సాధన పరమార్థం
మనసు ప్రపంచాన్ని ఆశ్రయించినంత కాలం మనిషికి జీవితంలో హెచ్చుతగ్గులు, ఒడుదొడుకులు తప్పవు. మనిషికి మరణభీతి ఎక్కువ! లోకంలో ఎందరో శరీరాన్ని వీడుతున్న ఘట్టాలను చూస్తున్నప్పటికీ తాను సైతం అలా ఒకరోజు దేహత్యాగం చేయాల్సి ఉంటుందన్న నిజాన్ని స్వీకరించలేడు. చనిపోయేదాకా తాను శాశ్వతుణ్నే అన్న భ్రమతో జీవిస్తాడు. అందుకే ఆఖరి నిమిషం దాకా అతణ్ని భవసాగరం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రాపంచిక ఆకర్షణల వలయం చుట్టుముట్టి వేధిస్తుంది.
ఆత్మ శాశ్వతమైంది కాబట్టి, దాని వాసన ప్రభావంతో శరీరం సైతం శాశ్వతమైనదే నని మనిషి చివరి వరకు భ్రమిస్తాడు. శ్మశాన వైరాగ్యం కలిగినా, అంతరాత్మ నిరం తరం వారిస్తున్నా దైనందిన జీవితంలో చెడ్డపనులు చేయడం మాత్రం మానడు.
దైవప్రేరితంగా మానవ జీవితం అనుక్షణం అంతర్గత సాధనలో మునిగి ఉంటుంది. తాను గ్రహించినా, గ్రహించకపోయినా మనిషి జీవితం ప్రతి క్షణం సాధనలో భాగంగానే సాగుతుందంటారు విజ్ఞులు.
మనిషి సాధనను పరిపూర్ణం చేసు కోవడంలో ప్రకృతి అనుసరించే విధానాన్ని పరిశీలించవచ్చు. సృష్టి ప్రారంభం నుంచి సూర్యుడు ప్రతిదినం ఉదయిస్తూనే ఉన్నాడు. ప్రతిసాయంత్రం అస్తమిస్తూనే ఉన్నాడు. గాలి వీస్తూనే ఉంది. అగ్ని దహిస్తూనే ఉంది. నీరు దాహార్తిని తీరుస్తూనే ఉంది. ఆకాశం విశాల దృక్పథాన్ని చాటుతూనే ఉంది. ధరిత్రి సహన గుణాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ప్రకృతిని అను సరించి మనిషి నేర్చుకోవాల్సిన సద్గుణాల్లో ఇంతకన్నా గొప్పవి మరేముంటాయి?
ఒక పని ప్రారంభించాల్సి ఉన్నప్పుడు-మొదట దానికి ఉపక్రమిస్తే సగం కార్యం పూర్తయినట్లే అంటారు. మిగతా సగం పూర్తి చేయడానికి శ్రద్ధ, సహనం, నైపుణ్యం ఇత్యాది సద్గుణాలు కావాలి. అవి కార్యసిద్ధికి తోడ్పడ తాయి. ఒక పని కష్టమైందని భావించి ఉపక్రమించకపోవడం పెద్దతప్పు
ఆత్మజ్ఞానం కలిగిన ప్రతి మనిషికి ఏది మంచో ఏది చెడో తెలుసు. చెడ్డ పనులు చేయకుండా మనసును నిగ్రహించుకోవాలి. అలా చేయకపోతే అలవాటుగా మారి ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుంది. మంచి పనుల విషయంలో మనిషి అందుకు భిన్నంగా వ్యవహరించాలి. చేయగా చేయగా మంచి పనులు అలవాటుగా మారి జీవితాన్ని నందనవనం చేస్తాయి.
చూసే ప్రతి ప్రాణిలో వేసే ప్రతి అడుగులో దైవాన్ని దర్శించే ప్రతిభ మనిషికి సాధనవల్ల లభిస్తుంది. మంచి ప్రవర్తన వల్ల లభించే ఆనందం జీవితాన్ని పరి పూర్ణం చేస్తుంది. ప్రతిక్షణం పెల్లుబికే మంచి భావనలు అతడి జీవితాన్ని ప్రకాశ మానం చేస్తాయి. ఆధ్యాత్మికత కేవలం దైవారాధన చేసే ఒక మార్గం కాదు. మనిషి ఆనందంగా జీవించడానికి అవసరమైన మానసిక స్థైర్యాన్నిచ్చే గొప్ప కళ. మంచి మార్గంలో నడుస్తూ తనపట్ల తాను ప్రసన్నుడై జీవించే వ్యక్తి సదా ఆనందభరితుడై ఉంటాడు. అతడితో కలిసి జీవించేవారు సైతం సంతోషంగా ఉంటారు. ఎదుటి వారు తన కారణంగా ఆనందంతో జీవించగలిగితే అందుకు బాధ్యుడైన వ్యక్తి సాధన పరమార్థాన్ని సాధించినట్లే!
గోపాలుని రఘుపతిరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి