🙏గ్రాంధిక వ్యావహారిక ఉద్యమం 🙏
గిడుగు వారి సారధ్యంలో వ్యావహారికభాషోద్యమం ఒక స్థాయికి చేరిన సమయంలో కవులు రచయితలు రెండుగా చీలిపోయారు.గ్రాంథిక భాషవైపు వేదం వారు,కొక్కొండ వెంకటరత్నంగారు, మొదట తిరుపతి వెంకట కవులు, జయంతి రామయ్య పంతులు.ముఖ్యలు.
చివరకు తిరుపతి వెంకట కవులు వ్యవహారికం లో రచనలు చేశారు ఈ ఉద్యమం గురించి ఈ వ్యాసంలో చూద్దాము.
1907లో జె.ఎ.యేట్స్ (J. A. Yates) అనే ఇంగ్లీషుదొర ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆ దొరకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలున్నాయి అన్నది అతని ముఖ్య సమస్య. అంతకు ముందు తమిళదేశంలోనూ అదే సమస్య అతనిని వేధించింది. విశాఖపట్నంలో మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి దీనికి సమాధానం చెబుతారని అన్నాడు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది.
1906 నుండి 1940 వరకు గిడుగు రామమూర్తి కృషి అంతా తెలుగు భాషా సేవకే. యేట్స్ ప్రోత్సాహంతో శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికి అత్యంత కృషి చేసి కృతకృత్యుడయ్యాడు. కందుకూరి వీరేశలింగం పంతులు మద్దతు ఇతనికి లభించింది.
ఆంధ్ర సాహిత్య నిర్మాణానికి విశేషకృషి చేసిన మేధావుల్లో ప్రముఖుడు జయంతి రామయ్య పంతులు.
1860 లో ముక్తేశ్వరంలో పుట్టిన ఈయన సంస్కృతాంధ్రాల్లో ఇంటనే పాండిత్యం గడించాడు. బి.ఏ.బిల్. చదివి ఇంగ్లీషు లోనూ అపార పాండిత్యం సంపాదించాడు.
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక తెలుగుకు చేసిన సేవ అపారం.
సూర్యారాయాంధ్ర నిఘంటు నిర్మాణ ప్రణాళిక ఆయన ఆలోచన ఫలితమే.
శాసనాలు చదవడంలోనూ చక్కని నైపుణ్యం కలిగిన ఆయన కొన్ని శాసనాలు సంపాదించాడు.. శాసన పద్య మంజరి రెండు వాల్యూములుగా ప్రకటించాడు.
ఈయన గిడుగువారి వ్యావహారిక భాషా వాదానికి దీటుగా గ్రాంథిక వాదానికి నాయకత్వం వహించాడు.
. ఒకరికొకరికి వైరుధ్యాలున్నా వేదం వేంకట రాయ శాస్త్రి, వావిలికొలను సుబ్బారావు గూడా గ్రాంథిక వాదాన్ని బలపరిచిన వారిలో ముఖ్యులు
(నాటకాలలో పాత్రోచిత భాష వేదం మొదటినుండీ అనుసరించినది. దీనికి జయంతి, వావిలికొలను ఇద్దరూ వ్యతిరేకులే.)
జయంతి రామయ్య పంతులు భవ భూతి ఉత్తర రామచరిత్ర నాటకాన్ని గ్రాంథిక భాషలో అనువదించాడు. ఏకో రసః కరుణ ఏవ …శ్లోకం లో భవభూతి స్పష్టంగా తన నాటకంలో కరుణ ప్రధాన రసమని నిర్ధారణ చేశాడని అదే సరైన వాదమని దాని పీఠికలో వ్రాశాడు.
వేదం వేంకట రాయ శాస్త్రి గూడా ఆ నాటకం అనువదించాడు. దాని సుదీర్ఘ పీఠిక లో అది విప్రలంభ ప్రధాన నాటకమని సిద్ధాంతం చేశాడు.
సూర్యారాయాంధ్ర నిఘంటు రచన ఒక బృహత్ ప్రణాళిక. దానికీ మొట్టమొదటి(1916లో) ప్రధాన సంపాదకుడు వేదం వారే. .అపుడు మదరాసు దాని ప్రధాన కార్యాలయం. కానీ , ఏ కారణాల వల్లనో ఒక సంవత్సరానికే ఆయనను దానినుంచి తప్పించారు. ఆయనకు నెలకు 150 రూపాయల జీతమూ, గ్రంథ పద సేకరణకు తాళ పత్ర గ్రంథాలయాలలో గ్రంథాలు కాపీచేయడానికి ఇద్దరు ముగ్గురు పండితులను చేర్చుకొనే అవకాశమూ ఇస్తామని ముందు అంగీకరించినా దాని నిర్వాహకులు, సక్రమంగా, సహకరించ లేదు.
వెంకటగిరి రాజా రాజగోపాలకృష్ణ కు వేదంవారిపై అపార గౌరవం. రాజా గారి మృతి గూడా దీనికొక కారణం.
తర్వాత కాకినాడలో 1919 లో తిరిగి నిఘంటు నిర్మాణ కార్యం ప్రారంభించారు. జయంతి రామయ్య పంతులు పర్యవేక్షణ లోనే ఆంధ్ర సాహిత్య పరిషత్తు నడిచేది . ఈయన 1936 లో కొన్ని సంపుటాలు పూర్తి అయి విడుదల చేశారు.1941లో కన్నుమూశారు.
గ్రాంథిక భాషావాదుల వాదన
అనాగరిక భాష వంటి వాడుక భాష ఉత్తమమైన సాహిత్య రచనకి పనికిరాదు.
వాడుక భాష మాట్లాడడం వరకే పరిమితం అది గ్రామ్యభాష.
వాడుక భాష ఒక లక్షణం గానీ, వ్యవస్థ గానీ లేనిది.
వ్యావహారిక భాషావ్యాప్తి వలన ప్రాచీనమైన కావ్యాలకు, వ్యాకరణాలకు నష్టం కలుగుతుంది. మన సాహిత్య సంపద అనాథ అవుతుంది.
వాడుక భాషలో అనేక భేదాలున్నాయి. మాండలికాలు ఉన్నాయి. ఒక మాండలిక భాష వేరొక ప్రాంతం వారికి అర్థం కాదు. పాఠ్యగ్రంథాలు, సాహిత్యం ఏ మాండలికంలో రాయాలి? ఎవరికి ఇష్టమైన భాషలో వారు రాసుకుంటే తెలుగు భాషా సమైక్యతకి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి తెలుగు భాషను పరిరక్షించడానికి గ్రాంథిక భాషే మంచిది.
నన్నయ నుండి నేటి వరకు గ్రాంథిక భాష మారలేదు. దానికి ఏకరూపత, ప్రామాణికత ఉన్నాయి.
వ్యాకరణ బద్ధం కాని ప్రామాణికత లేని వాడుక భాషలో సార్వకాలిక సాహిత్యరచన వీలుకాదు.
శాస్త్ర గ్రంథాలను అవసరమైతే సరళ గ్రాంథికంలో రచించవచ్చును.
వ్యావహారిక భాషావాదుల అభిప్రాయాలు
వాడుక భాష గ్రామ్యభాష కాదు. సజీవ భాష.
వ్యావహారిక భాషకు లక్షణాలు, వ్యాకరణం లేవన్నారు. గ్రాంథిక భాషకి కూడా పూర్తిగా వ్యాకరణాలు లేవు.
తెలుగు భాష మారుతోంది. కాబట్టి కొత్తవ్యాకరణాలు, సవరణలు వెలువడ్డాయి. నన్నయ భాషకి, తిక్కన భాషకి, ప్రబంధ బాషకి, దక్షిణాంధ్ర యుగం నాటి భాషకి చాలా భేదాలున్నాయి.
వ్యావహారిక భాషావాదం ప్రాచీన సాహిత్యానికి వ్యతిరేకంగా ఏర్పడలేదు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే వాడుక భాషకి ప్రాచుర్యం కల్పించాలి.
వాడుక భాషలో కూడా ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించవచ్చును. ఉదాహరణ: గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం.
గ్రాంథికభాష పండితులకే అర్థం కాదు. గొప్ప పండితులు కూడా తప్పులు లేకుండా రాయలేరు. మరి ఇతరులు ఎలా రాయగలరు.
వాడుక భాషలో భేదాలున్నాయి. అయితే అందరూ కలిసి కోస్తా మాండాలికాన్నే వాడుతున్నారు. కాబట్టి కోస్తా మాండలిక ఆంధ్రమే అనుసంధాన భాషగా ఉంటుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విజ్ఞానం పెంపొందించుకోవాలంటే పాఠ్యగ్రంథాలు వాడుక భాషలోనే ఉండాలి.
వాడుక భాష ప్రజల భాష. గ్రాంథిక భాష పండితులు
గురజాడ గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కము నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు (కచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కము, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కము తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చారు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కము రెండవ కూర్పును 1909లో రచించారు.
1892 లో గురజాడ వారి కన్యాశుల్కము నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. దీని విజయంతో, అప్పారావు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళికి అతని చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి ముఖ్యుడు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించడంతో అప్పారావుకు ఎంతో పేరు వచ్చింది. 1896 లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1897 లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు ప్రచురించారు. అప్పారావు దీన్ని మహారాజా ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం తిరగ రాసారు. 1910 లో రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది.
గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారిక భాషా వ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. ఆ విన్నపంలోని చివరిమాటలు -"దేశభాష ద్వారా విద్య బోధిస్తే కాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస? స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి