17-03-గీతా మకరందము.
శ్రద్ధాత్రయ విభాగ యోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - శ్రద్ధయే (సంస్కారమే లేక గుణమే) మనుజుని స్వరూపమనియు వచించుచున్నారు –
సత్త్వానురూపా సర్వస్య
శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయో౽యం పురుషో
యో యచ్ఛ్రద్ధస్స ఏవ సః ||
తాత్పర్యము:- ఓ అర్జునా! సమస్తజీవులకును వారివారి (పూర్వజన్మసంస్కారముతో గూడిన) యంతఃకరణము ననుసరించి శ్రద్ధ (గుణము, సంస్కారము) కలుగుచున్నది. ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగ గలవాడైయున్నాడు. ఎవడెట్టిశ్రద్ధగలిగియుండునో ఆతడట్టి శ్రద్ధయే యగుచున్నాడు. (అట్టిశ్రద్ధనే గ్రహించును; తద్రూపుడే అయియుండునని భావము).
వ్యాఖ్య:- మనస్సే (అంతఃకరణమే) మనుజుడు (ప్రతిబింబరూపజీవుడు); మనుజుడు మనస్సే. కావున మనస్సు శుద్ధముగా నున్నచో మనుజుడున్ను శుద్ధరూపుడే యగుచున్నాడు. ఇచట “సత్త్వానురూపా” అను పదములోని సత్త్వమనగా అంతఃకరణము. ప్రతివారికిని వానివాని జన్మాంతరసంస్కారములతో గూడిన యంతఃకరణమెట్లుండునో అట్టి శ్రద్ధ, అట్టి సంస్కారము, అట్టి గుణము వానికి కలుగుచున్నది. ఎవడు ఏ శ్రద్ధ, ఏ గుణము గలిగియుండునో ఆతడు తద్రూపుడే అయియుండును. కాబట్టి మొట్టమొదట మనుజుడు తనయంతఃకరణమును శుద్ధమొనర్చుకొని సాత్త్వికశ్రద్ధామయుడై యుండులాగున ప్రయత్నించి, సాధనాభ్యాసముచే క్రమముగ నిర్మలాత్మరూపుడై చెన్నొందుటకు ప్రయత్నించవలెను. ఎవనియొక్క చిత్త మెట్టి శ్రద్ధ,గుణము గలిగియుండునో తదనుగుణ్యమగు ప్రవృత్తియే ఆతడు కలిగియుండుటబట్టి (రాజసిక, తామసిక, శ్రద్ధలను పారద్రోలి) సాత్త్వికశ్రద్ధనవలంబించి క్రమముగ దానినిన్ని అధిరోహించి విశుద్ధసత్త్వ (ఆత్మ) స్థితిని జేరుకొనవలెను. అదియే ఆతని యథార్థస్వరూపము. స్థానము.
ప్రశ్న:- జీవులకు ఎట్టిశ్రద్ధ గలుగుచున్నది?
ఉత్తరము:- వారి యంతఃకరణమెట్లుండునో దాని కనుగుణ్యమగు శ్రద్ధయే (గుణమే) కలుగుచున్నది.
ప్రశ్న: - మనుజు డెద్దానిచే పరిపూర్ణుడైయుండును?
ఉత్తరము:- శ్రద్ధచే.
ప్రశ్న:- మనుజుని స్వరూపమేమి?
ఉత్తరము:- ఆతడెట్టి శ్రద్ధగలిగియుండునో, అదియే యాతని స్వరూపము (అయితే ఇది ప్రతిబింబిత (జీవ) రూపము. వాస్తవముగ బింబభూతమగు ఆత్మయే ఆతని స్వరూపమని యెఱుగవలెను).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి