22, ఏప్రిల్ 2024, సోమవారం

గ్రామదేవతా

 *గ్రామదేవతా నామ విశేషాలు:*


మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది.


*1*. ఊరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి *"పొలిమేరమ్మ"* క్రమముగా *"పోలేరమ్మ"* అయింది.


*2*. *'ఎల్ల'* అంటే సరిహద్దు అని అర్దము. అందుకే *'ఎల్లమ్మ'* కూడా ఈ పనిని చేసేదన్నమాట.


*3*. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి *'పోచ+అమ్మ=పోచమ్మ'* అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, *'పోచమ్మ'* పోషణ కలిగిస్తుంది.


*4*. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే *'కట్టమేయ+అమ్మ=కట్టమేసేయమ్మ'* - కాలక్రమములో *"కట్టమైసమ్మ"* అయింది.


*5*. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని) *'సు+అచ్చ=స్వచ్ఛ'* అనే రెండు పదాలు కలిపి *"అచ్చమ్మ"* గా అయ్యింది. 


*6*. సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. *'మా వూళ్ళన్నింటికీ అమ్మ'* అనే అర్దములో ఆమెను *"మావూళ్ళమ్మ"* అని పిలుస్తూంటే క్రమముగా అది *"మావుళ్ళమ్మ"* అయింది.


*7*. ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కె ఏదైనా అది మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి *"తలుపులమ్మ"*. *'తలపు'* అంటే ఆలోచన. ఆ తలపులను తీర్చే తల్లి *"తలపులమ్మ"* క్రమముగా ఈమె *"తలుపులమ్మ"* గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.


*8*. శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా *"అంకగళమ్మ"*, *"అంకాళమ్మ"* గా మారిపోయింది.


*9*. పొలిమేరలో వుండే మరొక తల్లి *"శీతలాంబ"*. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.


*10*. పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి *"పుట్టమ్మ"*. ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే *"నాగేశ్వరమ్మ"* అని కూడా అంటారు. *'పాప (అంటే పాము)+అమ్మ=పాపమ్మ'* అవుతుంది కాబట్టి ఈ తల్లికి *"పాపమ్మ"* అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే *"సుబ్బ+అమ్మ = సుబ్బమ్మ"* కూడా దైవముగా ఉంది.


*11*. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటలనూ ఇచ్చే తల్లి *"బతుకమ్మ"*.


*12*. గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ *"కన్నమ్మ"* గా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి *'సత్య+అమ్మ= సత్తెమ్మ'*.


*13*. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ *"పుల్లమ్మ"*. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.


*14*. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి *'అర్పణ+అమ్మ = అర్పణలమ్మ'* క్రమముగా *"అప్పలమ్మ"* అయినది.


*15*. బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు *'అప్పాల+అమ్మ= అప్పలమ్మ'* అన్నారు.


*16*. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ *'పెంటి (బాల)+అమ్మ= పెంటమ్మ'*.


*17*. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో *'బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ= బోనాలమ్మ'*.


*18*. అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను *"అయ్యమ్మ"* ని కొన్ని చోట్ల పిలుస్తారు.


*19*. లలితాంబ భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి *'గుర్రాల+అమ్మ= గుర్రాలమ్మ'* అయినది.


*20*. ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. *'సోమప్రోలు+అంబ=సోమపోలమాంబ'* అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.


*21*. సీతాదేవి వనవాసం చేసిన సమయంలో గౌతమీ నదిలో స్నానం చేసి వనదేవతలను పూజించగా ఆమె ప్రత్యక్షమైనదని అప్పటినుంచి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుందని ప్రసిద్ధికెక్కిన తల్లి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి అనే గ్రామంలో ఉన్న *"పళ్ళాలమ్మ"* లేక *"పళ్లమాంబిక"*. ఇక్కడ వెలసిన అమ్మవారిని ఈ గ్రామస్తులు కాళికా దేవి అవతారంగా భావించి పూజిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు కాలుపై కాలు వేసుకుని భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారి పాదాల కింద నక్కను తొక్కి ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాలలో ఈ అమ్మవారి విగ్రహం ఉండడం విశేషం...


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: