరణాలనే నీవూ ధరించి శివగణాలకు నాయకుడవై,

చండేశ్వర బిరుదముతో విరాజిల్లు" అని పరమేశ్వరుడు చెప్పి విచారశర్మను

ఆలింగనం చేసుకున్నాడు. పరమేశ్వరుని స్పర్శమాత్రం చేతనే విచారశర్మ

మాయాశరీరం తొలగిపోయి శివుని దివ్యజ్యోతిలో ఐక్యమైపోయింది.


*పంతొమ్మిదవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: