5, మార్చి 2025, బుధవారం

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(66వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*పరశురాముడు - శ్రీ రాముడు,*

           *విశ్వామిత్రుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శివధనుస్సును విరచి సీతను వివాహం చేసుకున్నాడు శ్రీరాముడు. భార్యతో సహా అయోధ్యకు బయల్దేరాడు. ఈ సంగతి తెలుసుకున్నాడు పరశురాముడు. తన దైవం శివుని ధనుస్సును శ్రీరాముడు విరవడాన్ని తట్టుకోలేకపోయాడు. అవమానంగా భావించాడు.*


*శ్రీరాముణ్ణి ఎదుర్కొన్నాడు. తన కుమారుణ్ణి కాపాడమని దశరథుడు ఎంతగా కాళ్ళా వేళ్ళాబడినా కనికరించలేదు పరశురాముడు. కోపంతో కళ్ళెర్రజేసి అన్నాడిలా. ‘‘చూడబోతే బాలుడవు, నువ్వా శివధనుస్సును ఎక్కుపెట్టి విరిచింది! ఏదీ నా ధనుస్సును ఎక్కుపెట్టు చూద్దాం. నీ బలం, ధైర్యం తెలిసిపోతాయి.’’*


*తన ధనుస్సును శ్రీరాముడికి అందజేశాడు పరశురాముడు. అతని ధనుస్సును అవలీలగా ఎక్కుపెట్టాడు శ్రీరాముడు. దానితో పాటు పరశురాముని తేజస్సును కూడా హరించాడతను. అప్పుడు శ్రీరాముడు, సాక్షాత్తూ విష్ణుమూర్తిని గ్రహించాడు పరశురాముడు. నమస్కరించాడతనికి. శాంతచిత్తుడై మహేంద్రపర్వతం మీదికి తరలిపోయాడు. క్షత్రియులకు సింహస్వప్నం, బ్రాహ్మణపక్షపాతి పరశురాముడు చిరంజీవి. రానున్న మన్వంతరంలో అతను సప్తర్షులలో ఒకడు కాగలడు.*


*విశ్వామిత్రుడు:~*


*గాధిరాజు కుమారుడయిన విశ్వామిత్రుడు, అనేక సంవత్సరాలపాటు రాజ్యపాలన చేశాడు. క్షత్రియుడు అయినప్పటికీ తపోబలంతో బ్రాహ్మణ్యం సాధించాడు. మహర్షి అయినాడు. విశ్వామిత్రుని తపోబలం చాలా గొప్పది. కాని, రాజసం వల్ల అతని తపోబలం చాలా వ్యర్థమయింది.*


*విశ్వామిత్రుని గురించి భాగవతంలో చాలా సంక్షిప్తంగా ఉంది. అతను రామలక్ష్మణులకు గురువు. వారికి ధనుర్విద్యను నేర్పిన మహానుభావుడు. అంతేకాదు, గాయత్రీమంత్రానికి విశ్వామిత్రుడు ఋషి.*


*విశ్వామిత్రునికీ, వసిష్ఠునికీ బద్ధ వైరం. విశ్వామిత్రుని రాజర్షిగానే అంగీకరిస్తాడు వసిష్ఠుడు. కాదు, తాను బ్రహ్మర్షినంటాడు విశ్వామిత్రుడు. ఆఖరికి ఆ స్థానాన్ని అందుకున్నాడతను.*


*విశ్వామిత్రుని ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు. అతనికి నూటక్క మంది కుమారులు. వారిలో మధ్యవాడు మధుశ్చంద్రుడు. ఫలితంగా అంతా మధుశ్చంద్రులయినారు.*


*హరిశ్చంద్రుడను యెక రాజుగలడు. అతడు తనకు కుమారుడు గలిగినయెడల తన కుమారుని యజ్ఞపశువుగాజేసి యాగముచేయునట్లు వరుణునిగూర్చి మ్రొక్కుకొనెను. ఆ పిమ్మట వరుణుని యనుగ్రహమున నాతనికి కుమారుడు గలిగెను. కాని నాతడెప్పటికప్పుడు యజ్ఞముచేయుటకు సుముఖుడుగాక కాలమును దాటవేయుచుండెను. ప్రతిజ్ఞను పాటించని ఆ రాజును వరుణదేవుడు "జలోదరవ్యాధి గ్రస్తుడవవుదువుగాక” అని శపించెను. రాజు వ్యాధిగ్రస్తుడై తన దోషమును తెలుసుకొని యజ్ఞమును చేయ సంకల్పించెను. యజ్ఞపశువుగానుండి ప్రాణములువీడ నిష్ఠము లేని నాతని కుమారుడు శునస్సేపుడు తండ్రియింటిని విడచి అరణ్యమునకు పారిపోయెను.*


*హరిశ్చంద్రుని యజ్ఞపశువయిన శునస్సేపుణ్ణి తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు విశ్వామిత్రుడు. పుత్రులతో సమానంగా చూశాడతన్ని. తన పుత్రులను కూడా అతన్ని అన్నగా చూడమని చెప్పాడు. పెద్దవారయిన యాభైమంది మధుశ్చంద్రులూ అందుకు అంగీకరించలేదు. కోపం వచ్చింది విశ్వామిత్రునికి. వారిని ‘మ్లేచ్ఛులు’ కండి అని శపించాడు.*


*చిన్నవారయిన యాభైమందీ శునస్సేపుణ్ణి అన్నగా భావించి అభిమానించారు. అందుకు సంతోషించాడు విశ్వామిత్రుడు. వారికి సంతానవృద్ధి కలిగేటట్టుగా దీవించాడు.* 


*జన్మతః భార్గవుడయినప్పటికీ తనని పుత్రునిగా విశ్వామిత్రుడు స్వీకరించడంతో శునస్సేపుడు కౌశికుడు అయినాడు. కౌశికుడికి అష్టకుడు, హరీతుడు, జయంతుడు, సుమదాముడు, మొదలయిన వారు జన్మించారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: